71 పేజీలు, 13 షెడ్యూళ్లతో గెజిట్ నోటిఫికేషన్

హైదరాబాద్, మార్చి 2:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరో కీలక ఘట్టం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారి భారత ప్రభుత్వ రాజపత్రంలో సగౌరవంగా ముద్రితమైంది. నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రం ఒక బిల్లు అయితే.. ఇవాళ అది ఒక చట్టం. గెజిట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలోని 29వ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఉనికిలోకి రావడానికి ఆవిర్భావ తేదీ ప్రకటించే లాంఛనం మాత్రమే మిగిలింది. రాష్ట్ర విభజనలో అతి ముఖ్యమైన ఈ గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.

rajagayamఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్ర హోంశాఖ గెజిట్‌లో చేర్చుతూ కేంద్ర హోంశాఖ వైబ్‌సైట్‌లో ప్రజల ముందుంచారు. మార్చి 1 వ తేదీనే ఈ గెజిట్ అమలులోకి వచ్చింది. కాగా ఈ గెజిట్‌లో అపాయింటెడ్ తేదీని వెల్లడించలేదు. కాగా కొద్దిరోజులుగా గెజిట్, అపాయింటెడ్ తేదీకి సంబంధించి సాగుతున్న అనేక ఊహాగానాలకు గెజిట్ ప్రచురణతో కొంతవరకు తెరపడినట్టయింది. దీంతో తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడినట్లయింది. వందల బలిదానాలు, వేల ఆందోళనల ఫలితంగా చట్టరూపం దాల్చిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ కోసం సంపూర్ణంగా సిద్ధమైంది. భారత ప్రభుత్వ కార్యదర్శి పేరిట విడుదలైన ఈ గెజిట్‌లో దాదాపు డ్రాప్టు బిల్లులోని అంశాలే ఉన్నప్పటికీ, పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వం చేసిన సవరణలను ఇందులో చేర్చారు. డ్రాప్టు బిల్లులోని లోపాలను ఇందులో సవరించారు. ఇకపై అవశేష ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన భౌగోళిక, ఆర్థిక, న్యాయ, పాలనాపరమైన అంశాలన్నింటికీ ఈ గెజిట్‌లో ఉన్నదే ప్రామాణికం..ఫైనల్.

గెజిట్ ప్రకారం రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌ను సవరించి 29వ రాష్ట్రంగా తెలంగాణను చేరుస్తారు. మొత్తం 13 షెడ్యూళ్లలో ఈ రెండు రాష్ర్టాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సవివరంగా పేర్కొన్నారు. రాష్ట్ర భౌగోళిక సరిహద్దులు, చట్ట సభలు, న్యాయ పరిధి, ఆర్థిక వనరులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తులు అప్పులు.. ఇలా అన్ని అంశాల్లో ఏ రాష్ట్ర వాటా ఆ రాష్ర్టానికి ప్రత్యేకించారు. గెజిట్‌లోని అంశాలను పరికిస్తే .. 1956 నాటి హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న జిల్లాలన్నింటినీ కొద్దిపాటి తేడాలతో తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, మునగాల వంటి చిన్న సంస్థానాలు తెలంగాణ జిల్లాల్లో చేరగా కొన్ని తెలంగాణ జాగీర్లు ఆంధ్ర ప్రాంత జిల్లాల్లోకి చేరాయి. తాజా గెజిట్‌లో వాటిని కొనసాగించారు.

అయితే పోలవరం కారణంగా ఖమ్మం జిల్లాలోని 236 ముంపు గ్రామాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలో చేర్చిన జిల్లాల్లో హైదరాబాద్ ,ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం (జీఓ నం-111లో పేర్కొన్న రెవెన్యూ గ్రామాలు మినహాయించి, 2005 జూన్ 27న జారీచేసిన జీఓ మేరకు బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సీతారామనగరం, కొండ్రెకలు ఉన్నాయి) జిల్లాలు ఉన్నాయి. ఇక పదేళ్లకు మించకుండా రెండు రాష్ర్టాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. ఈ కాలవ్యవధి అనంతరం తెలంగాణకు హైదరాబాద్ పూర్తిస్థాయిలో రాజధానిగా మారుతుంది.

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని కోసం నిపుణుల కమిటీ ఆరు నెలల్లోపు ఏర్పాటు చేసి సరైన వివరాలతో నివేదిక ఇస్తుంది. రెండు రాష్ర్టాలకు ప్రస్తుత గవర్నరే రాష్ట్రపతి నిర్ణయించినంత కాలం కొనసాగుతారు. ఉమ్మడి రాజధాని పరిధిలోని ప్రజల భద్రత, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు అధికారాలు గవర్నర్‌కు ఇచ్చారు. ఈ విధుల నిర్వహణలో ఆయన తెలంగాణ మంత్రి మండలి సలహాలు స్వీకరిస్తారు. అయితే విధులు, కర్తవ్యాల్లో భాగంగా వ్యక్తిగత నిర్ణయం తీసుకునే స్వేచ్చ గవర్నర్‌కు ఉంటుంది.

చట్ట సభల సభ్యులు…
తెలంగాణ రాష్ర్టానికి 17 ఎంపీ స్థానాలు లభిస్తాయి. రాజ్యసభ విషయంలో ప్రస్తుత సభ్యులు కొనసాగుతారు. తర్వాత రాష్ర్టానికి కేటాయించే సంఖ్యను బట్టి ఎంపీలుంటారు. శాసనసభ విషయానికి వస్తే తెలంగాణకు 119 స్థానాలు ఉంటాయి. ఒక ఆంగ్లో ఇండియన్‌ను గవర్నర్ నియమిస్తారు. ఇక కౌన్సిల్ విషయానికి వస్తే తెలంగాణ శాసన మండలిలో 40మంది సభ్యులుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలను 225కు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 స్థానాలను 153కు పెంచుకునే వీలు ఇందులో కల్పించారు. నియోజక వర్గాల గుర్తింపు, పునర్విభజన బాధ్యతలు ఎన్నికల కమిషన్‌కు అప్పగించారు. అయితే ఈ పునర్విభజన ఎప్పుడు చేపట్టేది పేర్కొనలేదు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ స్థానాలు రాజ్యాంగంలోని నిబంధనల మేరకు రెండు రాష్ర్టాల్లో కొనసాగుతాయి.

ఇక హైకోర్టు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కోర్టు ఏర్పాటయ్యే వరకూ ఉభయ రాష్ర్టాలకు ప్రస్తుత హైకోర్టు కొనసాగుతుంది. జడ్జీల నియామకం, హైకోర్టు పరిధి రాష్ట్రపతి నిర్దేశిస్తారు. వీరి జీత భత్యాలను జనాభా నిష్పత్తిలో ఇరు రాష్ర్టాలు భరిస్తాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో రాష్ట్రపతి నిర్దేశిస్తారు. ఇరు రాష్ర్టాల ఆదాయ వ్యయాలను , ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచుతారు. ఫైనాన్స్ కమిషన్లు ఇందులో పాత్ర వహిస్తాయి. కంపెనీలు, కార్పొరేషన్లు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలోనే కొనసాగుతాయి. ఆస్తుల పంపకం నిర్దేశించిన మేరకు జరుగుతుంది. ఉద్యోగుల పంపిణీ, నదీజలాల బోర్డులు డ్రాప్టు బిల్లులో వివరించిన మాదిరిగానే పంపిణీ చేస్తారు.

ఇక రెండు రాష్ర్టాల ఆర్ధికాభివృద్ధి పారిశ్రామీకరణ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గెజిట్‌లో కొత్తగా ప్రతిపాదించారు. ఇరు రాష్టాల్లో వెనుకబడిన ప్రాంతాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో కేంద్రం సహకరిస్తుంది. ఆయా మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు అవసరాన్ని బట్టి అటవీ శాఖనుండి డీనోటిఫై వంటి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వివాదాస్పద 371(డీ) ఆర్టికల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే పదాల స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం అనే పదాలను చేర్చారు. విద్య విషయానికి వస్తే తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయ, ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.