7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ : కోదండరాం

వచ్చే నెల 7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. టీఎన్జీవో భవన్‌లో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిటీ కళాశాల నుంచి ఇందిరాపార్క్ వరకు 7న భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ర్యాలీలో వేలాది మంది తెలంగాణవాదులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ర్యాలీ ముగిసిన అనంతరం ఇందిరాపార్క్ వద్ద భారీ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ముల్కీ వారంగా ప్రకటిస్తామని చెప్పారు.

ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఆలస్యం అయ్యే కొద్ది పరిస్థితి విషమిస్తోందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తక్షణమే అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సమైక్యం వెనుక సీఎం, డీజీపీ
సమైక్య ఉద్యమం వెనుక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి ఉన్నారని కోదండరాం ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడాల్సింది పోయి ఉద్యోగులను, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సీఎం, డీజీపీ తమ పదవుల్లో కొనసాగేందుకు అనర్హులు అని చెప్పారు. డీజీపీ తెలంగాణ ప్రజలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారని అని తెలిపారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.