60 ఏళ్ల దోపిడీని చట్టబద్ధం చేస్తారా?

ఆంక్షలు, అధికారాల కత్తెరతో రాష్ట్రం ఇవ్వడం అంటే అది తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీవోఎం సభ్యులకు స్పష్టం చేశారు. ‘తెలంగాణ ఎవరి కోసం ఇస్తున్నారు? త్యాగాలు చేసిన తెలంగాణ ప్రజల కోసమా? దోచుకున్న సీమాంధ్రుల కోసమా?’ అని నిలదీశారు. అరవై ఏళ్ల దోపిడీ చట్టబద్ధం చేయాలనుకుంటున్నారా? అని నిగ్గదీశారు. మంగళవారం జీవోఎం ముందు టీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు హాజరయ్యారు. వారితోపాటు పార్టీ ఎంపీ వివేక్ కూడా పాల్గొన్నారు. అన్ని పార్టీల ప్రతినిధులకు 20 నిమిషాల చొప్పున సమయం ఇచ్చిన జీవోఎం సభ్యులు.. కేసీఆర్ బృందానికి గంట కేటాయించారు. జీవోఎం సభ్యులు ఏకీభవించేలా కేసీఆర్ తన వాదనలు వినిపించారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఆయన మాటల్లోనే…
-హైదరాబాద్‌పై ఆంక్షలు విధించి, అధికారాలన్నీ సీమాంధ్రుల వద్ద కేంద్రం వద్ద ఉంచుకుని తెలంగాణ ఇవ్వడమంటే తెలంగాణను కరి మింగిన వెలగపండును చెయ్యడమే అవుతుంది. అసలు తెలంగాణను ఎవరి కోసమిస్తున్నారు? ఎందుకోసమిస్తున్నారు? అనే విషయాన్ని కేంద్రం పునరాలోచించుకోవాలి. దశాబ్దాలుగా త్యాగాలు చేసిన తెలంగాణ ప్రజల కోసమిస్తున్నారా? ఇన్నాళ్లూ దోచుకున్న సీమాంధ్ర రాజకీయ నాయకుల కోసం, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఇస్తున్నారా? అనేది కేంద్రం తేల్చుకోవాలి. లీకుల రూపంలో కేంద్రం నుంచి వెలువడుతున్న సంకేతాలను చూస్తే 60 ఏండ్ల సీమాంధ్ర దోపిడీని చట్టబద్ధం చేయాలనుకుంటున్నట్లు కనిపిస్తున్నది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు సకలం కోల్పోయామని ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజలు.. తెలంగాణ ఇస్తున్నామనే నెపంతో కేంద్రం వ్యవహరిస్తున్న సీమాంధ్ర అనుకూల వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారు.

-పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కటం వల్లే 1969లో ఉద్యమం వచ్చింది. జీవో 36, జీవో 610లను సీమాంధ్ర పాలకులు అమలు చేయలేదు. హైదరాబాద్‌లోని ఏ ఒక్క హెచ్‌వోడీలో కూడా తెలంగాణ ఉద్యోగి లేడు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగుల సంఖ్య ఎంతో నివేదిక తెప్పించుకుని చూడండి.
-విద్యకు సంబంధించి సీమాంధ్రలో సీమాంధ్రలో 12 యూనివర్శిటీలుంటే తెలంగాణలో ఏడే ఉన్నాయి. కావాలంటే లెక్కలు తీయండి.

-నదీజలాల పంపిణీలో చట్టబద్ధంగా కేంద్రం నిర్ణయించిన ట్రిబ్యునల్ నిర్ణయాలకు మాత్రమే మేము కట్టుబడి ఉంటాం. తెలంగాణ నదీ జలాలను ఇప్పటికీ కొల్లగొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణకు ప్రత్యేకంగా ఉన్నదనుకున్న కృష్టానదిపైన ఉన్న జూరాల ప్రాజెక్టుపై జాయింట్ మేనేజ్‌మెంట్‌ను అడగడమంటే అంతకన్నా అన్యాయం మరోటి ఉండదు. ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ మీద జాయింట్ మేనేజ్‌మెంట్‌కు సీమాంధ్ర నేతలు ఒప్పుకుంటారా? నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. అసలు సాగర్ డ్యామ్‌ను తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి ప్రాజెక్టుగా ప్రారంభించారు. ప్రస్తుతమున్న డ్యామ్ స్థలంకంటే 19 కిలోమీటర్ల వెనుకకు తెలంగాణలోని ఏలేశ్వరం అనే గ్రామం వద్ద నందికొండ సాగర్ పేరుతో నిర్మించేందుకు నిర్ణయించారు. ప్రాజెక్టు ద్వారా 180 టీఎంసీల నీటిని తెలంగాణకు 60 టీఎంసీల నీటిని సీమాంవూధకు పంపిణీ చేయాలనే ప్రతిపాదనలు ఉండేవి. వీటన్నింటినీ తుంగలో తొక్కిన సీమాంధ్ర పాలకులు, అధికారులు సాగర్ డ్యామ్ నిర్మాణాన్ని 19 కిలోమీటర్ల కిందికి జరిపి, ప్రస్తుతమున్న చోటులో నిర్మించి తెలంగాణకు అన్యాయం చేశారు. ఎడమ కాల్వను ఎత్తులో పెట్టి, కుడి కాల్వను కిందకు కట్టి నీటి పంపిణీ ఆంధ్రకు ఎక్కువగా జరిగేందుకు కుట్రలు పన్నారు. దాంతో తెలంగాణకు రావాల్సిన 180 టీఎంసీలు ఆంధ్రకు, ఆంధ్రకు చెందాల్సిన 60 టీఎంసీల నీరు తెలంగాణకు తారుమారయ్యాయి.

-శ్రీశైలంలోనూ అదే తీరు : శ్రీశైలం ప్రాజెక్టుకింద లిఫ్టుల ద్వారా తెలంగాణకు నీరిస్తామన్న సీమాంధ్ర పాలకులు జీవోలను విడుదల చేసి, వాటి ప్రకారం ఆంధ్రలో మాత్రమే లిఫ్టులను నిర్మించి, తెలంగాణ లిఫ్టులను మాత్రం ప్రజల మీద వదిలేశారు. కేవలం 19 టీఎంసీల నీటిని మాత్రమే మద్రాసుకు మంచినీటి నిమిత్తం అందజేస్తామనే నెపంతో తెలుగుగంగ ప్రాజెక్టును నిర్మించి వందలాది టీఎంసీల నీటిని తరలించుకు పోతున్నారు. తెలంగాణకు సొరంగ మార్గం గుండా 20 టీఎంసీల నీటిని పంపిణీ చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ పనులే పూర్తి కాలేదు.

-శాంతి భద్రతల సమస్య పేరుతో హైదరాబాద్‌ను ఆక్రమించుకుని, తెలంగాణ ప్రజలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని 28 రాష్ట్రాలకు ఎటువంటి నిబంధనలు, హక్కులు ఉన్నాయో 29వ రాష్ట్రమైన తెలంగాణకు కూడా అవే హక్కులు, అధికారాలుండాలి. శాంతి భద్రతల పేరుతో హైదరాబాద్ మీద కిరికిరి పెట్టి, తెలంగాణ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసి, తమ ఆధిపత్యాన్ని చాటాలని సీమాంధ్ర నేతలు చేసున్న ప్రయత్నానికి కేంద్రం వంతపాడితే అది తెలంగాణ ప్రజలను అవమాన పరచడం తప్పించి మరోటికాదు. దేశవ్యాప్తంగా ఉన్న పార్శీలు, మార్వాడీలు, గుజరాతీలు, తమిళులు, కన్నడిగులు సహా అనేక జాతులు, మతాల వారు దశాబ్దాలుగా తెలంగాణలో స్థిరపడి, ఇక్కడి సంస్కృతిలో భాగమయ్యారు. తెలంగాణ ప్రజలు కూడా వారిని ప్రేమ, సౌభ్రాతృత్వంతో ఆదరిస్తున్నారు. వారికి లేని భయం సీమాంవూధులకు ఉంటుందనడం కేవలం దుష్ప్రచారం. ఆరు దశాబ్దాలుగా హైదరాబాద్ సహా తెలంగాణ వివిధ జిల్లాలలో నివసిస్తున్న సీమాంధ్రుల మీద ఒక్క దాడి జరిగిందా? 13 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. ఈ సందర్భంగా ఒక్క కేసు అయినా నమోదయిందేమో విచారించండి. ఇదంతా సీమాంధ్ర నేతల పెట్టుబడిదారులు ఆడుతున్న నాటకం. హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా వారు ఆక్రమించిన భూములు, పెంచుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు ఆడుతున్న డ్రామా. సీమాంధ్ర పాలనలో తమకు జరుగుతున్న అన్యాయానికి ఆవేదన చెందిన తెలంగాణ యువత తమను తాము బలిదానం కావించుకున్నారు తప్ప ఏ ఒక్క సీమాంధ్ర పౌరునిపైనా వేలెత్తలేదు.

-హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, తదితర పరిధుల్లో అధికారాలు, భూ రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు వల్ల ఇన్నాళ్లు దోపిడీ చేసిన సీమాంధ్ర నేతలకు, పెత్తందారులకు, పెట్టుబడిదారులకు తప్ప సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు. దశాబ్దాలుగా తెలంగాణ భూములను అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమించుకున్న గుప్పెడు మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. వీరి మాటలను పట్టించుకుని తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. భారత ప్రజాస్వామిక వ్యవస్థలపై నమ్మకాన్ని దేశ ప్రజలు కోల్పోయే విధంగా కేంద్రం వ్యవహరించవద్దు.

-రేపటి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని కాపాడగలదు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆహ్వానిస్తాం. తెలంగాణ ప్రజలు దేశ అభివృద్ధిలో ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలంటే వారికి స్వయం అధికారం ఇవ్వాలి. తద్వారా మాత్రమే భారత ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినదవుతుంది. అందుకు ఎటువంటి ఆంక్షలులేని, అధికారాల కోతలేని హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి. హైదరాబాద్ సీమాంధ్రులకు ‘అతిథి రాజధాని’ (గెస్ట్ కాపిటల్)గా మాత్రమే ఉండాలి. తాత్కాలిక రాజధానిగా హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర పాలకులను అతిథుల్లా తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. సీమాంధ్ర ప్రజలు వారి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.