57 గంటల 29 నిమిషాలే!

samaramఇదీ 20 రోజుల్లో నడిచిన సభాసమయం
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఈ సారి కేవలం 57 గంటల 29 నిమిషాలే జరిగాయి. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ మలివిడత సమావేశాలు ముగిశాయి. సాధారణంగా ప్రతిసారి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి రెండవ వారంలో ప్రారంభమై మార్చి చివరివారం వరకు నడిచేవి. అయితే కేంద్ర ప్రభుత్వ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చించి, బడ్జెట్ కేటాయింపులపై ప్రతిపాదించేందుకు పార్లమెంట్‌లో ఉన్న స్ఠాండింగ్ కమిటీల తరహాలోనే అసెంబ్లీలో కూడా డిపార్ట్‌మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్(డీఆర్‌ఎస్సీ)ల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. తొలి విడత సమావేశాలు ఈ ఏడాది మార్చి 13 నుంచి 26 వరకు, రెండవ విడత సమావేశాలు ఈ నెల 10 నుంచి శుక్రవారం 21వ తేదీ వరకు జరిగాయి. ఇన్ని రోజుల పాటు సమావేశాలు జరిగితే కేవలం 57 గంటల 29 నిమిషాలే సభ జరగడం గమనార్హం. బడ్జెట్ సమావేశాలు కనీసం 144 గంటల పాటు జరగాలని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

assemblyఆయా శాఖలకు సంబంధించి బడ్జెట్ పద్దులపై చర్చించి నివేదికలను సభకు సమర్పించేందుకు మొత్తం 12 డీఆర్‌ఎస్సీలను ఏర్పాటు చేశారు. ఆ 12 కమిటీలు తమ నివేదికలను శాసనసభకు సమర్పించినప్పటికీ ఏ ఒక్క కమిటీ నివేదికపై కూడా చర్చ జరగకుండానే బడ్జెట్ సమావేశాలు ముగియడం గమనార్హం. ప్రతి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఏదో ఒక వాయిదా తీర్మానం కోరుతూ, ఇతర ఆంశాలపై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం.. వంటి చర్యలతో సభ వాయిదా పడుతూ సమావేశాలు సజావుగా జరగకపోవడానికి కారణమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు తెన్నులు ఇలా ఉన్నాయి.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.