29వ రాష్ట్రంగా తెలంగాణ -ప్రత్యేక రాష్ర్టానికి రాజ్యసభ దీవెన

జైబోలో తెలంగాణ
-టీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. నెరవేరిన ఆరు దశాబ్దాల ఆకాంక్ష
-అడ్డుకోలేకపోయిన ఆఖరి ఆటంకాలు
-ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014
-నేడో రేపో రాష్ట్రపతి ఆమోదానికి
-పెద్దల సభలో అడుగడుగునా అడ్డుకున్న టీడీపీ
-న్యాయ చిక్కుల పరిష్కారానికి బీజేపీ పట్టు..
-వెల్‌లో హంగామా చేసిన తణమూల్
-మూడు గంటలపాటు బిల్లుపై చర్చ
-అంతకుముందు తొమ్మిదిసార్లు సభ వాయిదా
-ఆగ్రహించినా.. ఓపికతో సభనడిపిన కురియన్
-మార్గం సుగమంచేసిన ప్రధాని ప్రకటన
-సీమాంధ్రకు ఆరు సూత్రాల ప్యాకేజీ
-అవశేష రాష్ర్టానికి ఐదేళ్లు ప్రత్యేక ప్రతిపత్తి
-13 సీమాంధ్ర జిల్లాలకు ప్రోత్సాహకాలు
-సందేహ నివత్తిచేసిన సిబల్, షిండే, జైరాం

ఇది మాటలకందని మహావిజయం! దశాబ్దాల కన్నీళ్లను.. ఆనందబాష్పాలుగా మార్చి.. గుండెల్లో గూడుకట్టిన ఆఖరి ఆందోళనను పటాపంచలు చేసిన అపురూప సందర్భం! ఆత్మగౌరవ ఆకాంక్షల వెన్నుతట్టిన నినాదం! జై బోలో తెలంగాణ!! పోరాడితే బానిస సంకెళ్లు తెగిపోయాయి! తెలంగాణకు మరో దీపావళి! ఇక స్వేచ్ఛారావం! ఇక విముక్తి గీతాలాపన! ఇక భావి తెలంగాణ నవ నిర్మాణానికి అంకితమయ్యేందుకు మరో ఉద్యమం! కలల్ని ఏ అడ్డంకులూ చిదిమేయలేకపోయాయి! నమ్మకాలు అణువైనా సడలలేదు! చారిత్రక సూర్యోదయానికి అడ్డు నిలిచేందుకు సాహసించిన శక్తులన్నీ తోకముడిచాయి! సీడబ్ల్యూసీ తీర్మానం మొదలుకుని.. కేబినెట్ నిర్ణయం నుంచి.. నేటి చారిత్రక ఘట్టందాకా ముళ్లబాటలోనే దూసుకుపోయిన తెలంగాణ బిడ్డడు.. తుది విజయం ఖరారు చేసుకున్నాడు! జనసభ అయిన లోక్‌సభ ఇక్కడి జనాభీష్ఠాన్ని మన్నించిన రెండో రోజు.. పెద్దలు కొలువైన రాజ్యసభ..

chandra.jpg తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పెద్ద మనసుతో ఆశీర్వదించింది! ఆవేదనలను రూపుమాపి.. కుట్రతోకల మీడియా వక్రబుద్ధులను దనుమాడి.. తెలంగాణ గెలిచింది. సీడబ్ల్యూసీ తీర్మానంతో ఏడు నెలల క్రితం కూతేసిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. విజయవంతంగా తన మజిలీని చేరుకున్నది! రాష్ట్రపతి ఆమోదముద్రతో పడే సంతకమే ఇక లాంఛనం! వెరసి.. ఏళ్లనాటి అరిగోస ముగిసింది! పన్నెండు వందలమందికిపైగా అమరవీరుల త్యాగాలకు ఫలితం దక్కింది! ఆ త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఉదయించింది!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గెలిచింది. సబ్బండ వర్ణాల పోరాటాన్ని పొదువుకుని.. అమరుల ఆత్మత్యాగాల స్ఫూర్తి నింపుకొని.. అవాంతరాలు అధిగమించి.. స్వరాష్ర్టాన్ని సాధించుకుంది. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించేందుకు సిద్ధమైంది. చరిత్రాత్మక తెలంగాణ బిల్లుపై రాజ్యసభ చర్చించి.. ఆమోదం తెలియజేయడంతో పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊపినట్లయింది. సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురైనా.. తణమూల్, శివసేన వంటి పార్టీలు వ్యతిరేకించినా.. మెజార్టీ సభ్యుల ఆమోదంతో టీ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. లోక్‌సభలో మాదిరి కాకుండా.. బిల్లుపై దాదాపు ముఖ్య పార్టీల నేతలంతా చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి ఒకరికి మించి మాట్లాడారు. ఈ చర్చలు స్వల్ప ఆటంకాల నడుమ దాదాపు మూడు గంటలపాటు కొనసాగాయి. ఈ సమయం మొత్తం గందరగోళం, హైడ్రామా కొనసాగాయి. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు.. ఉదయం నుంచి మాకు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావాలి అన్న ప్లకార్డును రెండు చేతులతో పైకెత్తి చూపుతూనే నిల్చున్నారు.

kurian.jpgఒక దశలో ఆయన నడుం నొప్పి తాళలేక కూలబడ్డారు. ఆస్పత్రికి తరలించేందుకు కురియన్ ప్రయత్నించినా.. ఆయన మాత్రం అక్కడే కూర్చొని నిరసన ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు తణమూల్ సభ్యులు మొదటి నుంచి బిల్లు పత్రాలను చించివేసి.. గాల్లోకి ఎగరేస్తూనే ఉన్నారు. డీఎంకే సభ్యులు తమిళ జాలర్ల సమస్యలను ప్రస్తావిస్తూ పోడియంను చుట్టుముట్టారు. పదే పదే ఆటంకాలు ఎదురైనా ఒపికతో వ్యవహరించిన కురియన్.. వాయిదాలు వేశారే తప్పించి.. ఒక్క సభ్యుడిని కూడా సస్పెండ్ చేయలేదు. తెలంగాణను ఉదయం నుంచి బీజేపీ మద్దతుపై సస్పెన్స్ నెలకొన్నా.. తాము సీమాంధ్ర ప్రయోజనాలు సాధించేందుకే ప్రయత్నిస్తున్నాం తప్పించి.. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి కాదని బీజేపీ స్పష్టం చేయడం.. కొన్ని ఆందోళనలు లేవనెత్తినా.. చివరకు టీ బిల్లుకు బేషరతు మద్దతు ప్రకటించడంతో ఉత్కంఠ తొలగిపోయింది. ఈ విషయంలో ఉదయం నుంచి కొనసాగిన హైడ్రామా నేపథ్యంలో సభకు హాజరైన ప్రధాని మన్మోహన్‌సింగ్.. సీమాంధ్రకు ఉపకరించే విధంగా, బీజేపీ ఆందోళనలను చల్లార్చే విధంగా భారీ వరాలు ప్రకటించారు. ఆరు సూత్రాల అభివద్ధి ప్యాకేజీని అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారు.

pm1.jpg పన్ను ప్రోత్సాహకాలతోపాటు.. ఐదేళ్లు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తారు. తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే కాకుండా.. సీమాంధ్ర అభివద్ధికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు తన ప్రకటనలు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. అప్పటికే సభ తీవ్ర ఉద్రిక్తతల మధ్య నడుస్తున్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్, షిండేలకు రక్షణ కవచంగా వీహెచ్, నంది ఎల్లయ్య తదితర ఎంపీలు నిలిచారు. ప్రధాని మాట్లాడుతున్న సమయంలోనే టీఎంసీ సభ్యులు బిఉల్ల పత్రాలను చించి గాల్లోకి విసిరేశారు. టీ బిల్లు ఆమోదానికి ముందు సీపీఎం సభ్యులు వాకౌట్ చేశారు. బిల్లు ఆమోదం ప్రక్రియ కొనసాగిన దాదాపు ఐదుగంటల పాటు సభ రణరంగాన్ని తలపించింది. అసాధారణంగా ఉదయం నుంచి తొమ్మిదిసార్లు వాయిదాపడింది. అసలే ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న అధికార పక్షానికి స్వయంగా కేంద్ర మంత్రి.. అదీ ప్రధాని సమక్షంలో బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడటం మరింత ఇబ్బందికరంగా మారింది.

pm2.jpgఅసలు కేంద్ర మంత్రి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చా? అన్న సందేహాన్ని ప్రతిపక్ష సభ్యులు వ్యక్తం చేయడంతో అది వారి నైతికతపై ఆధారపడి ఉంటుందని చైర్ నుంచి రూలింగ్ వచ్చింది. బీజేపీ ఇతర పక్షాలు ప్రతిపాదించిన అన్ని సవరణలూ వీగిపోవడమో, ఉపసంహరించుకోవడమో జరిగింది. అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష బీజేపీకి మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని సీపీఎం, టీఎంసీ సభ్యులు ఆరోపించారు. బిల్లు తయారీలో కీలక పాత్ర పోషించిన జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాంరమేశ్ సభలోనే ఉండి.. సీమాంధ్ర ప్రయోజనాలకు సంబంధించి.. పలువురు సభ్యులు లేవనెత్తినప్పుడు ఓర్పుతో వారి సందేహాలన్నింటినీ నివత్తి చేయడమే కాకుండా.. పూర్తి భరోసాలు ఇచ్చారు. న్యాయపరమైన అంశాలను సభ్యులు లేవనెత్తుతున్న నేపథ్యంలో సభలోనే ఉన్న న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ఈ విషయంలో వచ్చిన అభ్యంతరాలన్నింటికీ వివరణలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఉభయ ప్రాంతాల్లోని అందరు ప్రజలను సంతప్తి పర్చడం చాలా కష్టం అని చెప్పారు.

kishan.jpgఅంతకు ముందు బీజేపీ టీ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తూనేసీమాంధ్రకు న్యాయం చేయాలని పట్టుపట్టింది. లోపాలతో కూడిన బిల్లును ఆమోదించరాదని, దానికి సవరణలు చేయాలని డిమాండ్ చేసింది. బిల్లు ఆమోదం విషయంలో అధికార పక్షం తగిన విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించింది. ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రలోని తెలుగు ప్రజలు అన్నదమ్ములని చెప్పారు. మనం ఇప్పుడు రాష్ర్టాన్ని విభజిస్తున్నామేగానీ.. దేశాన్ని కాదని అన్నారు. ఉభయ ప్రాంతాల వేగవంతమైన అభివద్ధి కోసమే విభజన జరుగుతున్నదని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి పదేళ్లు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. తాము టీ బిల్లుకు అనుకూలమేనని, అయితే.. చట్టబద్ధమైన, న్యాయపరంగా నిలబడగలిగే బిల్లు ఆమోదాన్ని కోరుతున్నామని జైట్లీ చెప్పారు.

అయితే.. బిల్లులో లోపాలు ఉన్నాయంటూ బీజేపీ పలు సవరణలకు పట్టుపట్టడంతో ఒక దశలో అనుమానాలు చెలరేగాయి. అయితే.. చివరకు వెంకయ్యనాయుడు ప్రవేశపెట్టిన కొన్ని సవరణలు వీగిపోవడం, మరికొన్నింటిని ఆయన ఉపసంహరించుకోవడంతో బిల్లుకు ఆటంకాలు తొలగిపోయాయి. రాష్ర్టాల పరిధిలోకి వచ్చే శాంతి భద్రలపై నిర్ణయాధికారాన్ని గవర్నర్‌కు కల్పించడానికి రాజ్యాంగ సవరణ అవసరం అన్న బీజేపీ సభ్యులు వెంకయ్యనాయుడు, జైట్లీ వాదనలను తిప్పికొట్టిన కపిల్ సిబల్.. రాజ్యాంగంలోని మూడవ అధికరణం కింద.. కొత్త రాష్ర్టాల ఏర్పాటు ప్రక్రియలో ఎదురయ్యే అంశాలను, అప్పటికప్పుడు తలెత్తే అంశాలను పరిష్కరించేందుకు పూర్తి అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయలో రాజ్యాంగ సవరణ అవసరం లేదని బలంగా వాదించారు. నిధుల విషయంలోనూ వెంకయ్య, జైట్లీ లేవనెత్తిన అభ్యంతరాలను జైరాంరమేశ్ నివత్తి చేశారు. నోటిఫైడ్ డేట్ (విభజన ప్రకటన రోజు) నుంచి అప్పాయింటెడ్ డేట్ (విభజన నిర్ణయం అమల్లోకి వచ్చే తేదీ) మధ్య వనరుల విషయంలో పూర్తి సహకారం కేంద్రం అందిస్తుందని ఆయన, షిండే భరోసా ఇచ్చారు.

ఈ విషయంలో ప్రధాని మాటలను ఉటంకించిన జైరాం.. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు తొలి సంవత్సరం పరిహారాన్ని 2014-15 కేంద్ర బడ్జెట్‌లో కేటాయిస్తామని చెప్పారు. పోలవరం విషయంలో లేవనెత్తిన అభ్యంతరాలపైనా జైరాం వివరణలు ఇచ్చారు. ఇతర ప్రాజెక్టులకు సంబంధించి.. ఇప్పుడు చేపట్టిన అని ప్రాజెక్టులనూ పూర్తి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఒక దశలో సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగిందని, ఈ ఫిక్సింగ్‌లోకి అధ్యక్ష స్థానం వెళ్లరాదని అన్నారు. తెలంగాణ అంశంతో తమ వద్ద గూర్ఖాలాండ్ డిమాండ్ తలెత్తుతుందని తణమూల్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర విషయంలో విదర్భ డిమాండ్ వస్తుందని శివసేన ఆందోళన తెలిపింది. తెలంగాణ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ మద్దతు పలుకగా, సీపీఎం, శివసేన, డీఎంకే, అన్నా డీఎంకే, తణమూల్ కాంగ్రెస్, అస్సాం గణ పరిషత్, సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకించాయి. సభలో టీడీపీ రెండుగా చీలింది. దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి తెలంగాణకు మద్దతు పలుకగా, సుజనాచౌదరి, సీఎంరమేశ్ వ్యతిరేకించారు. బిల్లుపై ఓటింగ్ సందర్భంగా డివిజన్‌కు పలువురు సభ్యులు పట్టుపట్టినా.. సభ అదుపులో లేని కారణంగా ఆ ప్రయత్నం చేయలేనని కురియన్ తేల్చి చెప్పేశారు. దీంతో సీపీఎం సహా పలువురు సభ్యులు వాకౌట్ చేశారు. బిల్లును ఓటింగ్‌కు పెట్టిన కురియన్ మూజువాణిఓటుతో బిల్లు ఆమోదం పొందిందని సరిగ్గా 8.01 గంటలకు ప్రకటించి.. సభను వాయిదా వేశారు.

వీగిన వెంకయ్య సవరణలు:
రాజ్యసభలో బిల్లు చర్చకు రావడానికి ముందే బీజేపీని విశ్వాసంలోకి తీసుకున్న యూపీఏ పెద్దలు.. కమలనాథుల ఆందోళనలకు కొన్ని పరిష్కారాలు ప్రతిపాదించారు. ఈ విషయంలో అరుణ్‌జైట్లీతో ప్రధాని స్వయంగా చర్చించారు. దీంతో సవరణలు ప్రతిపాదించినా.. వాటిపై పట్టుపట్టబోమని సర్కారుకు బీజేపీ నుంచి హామీ లభించింది. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తితో పాటు కొన్ని రాయితీలిస్తారని, దీనిపై ప్రధాని సభలో ప్రకటన చేస్తారని కూడా హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడిన వెంకయ్య.. గురువారం సభలో సవరణలపై పట్టుపట్టినా.. చివరకు అంగీకరించారు.

అయితే.. కేంద్రప్రభుత్వం తమకు ముందుగా హామీ ఇచ్చినట్లు సహాయాన్ని ప్రకటించలేదని వెంకయ్యనాయుడు ఆరోపించారు. ప్రత్యేక హోదాను10 ఏళ్ల పాటుకొనసాగించాలని, పోలవరంలో ముంపుకు గురయ్యే ప్రాంతాలన్నింటినీ అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు ఎలా భర్తీ చేస్తారో స్పష్టత లేదని, బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు లేవని ఆరోపించారు. ఈ సందర్భంగా కురియన్ జోక్యం చేసుకుని.. వెంకయ్య డిమాండ్‌ను అంగీకరిస్తారా? అని షిండేను ప్రశ్నించారు. దానికి ఆయన .. లేదు. ప్రత్యేక హోదా ఐదేళ్లకే పరిమితం అని స్పష్టం చేశారు. అయినప్పటికీ వెంకయ్య సవరణ ప్రతిపాదించగా.. సరైన మద్దతు లేక వీగిపోయింది. రెవెన్యూ లోటుపైవచ్చే బడ్జెట్‌లో ప్రణాళిక రూపొందిస్తామని జైరామ్మ్రేశ్ సర్దిచెప్పారు. పోలవరం నిర్మాణానికి అన్ని అనుమతులున్నాయని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తుందని ప్రకటించారు.

సీమాంధ్రకు ప్రధాని వరాలు
బీజేపీ, కాంగ్రెస్ సీమాంధ్ర సభ్యుల ఆందోళనలను శాంతింప చేసేందుకు ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ఆరు సూత్రాల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం సీమాంధ్రను ఆర్థికంగా పటిష్టం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ మాదిరిగా పన్ను రాయితీలను కల్పిస్తామని తెలిపారు. రెండు రాష్ర్టాలలోనూ పారిశ్రామికీకరణకు, ఆర్థికపురోభివద్ధికి ప్రత్యేక సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.

pradani.jpgరాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక అభివద్ధి ప్యాకేజీ ఇస్తామన్నారు. ఒడిశాలో కేబీకే (కొరాపుట్-బొలంగిర్-కల్హండి) స్పెషల్ ప్లాన్, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరాఖండ్ మాదిరిగా ఈ ప్యాకేజీ ఉంటుందని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు కింద పునరావాసం, సహాయం కోసం అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి రెవెన్యూ లోటును పరిగణలోకి తీసుకొని ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులను పరిగణలోకి తీసుకొని 2014-2015 బడ్జెట్‌లో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.