27న బయ్యారానికి బస్సుయాత్ర

TJAC
– 28న అక్కడే బహిరంగ సభ
– టీజేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయం
– బయ్యారం ఉక్కు తెలంగాణ ఆదివాసీలదే
– ఎండలను ప్రకృతివైపరీత్యంగా గుర్తించాలి
– వడదెబ్బ మృతులకు పరిహారం ఇవ్వాలి
– టీ జేఏసీ నేతల డిమాండ్
బయ్యారం ఇనుప గనులతో తెలంగాణలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బయ్యారానికి బస్సుయావూతగా వెళ్లాలని టీజేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. మరుసటి రోజు బయ్యారంలో బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం టీఎన్జీవో భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో బస్సుయాత్ర రూట్‌మ్యాప్‌ను నిర్ణయించారు. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోక్షిగతలను ప్రకృతివైపరీత్యంగా గుర్తించాలని టీజేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణకోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి మరణవాంగ్మూలాల ఆధారంగా కేసులు నమోదు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో వరంగల్ విద్యార్థి రమేశ్‌తో సహా మరి కొందరు తెలంగాణ ప్రజా ఫ్రంట్, న్యూడెమొక్షికసీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది. మండుతున్న ఎండలతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారిపోయిందని, తెలంగాణలో 51 డిగ్రీల నుంచి 55 డిగ్రీల వరకూ ఉష్ణోక్షిగతలు నమోదవుతున్నాయని టీజేఏసీ పేర్కొంది. వీటిని ప్రకృతివైపరీత్యంగా గుర్తించి.. తెలంగాణలో వెంటనే ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎండవేడిమికి తాళలేక మరణించిన వారి కుటుంబాలకు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

సమావేశం అనంతరం స్టీరింగ్ కమిటీ సభ్యులతో కలిసి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విలేకరులతో మాట్లాడారు. కేసులు బనాయించడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆయన మండిపడ్డారు. మిలియన్ మార్చ్ కేసులను తిరగతోడుతున్నారని, కొత్తగా కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. న్యూడెమొక్రసీ పార్టీ ఆఫీసుకు పోలీసులు సమన్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే సూర్యం, గోవర్ధన్, ఝాన్సీ తదితరులపై 12 కేసులు బనాయించారని చెప్పారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో రమేశ్ అనే విద్యార్థితో పాటు మరో 16 మంది పైన మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో అక్రమకేసులు పెట్టారని విమర్శించారు. ఈ కేసులన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
కేసులు ఎత్తివేస్తామన్న పాలకులు కొత్త కేసులు బనాయించి ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఈ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రోహిణి కార్తె రావడంతో ఎండలు మండిపోతున్నాయని, రోళ్లు పగిలే ఎండల కాలం వచ్చిందని అన్నారు. వాతావరణ శాఖ నిర్ధారించిన వాస్తవ ఉష్ణోక్షిగతలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియచేయడంలేదని ఆయన ఆరోపించారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో 51 డిగ్రీల నుండి 55 డిగ్రీల వరకు ఉష్ణోక్షిగతలు నమోదయ్యాయని చెప్పారు. అత్యధిక ఉష్ణోక్షిగతల వ్యత్యాసాల సందర్భంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ మండలికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మర్రి శశిధర్‌డ్డి కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడేనని, ఆయన కనీసంగా కూడా ఈ తీవ్ర ఎండవేడిమి పరిస్థితులను పట్టించుకోవడం లేదని కోదండరాం విమర్శించారు.

మనుషులతో పాటు పశువులు, పక్షులు తెలంగాణలో అల్లల్లాడి పోతున్నాయని, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్లపైన నీళ్లు చల్లాలని, మంచి నీటిసదుపాయాలు ఏర్పాటు చేయాలని, పశుపక్ష్యాదులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మరణవాంగ్మూలాల ఆధారంగా తెలంగాణ ద్రోహులపైన కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 29న మరోసారి టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ‘చలో అసెంబ్లీ’ తేదీని ఖరారు చేస్తామని చెప్పారు.

తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్ మాట్లాడుతూ ఈ నెల 27న బయ్యారానికి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. భీమదేవరపల్లి, మానుకోట, గూడూరు మీదుగా బయ్యారం చేరుకుంటామని పేర్కొన్నారు. 28న బయ్యారంలో బహిరంగ జరుపుతామని తెలిపారు. బయ్యారం ఉక్కు తెలంగాణ ఆదివాసీల హక్కు అనే విషయాలను విస్తృతంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. హెచ్‌ఆర్ పాలసీ పేరుతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులను కాలరాచివేస్తున్న నిబంధనలను జేఏసీ వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌కు జేఏసీ తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వారిపై అక్రమ కేసులు బనాయించి, ఉద్యమాన్ని కేసులతోనే అణచివేసేందుకు పాలకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఈ కుట్రలను ఛేదిస్తామని, తెలంగాణ మంత్రులను, శాసనసభ్యులను నిలదీస్తామని హెచ్చరించారు. అహింసాయుతంగా, ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం నడుస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని పాలకులు అల్లకల్లోలం చేయడానికి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో వేయిబలిదానాలు జరిగాయని , ఇందులో 650 మంది స్పష్టంగా తెలంగాణ ద్రోహుల పేర్లు చెప్పి మరణవాంగ్మూలాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మరణ వాంగ్మూలాల ప్రకారం కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

పాలకులు అక్రమంగా న్యూడెమొక్షికసీ, ప్రజావూఫంట్, తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగుల పైన కేసులు బనాయించి ఉద్యమకారులను కోర్టుల పాలు చేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. అన్యాయాలకు, కుట్రలకు సమాధానాలు చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఒకే ఒక్క జీవోతో కేసులన్నింటినీ కొట్టివేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.