26న కేసీఆర్ రాక – బేగంపేట నుంచి భారీ ర్యాలీ

 తెలంగాణ బిల్లు ఉభయసభలలో ఆమోదం పొందిన క్రమంలో రాజధాని హైదరాబాద్‌లో భారీ ఊరేగింపును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 26న ఊరేగింపు నిర్వహించడానికి టిఆర్‌స్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ రోజున డిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రమానికి చేరుకుంటారని, అక్కడి నుంచి గన్‌పార్క్ వరకు దాదాపు లక్షమందితో ర్యాలీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో సోనియాగాంధీని కలుసుకున్న కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్‌తో కూడా భేటీ అయ్యారు. దిగ్విజయ్‌సింగ్‌తో దాదాపు గంట పాటు చర్చ జరిగింది. ఆ చర్చలలో కేసీఆర్‌తో పాటు ఎంపీ కేశవరావు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ విలీనంతో పాటు ఇతర కీలకమైన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

కేసీఆర్ రేపు లేదా ఎల్లుండి రాష్ట్రపతిపధానిని కలిసి 26న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న టిఆర్‌ఎస్ అగ్రనాయకులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్ తదితరులు భారీ ర్యాటీ కోసం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతంలో కనీవిని ఎరుగని రీతిలో విజయోత్సవ ఊరేగింపు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ వెళ్లే ముందు సమైక్యరాష్ట్రంలో వెళుతున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తిరిగి వస్తానని చెప్పిన కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలని నాయకులు నిర్ణయించారు. ఆ రోజు మధ్యాహ్నం కేసీఆర్ ప్రత్యేక విమానంలో చేరుకోగానే ర్యాలీ బేగంపేటలో ప్రారంభమై గన్‌పార్క్ వరకు చేరుకుంటుందని పార్టీ నాయకులు చెప్పారు. ఆ తర్వాత ర్యాలీ తెలంగాణభవన్‌కు చేరుకుంటుందని ఆక్కడ కేసీఆర్ తెలంగాణ తల్లితో పాటు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారని వారు తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.