25న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ భేటీ

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నాయి. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

మండల స్థాయిలో గతంలో నిర్వహించాలనుకున్న శిక్షణా శిబిరాల కార్యాచరణ తేదీలను కూడా ఈ సమావేశంలో తేల్చనున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌పై షరతులు పెడితే ఒప్పుకోకూడదని ప్రజలను సమాయత్తపర్చడమే లక్ష్యంగా ఈ శిబిరాలు ఉంటాయని నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఉన్న పార్టీ యంత్రాంగానికి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం)కు టీఆర్‌ఎస్ పార్టీ తన నివేదికను సోమవారం పంపే అవకాశముంది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్ నేతృత్వంలో రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, విభజన సమయంలో వనరులు, అప్పులు, ఆదాయాల పంపిణీ వంటి అంశాలపై స్పష్టంగా వివరించినట్లు తెలిసింది. గతంలో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలోని కొన్ని ముఖ్య అంశాలను కూడా ప్రస్తుత నివేదికలో చేర్చి జీవోఎంకు పంపనున్నారని తెలిసింది. టీఆర్‌ఎస్ నేతల వద్ద ఉన్న సమాచారానికి మరింత పారదర్శకమైన సమాచారం జత చేశామని, పూర్తి నిజాయితీతో ఈ నివేదికను తయారు చేసినట్లు వినోద్ తెలిపారు. సాధ్యమైనంతవరకు సోమవారమే నివేదికను జీవోఎంకు పంపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.