2న కారెక్కనున్న కాంగ్రెస్ ఎంపీలు!

Trs
-నిజాం కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ
-టీఆర్‌ఎస్‌లో చేరనున్న మంద, వివేక్, రాజయ్య
-1వ తేదీన కాంగ్రెస్‌కు రాజీనామా
-గులాబీ గూటికి డాట్స్ నర్సయ్య కూడా..
-3న స్టేషన్‌ఘన్‌పూర్‌లో బహిరంగ సభ
-టీడీపీ నుంచి భారీగా చేరికలు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీలు మందా జగన్నాథం, డాక్టర్ వివేక్, సిరిసిల్ల రాజయ్య వచ్చే నెల 2వ తేదీన టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈ నెల 30 తేదీలోగా పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోకుంటే తాము కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తామని ముగ్గురు ఎంపీలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాము విధించిన డెడ్‌లైన్‌కు అనుగుణంగా 30లోగా పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనిపక్షంలో జూన్ 1వ తమ రాజకీయ భవిష్యత్తుపై వారు నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీగానీ, యూపీఏ ప్రభుత్వంగానీ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతో ఒకటవ తేదీన ఆ పార్టీకి రాజీనామా చేయాలని ఎంపీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రెండో తేదీన హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించి.. టీఆర్‌ఎస్‌లో చేరాలని మందా, వివేక్, రాజయ్య నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వీరితోపాటు డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నర్సయ్యగౌడ్ కూడా ఇదే సభ వేదికపై టీఆర్‌ఎస్‌లోనే చేరుతున్నట్లు తెలిసింది.
3న స్టేషన్‌ఘన్‌పూర్‌లో చేరికలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో టీడీపీలోని కడియం అనుచరులు, పలువురు ఆ పార్టీ నాయకులు వరుసగా గులాబీ గూటికి క్యూ కట్టారు. వచ్చే నెల మూడో తేదీన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించే సభలో ఆ పార్టీకి అంతోఇంతో మిగిలిన ఉన్న క్యాడర్ కూడా పూర్తిగా గులాబీ దళంలోకి చేరనుంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.