1969 హీరో రవీంధ్రనాథ్

ఉద్యమకారులకు అతనో స్ఫూర్తి..
పట్టుదలకు మారుపేరు! ఆయన ఎజెండా… తిరుగుబాటు జెండా!
20 ఏళ్లకే దేహం నిండా తెలంగాణావాదాన్ని నింపుకున్న నిఖార్సయిన తెలంగాణవాది..
వలసవాదుల పెత్తనం మీద నిప్పులు చెరిగిన యువ తరంగం..
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా.. నిజాం శకమూ ముగిసినా..
మా బతుకుల్లో ఈ చీకట్లు ఏంటి..? అంటూ ఆమరణానికి సిద్ధమైన
ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అన్నాబత్తుల రవీంవూదనాథ్ కథనం…

Ravindranathఅది 1969వ సంవత్సరం.. తొలి తెలంగాణ ఉద్యమానికి జవసత్వాలిచ్చిన సంవత్సరం. సీమాంవూధుల దోపిడీ విధానాలపై కన్నెర్ర చేసేందుకు ఉడుకునెత్తుటి బిడ్డలు ఏకమైన యేడు. నిధులు, నీళ్లు, వనరులు, ఉద్యోగాలు ఒక్క తెలంగాణ సర్వ సంపదను సీమాంవూధులు దోచుకెళుతున్నారు. ఈ దోపిడీకి అంతం లేదా? దానికి ఎలా అడ్డుకట్ట వేయాలి? వలసపాలకులను వెళ్లగొట్టడానికి ఏం చేయాలి? మన సంపదను మనం దక్కించుకోవాలంటే ఏ మార్గాలు అనుసరించాలి? మనకు స్వయం పాలన రావాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా మనం ఏ పంథా అనుసరించాలి? 44 ఏళ్ల కిందట రెండు పదుల వయసున్న ఓ కుర్రాడి మదిలో మెదిలిన ప్రశ్నలివి. ఈ ప్రశ్నలే.. చేయీచేయీ కలిపేందుకు ప్రేరణనిచ్చాయి. సీమాంవూధుల కుట్రలపై ఎగిసిన పిడికిళ్లయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా ఉద్యమ జ్వాలలుగా ఎగిసి పడ్డాయి. ఆనాడు రవీంవూదుడు అంటించిన ఆ చైతన్య కాగడా నేటికీ ఉద్యమకారులకు దారి చూపుతూనే ఉంది. ఇప్పుడా రవీంవూదుడు 66 సంవత్సరాల వేగుచుక్క. స్ఫూర్తి ప్రదాత. శరీరంలో బలం లేకున్నా.. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టిఉన్నా.. ఓపిక లేకున్నా.. మాట తడబడుతున్నా.. చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం సూటిగా చెప్పాడు. తెలంగాణ అనగానే నవనాడులు స్పందించేలా గళాన్ని సవరించాడు.. తన సహధర్మచారిణి కోమలవల్లి సహకారంతో!

డిగ్రీలో ఉన్నప్పుడే…
మా అమ్మ పేరు సత్యవతి. నాన్న కృష్ణారావు. డిగ్రీ వరకు ఇక్కడే( ఖమ్మంలో) చదివా. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడే జిల్లా స్టూడెంట్స్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యా. అప్పటికే జిల్లా సిరులమాగాణి ఐన సింగరేణిలో, పాల్వంచలోని కేటీపీఎస్‌లో తెలంగాణవాళ్లకు చోటు లేదనే విషయాన్ని గమనించా! సీమాంవూధులే ఎక్కువగా తిష్ట వేశారని తెలుసుకొని నాలో నేనే మథన పడేవాడిని. అసలు మన ప్రాంతంలో సీమాంవూధుల పెత్తనం ఏంటీ? అనే ఆలోచనతో నిద్ర పట్టేది కాదు. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలనే నిశ్చయానికి వచ్చా. వెంటనే నాతోటి విద్యార్థులందరితో మీటింగ్ పెట్టాను. మనకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పాను. స్టూడెంట్స్ అందరూ కూడా నాకు అండగా నిలబడతామని హామీ ఇవ్వడంతో ఉద్యమం చేసేందుకు సిద్ధమయ్యా.

ముందుగా ముల్కీ, నాన్‌ముల్కీ, బోగస్ ముల్కీల వివరాలు ఆరాతీశాం. ఆరుగురు సభ్యులు.. కొలిశెట్టి రాందాసు, కైలాస్‌నాథ్, నిమ్మల శంకర్‌రావు, కవిరాజు మూర్తి, కోలాహలం వెంక పి. రామస్వామిలతో ఒక కమిటీగా ఏర్పడి బోళ్ల వెంక ఇంట్లో ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఏఏ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎంత మంది సీమాంవూధులు ఉద్యోగాలు చేస్తున్నారు, తెలంగాణ వాళ్లెంతమంది ఉన్నారు? వారి పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? అనే విషయాలను సేకరించాలని నిర్ణయించుకున్నాం. అదే తడవుగా ఆ పనీ పూర్తి చేశాం. నమ్మలేని నిజాలు తెలిశాయి. భారీ ఎత్తున సీమాంవూధులు మన ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని గమనించి, వెంటనే కలెక్టర్‌కు ఓ నివేదిక సమర్పించాం. ఎన్నోసార్లు ఉన్నతాధికారులను కలిసి ఈ విషయమై వినతి పత్రాలు కూడా అందించాం.

ఆమరణ దీక్షే కరెక్టనుకున్నా..
ఎన్ని వినతి పత్రాలు అందించినా, ఎంతమంది అధికారులను కలిసినా న్యాయం చేస్తారన్న నమ్మకం లేకపోవడంతో ‘తెలంగాణ హక్కుల సాధన’ పేరుతో జనవరి 8, 1969న ఖమ్మం నడిబొడ్డున గాంధీచౌక్‌లో ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టా. నా దీక్షకు ఫస్ట్‌డే సపోర్ట్‌గా స్వాతంత్య్ర సమరయోధులు అర్వపల్లి సుధాకర్, గాడేపల్లి నర్సింహారావు, సుగ్గుల ఈశ్వరలింగం, ఫజలుల్లా లాంటి వాళ్లుకూడా మద్దతిచ్చారు. అంతేకాదు జిల్లావ్యాప్తంగా విద్యార్థులంతా కదిలొచ్చి సంఘీభావం ప్రకటించారు. మన వనరులు మనకు దక్కేవరకు నీవెంటే ఉంటామని వాళ్లూ ప్రతిజ్ఞ చేశారు. మరుసటిరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఇక్కడికొచ్చారు. అదేరోజు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వడంతో అశేష విద్యార్థిలోకం కదిలివచ్చింది. ఎక్కడికక్కడ తరగతులు బహిష్కరించి, దీక్షా శిబిరానికి చేరుకున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు ఖమ్మం వచ్చారు. ఆరోజు ఇప్పటికీ మరిచిపోలేను. రహదారులన్నీ కిక్కిరిసిపోయాయని మిత్రులు చెబుతుంటే నా దీక్ష సత్తా ఏంటో చూపించాననిపించింది. మూడో రోజు వివిధ పార్టీల నాయకులు నా దగ్గరకొచ్చి, దీక్ష విరమించాలని ఒత్తిడి చేశారు. అవకాశవాదులు, అక్రమార్కులు, సీమాంవూధుల తొత్తులు సైతం ప్రవేశించి దీక్ష విరమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. వచ్చిన దోపిడీదారుల్లో చాలామంది నామీద సామ దాన భేద దండోపాయాస్త్రాలను ప్రయోగించారు. నాది భయపడేతత్వం కాదు. అందుకే ఆ బెదిరింపులను లెక్కచేయలేదు. పైగా అవి నాలో పట్టుదలను పెంచాయే తప్ప ఏ మాత్రం వెనుకడుగు వేయనీయలేదు. ఐతే ఆ దగాకోరులు.. విద్యార్థి నాయకులను సైతం రెండు గ్రూపులుగా విడగొ ప్రయత్నించారు. ఆనాటి హోంమంత్రి వెంగళరావు (ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తే) ‘రవీంవూదనాథ్ దీక్ష విరమించాడ’ని తప్పుడు ప్రచారాన్ని చేయించాడు.

అంతేకాదు మా సహచరులు ఇద్దరితో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందడ్డితో మాట్లాడారు కూడా. అప్పటికే తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు తెలంగాణకు అనుకూలంగా సంతకాలు సేకరించారు. ముఖ్యమంవూతికి ఆ కాపీలను అందజేశారు. నాయకులు నా దగ్గరికి వచ్చి ముల్కీ, నాన్‌ముల్కీలపై వెరిఫికేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. మా ఫ్రెండ్స్‌లో కొందరేమో దీక్ష విరమించాలని, మరికొందరేమో కొనసాగించాలని నామీద ఒత్తిడి పెంచారు. కానీ నాలో రగులుతున్న తెలంగాణ కోరిక మాత్రం ముందుకే సాగమంటూ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితిలోనే నా దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది. అప్పటినుంచే నా ఆరోగ్యం క్షీణించసాగింది. నా ఆరోగ్యం దెబ్బతింటోదన్న విషయం బాగా ప్రచారం కావడంతో పాలక వర్గాల్లో వణుకు మొదలైంది. కాల్పులు సైతం జరిపి భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ నేను రవ్వంత కూడా తొణకలే, బెణకలే! అట్లా నా దీక్ష 14వరోజుకు చేరుకుంది. ఆ రోజు ఇప్పటికీ నా కళ్ల ముందు కదులుతూనే ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు సురేందర్‌డ్డి నా దగ్గరకొచ్చి ‘ఉద్యమం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం నీ డిమాండ్లను పరిశీలించడానికి ఒప్పుకుంది’ అని చెప్పాడు. దీంతో నా దీక్ష విరమించా. 14 రోజుల దీక్ష అనంతరం జనవరి 22న నన్ను ఆస్పవూతిలో చేర్పించారు.

అప్పటికి నాకు 22 ఏళ్లే! ఆ రోజుల్లో నన్ను ఎవరైనా కదిలిస్తే చాలు అనర్గళంగా మాట్లాడేవాడిని. ప్రపంచ విషయాపూన్నో పూసగుచ్చినట్లు చెప్పేవాడిని. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వివరం తెలిస్తే చాలు ప్రత్యక్షమయ్యేవాడిని అడ్డుకోవడానికి. నిజానికి ఆ స్వభావమే నన్ను కాలేజ్‌లో హీరోను చేసింది. లీడర్ షిప్ క్వాలిటీస్ బాగా ఉండడంతో స్టూడెంట్స్ అందరికీ నా మాట వేదవాక్కుగా ఉండేది. దీక్ష అనంతరంకూడా అటు చదువు సాగిస్తూనే ఇటు ఉద్యమాల్లో పాల్గొన్న. ఉస్మానియా యూనివర్సిటీలో ‘లా’ కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు ఖమ్మంలో లాయర్‌గా పనిచేశా.

అమ్మను చూసి బాధేసింది..
1969వ సంవత్సరం జనవరి 8వ తేదీ, ఉదయం 8 గంటలప్పుడు… ఖమ్మంలోని గాంధీచౌక్ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసి ఉంది. ఆమరణ దీక్షకు కూర్చునేందుకు సిద్ధమయ్యా. అప్పటిదాకా బాగానే ఉన్న నాలో మెల్లగా అలజడి మొదలైంది. విషయం ఏంటంటే.. నా దీక్ష విషయం నా ఫ్రెండ్స్‌కి, ఇతర పెద్దలకు తప్ప ఇంట్లో మా అమ్మానాన్నకు తెలియదు. దీక్ష మొదలవగానే విషయం తప్పకుండా నాన్నకు తెలుస్తుంది. కాస్త ఆలస్యంగానైనా అమ్మకూ తెలుస్తుంది. వాళ్లు అడిగితే ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. దీక్ష మొదలైన తొలిరోజు నుంచే భగ్నం చేసేందుకు శతకోటి ప్రయత్నాలు సాగాయి. అమ్మానాన్నలను బెదిరించారు. అప్పటికే బావ పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగి. అతన్నీ ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. మానసిక సంఘర్షణకు దారి తీసే పరిస్థితులు సృష్టించారు.

ravi ఇవన్నీ తెలుసుకుని అమ్మ శిబిరం దగ్గరకు వచ్చి బోరున ఏడ్చేది. ‘ఇవన్నీ నీకెందుకురా.. ఇంటికి రారా నాన్నా..’ అంటూ కన్నీళ్లు పెట్టేది. బుజ్జగించేంది. అయితే అమ్మ వస్తుందని తెలియగానే దుప్పటి కప్పుకుని పడుకునేవాడిని. దుప్పటి తీయమని, నాతో మాట్లాడమని ఆమె బాగా బతిమాలేది. ఐనా.. దుప్పటి తీసేవాడిని కాదు. తనతో మాట్లాడేవాడిని కాదు. ఎన్నో విషయాలు చెప్పేది. నా భవిష్యత్ గురించి గొప్పగా కలలు కంటున్నానని ఏడ్చేది. ఎంత చెప్పినా నేను వినకపోయే సరికి ’నువ్వు మొండోడివిరా’ అనుకుంటూ అక్కడినుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లేది. అమ్మ అలా వెళ్లగానే నాకు కన్నీళ్లు ఆగేవి కాదు. అమ్మను అలా చూడాలంటే చాలా బాధేసేది. నిజం చెప్పాలంటే ఆ క్షణంలో నేను తల్లిదంవూడుల బంధం కంటే తెలంగాణ ఉద్యమమే ముఖ్యంగా భావించాను.

వారిచ్చిన స్ఫూర్తే…
1968వ సంవత్సరం రెండవభాగంలో పాల్వంచ కేటీపీఎస్‌లో పనిచేస్తున్న కొలిశెట్టి రాందాసు ముల్కీ ఉద్యమానికి ఆజ్యం పోశాడు. ఆయన ఫ్రెండ్ కోలాహలం వెంక కలిసి, మన ఉద్యోగాల్లో పరుల పెత్తనాన్ని ప్రశ్నించసాగారు. కుళ్లు, కుతంవూతాలు ఎన్ని జరిగినా.. బెదిరింపులు, వేధింపులు ఎన్ని ప్రయోగించినా మనవాళ్ల పక్షానే వాళ్లు నిలబడ్డారు. నిజానికి ఇలాంటి పనులన్నీ రహస్యంగానే జరిగేవి ఆరోజుల్లో! ఇలాంటి తంతు బహిరంగంగా జరిగినట్లు ఎవరి దృష్టికైనా వస్తే పరిస్థితులు దారుణంగా ఉండేవి. ఎంతో పర్టిక్యులర్‌గా గమనిస్తే తప్ప ఈ విషయాలు బయటపడేవి కావు. వీరు చేస్తున్న మంచి పనికి తెలంగాణవాదులు కాస్త సహాయ సహకారాలు అందించడం మొదలుపెట్టగానే జిల్లాలో సంచరించి, బలాన్ని క్రోడీకరించే పనిలో పడ్డారు. అంతేకాదు పరుల పెత్తనాన్ని ప్రశ్నించడమే పనిగా పెట్టుకుని జిల్లాలో విస్తృత ప్రచారం మొదలు పెట్టారు. ముల్కీ, నాన్‌ముల్కీ ఉద్యమం గురించి రాందాస్, వెంక జిల్లా అంతటా తిరుగుతూ, మా కాలేజీ తలుపు తట్టారు. అప్పుడు 30 మంది విద్యార్థులుండే గడుసైనా బ్యాచ్ మాది. దేనికైనా ముందుండేవాళ్లం. వారు కాలేజీకి వచ్చి మమ్మల్ని కలిశారు.

ఉద్యమ ఉగ్గుపాలను మాకు అప్పుడు వారే నూరి పోశారు. మనకు జరుగుతున్న అన్యాయాన్ని, కళ్లకు కట్టినట్లు వివరించారు. అందుకే వారి మాటల స్ఫూర్తితోనే జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు తిరిగి ఎందరు తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు..? ఎందరు సీమాంవూధులు తిష్ట వేశారనే గణాంకాలను సేకరించాం. ఆ గణాంకాల్లో 70 శాతం సీమాంవూధులు, 30 శాతం మనవాళ్లు ఉన్నారన్న విషయం తెలియడం, ఉన్న 30 శాతం ఉద్యోగుల్లో కూడా మన వాళ్లు అంతగా ప్రాధాన్యం లేని ఉద్యోగాల్లో ఉండడం విస్మయం కలిగించింది. ఈ నేపథ్యమే ఆమరణానికి పురిగొల్పింది.

మన స్లీపర్ కోచ్ తరలిపోయింది..
ఖమ్మం జిల్లా చింతకానిలో కాంక్రిట్ స్లీపర్ కోచ్ ఫ్యాక్టరీని స్థాపించి, వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని 1989లో అప్పటి రైల్వేశాఖ మంత్రి మాధవరావ్ సింధియా పార్లమెంట్ సెంట్రల్‌హాల్లో ప్రకటించారు. మంత్రి ప్రకటన రాగానే అదే సంవత్సరం సుమారు 10 ఎకరాల స్థలాన్ని చింతకానిలో సేకరించారు. అప్పటి మంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన కూడా చేశారు. అప్పుడు వేసిన శిలాఫలకం నేటికీ ఎందుకు వెక్కిరిస్తూ ఉంది? దానికి కారణం లేకపోలేదు. జిల్లాలో నక్సలైట్ల బూచీ చూపెట్టి మనోళ్లే, మన నాయకులే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టి ఫ్యాక్టరీని ఆంధ్రాకు తరలించుకుపోయారు. ఖమ్మం జిల్లా నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమని అనూహ్యంగా తెరమీదకు తెచ్చి ఆంధ్రాకు తరలించేటట్లు ఈ జిల్లా నాయకులే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే జిల్లాకు రావాల్సిన ఫ్యాక్టరీ సీమాంవూధకు తరలడానికి కారకుపూవరైతే ఉన్నారో.. వారే తెలంగాణ సైతం రాకుండా అడ్డుపడుతున్నారు. మన నేతలే మన నోట్లో మన్ను కొడుతున్నారు. నట్టేటా ముంచుతున్నారు.

ఉద్యమం చివరిదశకు చేరింది..
ఇప్పుడు ఉద్యమం చివరి దశకు చేరింది. వాడీవేడీ కలగలిపిన సమయం ఇది. రాజకీయ నేతలను నమ్ముకోకుండా విద్యార్థులే ముందుండి నడిపిస్తే మన కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. రాజకీయ నాయకులు ఊసర వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులకు ఆస్కారమివ్వకుండా స్వతంవూతంగా విద్యార్థి లోకం గళమెత్తుతే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం. నేను దీక్ష చేసే సమయంలో కూడా రాజకీయ నాయకులను సాధ్యమైనంత దూరంగానే ఉంచాను. విద్యార్థులు, ఉద్యోగులే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావాలి. స్టూడెంట్స్ కొంతకాలం ఉద్యమానికి పరిమితమై పాలనను స్తంభింపజేయాలి. ప్రభుత్వాల్లో వణుకు పుట్టించాలి. యువత తలుచుకుంటే సాధ్యంకానిదేదీ లేదని నిరూపించాలి.

ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి, సీట్లు కాపాడుకునేందుకే సిగపట్లు పట్టే నాయకులను బజారులో నిలబెట్టాలి. ప్రజలంతా సామూహికంగా ఏకతాటిపై నడిచి, మన ఆకాంక్షను ఎలుగెత్తి చాటాలి. జలగం వెంగళరావు ఈ జిల్లాలో పుట్టి పెరిగి, రాష్ట్రాన్ని ఏలి కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాడు. తెలంగాణ అంశాన్నే అడ్డుపెట్టుకుని ఇందిరమ్మను ప్రసన్నం చేసుకుని మర్రి చెన్నాడ్డి సీఎం అయ్యాడు. పీఠమెక్కాక తెలంగాణ ద్రోహిగా మిగిలాడు. ఇప్పుడు కూడా ఊసర నాయకులు తెలంగాణను అడ్డుపెట్టుకుని పదవులు పొందుతున్నారు. నోట్లకు అమ్ముడవుతున్నారు. వారి కుట్రలు ఛేదించడం ఒక్క విద్యార్థిలోకానికే సాధ్యం. వెనుదిరిగి చూడకుండా తెగించి కొట్లాడుతేనే తెలంగాణ సాధ్యం.

This entry was posted in TELANGANA MONAGALLU, Top Stories.

Comments are closed.