-25న హైదరాబాద్‌లో టీజేఏసీ మహాధర్నా
-సాగదీస్తే సాగనంపుతాం
-ఇదే నినాదంతో ఉద్యమ కార్యాచరణ
-తెలంగాణ తథ్యం.. వచ్చేదాకా పోరాటం
-టీజేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టీకరణ
తెలంగాణ సమస్యను సాగదీయకండి. కుంటిసాకులతో ప్రకటనను వాయిదా వేసి తెలంగాణ సహనాన్ని, ఓపికను పరీక్షించకుండా తక్షణం రాష్ట్రాన్ని ప్రకటించండి. డిసెంబర్ 9, 2009 ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు కేంద్రం ప్రకటించాలి. సమస్యను సాగదీస్తే, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. ప్యాకేజీలు, రాయల తెలంగాణ వంటి ఊసుపోని కబుర్లతో పొద్దుపుచ్చవద్దని హితవు పలికారు.
విభజన అనంతర సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే నేర్పు, పరిణతి, వివేచన, సహనం, ప్రజ్ఞ, నైపుణ్యం తెలంగాణ ప్రజలకు ఉన్నాయని స్పష్టం చేశారు. మంగళవారం జేఏసీ కార్యాలయంలో జేఏసీ ముఖ్యుల అత్యవసర భేటీ జరిగింది. ఈ భేటీలో టీజేఏసీ ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. చైర్మన్ కోదండరాంతో పాటు కో చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, వీ శ్రీనివాస్‌గౌడ్, జేఏసీ ప్రోగ్సామ్ కమిటీ చైర్మన్ రఘు, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, సీ విఠల్, రసమయి బాలకిషన్, ఇంజినీరింగ్ జేఏసీ చైర్మన్ టీ వెంకటేష్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ అయాచితం శ్రీధర్, టీ సినిమా జేఏసీ చైర్మన్ రోషం బాలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ బోడోలాండ్, గుర్ఖాలాండ్, విదర్భ వంటి డిమాండ్లతో తెలంగాణను పోల్చవద్దని విజ్ఞప్తి చేశారు. అలా చేయడం ఆయా ప్రాంతాల ప్రజలను అవమాన పరచడమేనని వ్యాఖ్యానించారు. ఒక ప్రాంత సమస్యకు మరో ప్రాంత సమస్యకు సారూప్యత ఉండదని, ప్రతీ ప్రాంతీయ సమస్యలో వైవిధ్యం ఉంటుందని వివరించారు. ఆరుదశాబ్దాల సీమాంధ్ర పరిపాలనలో ఇనుప గనులు, బొగ్గు గనుల దోపిడీ, భూకుంభకోణాల దోపిడీలతో జగన్‌లను సృష్టించారని, అంతకన్నా తెలంగాణకు జరిగిన మేలు లేదని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు నెగ్గేవరకూ ఉద్యమాలు నిర్మిస్తూనే ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణకోసం సోమవారం బలిదానం చేసుకున్న వేణుకు జేఏసీ తరఫున జోహార్లర్పించారు.
తెలంగాణ కోసం ఎవరూ ఆత్మార్పణ చేసుకోవాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగానే ఈ నెల 19 నుంచి 25 వరకు అన్నీ జిల్లాలలో జనచైతన్య యాత్రలు, సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. 25న హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 19న రంగారెడ్డి జిల్లాలో ఒకే రోజున వికారాబాద్, తాండూర్లలో జనచైతన్య యాత్రలు ప్రారంభమవుతాయని, జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తామని వీ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. 20న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, కామారెడ్డిలో, 21న మెదక్, సంగారెడ్డిలో, 22న భువనగిరి, నల్లగొండలో, 23న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో, 24న ఇబ్రహీంపట్నంలో సదస్సులు, జనచైతన్యయాత్రలు నిర్వహిస్తామని ప్రకటించారు.
‘సాగదీస్తే కాంగ్రెస్‌ను సాగనంపుతాం’ నినాదంతో సదస్సులు, ధర్నాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే నక్సలిజం సమస్య వస్తుందని చెప్పడం రాజకీయ అపరిపక్వతకు, మూర్ఖత్వానికి నిదర్శనమని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ ప్రజలు దశాబ్దన్నర కాలంలో తమను తాము హింసించుకున్నారే తప్ప ఇతరులేవ్వరినీ నొప్పించలేదని ఆయన గుర్తు చేశారు. నక్సలైట్ల బూచీ చూపి రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి అభాసుపాలయ్యారని అన్నారు. నక్సలైట్లు ఉద్యమించిన నాటి సామాజిక ఆర్థిక సమస్యలు ఇప్పుడు లేనే లేవని, నక్సలిజం పెరగడానికి అవకాశాలు లేవని అనేక కోణాలలో సామాజిక పరిశోధనలు జరిగాయని వివరించారు. 1956 నుంచి తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారని సీ విఠల్ స్పష్టం చేశారు. ప్యాకేజీలను, బుజ్జగింపులను తెలంగాణ సహించే పరిస్థితులలో లేదని హెచ్చరించారు.
సీడబ్ల్యూసీ భేటీ రోజు మహాధర్నా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు, పార్లమెంటులో బిల్లు నెగ్గేవరకు కాంగ్రెస్‌పై నిరంతర ఒత్తిడి జరుపుతూనే ఉండాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఇందుకోసం కాంగ్రెస్‌ను విశ్వసించవద్దన్న ప్రచారం కొనసాగిస్తూనే ఉండాలని, శత్రువు ఎత్తుగడలపట్ల అప్రమత్తంగా ఉండాలని జేఏసీ వ్యూహం రూపొందించింది. జేఏసీలోని సభ్యులందరూ అవసరాన్ని బట్టి కాంగ్రెస్‌ను పొగడడం, బుజ్జగించడం, విమర్శించడం వంటి వ్యూహాత్మక పద్దతులు అనుసరించాలని నిర్ణయించారు.
మంగళవారం జేఏసీ అత్యవసర సమావేశం ముఖ్యనాయకుల సమక్షంలో జరిగింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 19 నుండి జనచైతన్య యాత్రలు నిర్వహించాలని, 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా జరపాలని నిర్ణయించారు. ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి అనుగుణంగా మహాధర్నాను నిర్వహించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ముఖ్యమంత్రి కోర్ కమిటీలో ఇచ్చిన నివేదికకు కౌంటర్‌గా డిప్యూటీ సీఎంతో వాస్తవాలతో ఒక నివేదిక ఇప్పించాలని ఇందుకోసం ఆయనకు సహాయం అందించాలని చర్చల్లో సూచనపై వారు చర్చించారు. అధిష్ఠానానికి, యుపిఏ, ఎన్డీఏ భాగస్వామ్య రాజకీయ పక్షాల ముఖ్యనాయకులకు ఈ నివేదిక అందించేందుకు కృషి చేయాలని కూడా ప్రతిపాదించారు. ఓవైపు రాజకీయ ప్రక్రియలు చేస్తూనే నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, ప్రజల అండదండలతో ఉద్యమ కార్యాచరణలకు పదును పెడుతూనే ఉండాలని నిర్ణయించారు.