12 నుంచి అసెంబ్లీ సమావేశాలు


రాష్ట్ర శాసన మండలి, శాసన సభ శీతాకాల సమావేశాలు ఈ నెల 12వ తేదీ గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు శాసన సభా, శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ఆదివారం వేర్వేరుగానోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కార్యాలయం నుంచి ఆదివారం సమాచారం పంపించారు. శాసన మండలి, శాసన సభ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే ఈ నెల 11వతేదీ బుధవారం రెండు సభల బిజినెస్ అడ్వయిజరీ కమిటీలు(బీఏసీలు) సమావేశం కానున్నాయి. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును గత శుక్రవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి వద్ద పరిశీలనలో ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు ఈ నెల 9 లేదా 10 తేదీల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
గవర్నర్ బిల్లును పరిశీలించిన తర్వాత వెంటనే సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి అసెంబ్లీకి పంపే అవకాశం ఉన్నట్లు అసెంబ్లీ కార్యాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సాధారణంగా కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే బీఏసీ సమావేశాలు నిర్వహించడం అనవాయితీ. కాగా ఈసారి శీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందుగానే బీఏసీ సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంతో విభజన ముసాయిదా బిల్లుపై బీఏసీలో చర్చించి సమావేశాలు ప్రారంభం కాగానే తొలి అంశంగా ముసాయిదా బిల్లుపై చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. బీఏసీ సమావేశాల కంటే ముందే టీ బిల్లు వచ్చే అవకాశం ఉన్నందున శాసన సభా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే అసెంబ్లీ సమావేశాలు 8 రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని, ఇదే అంశంతో ఈసారి సమావేశాలను సరిపెడతారంటున్నారు. అలాకాకుండా శాసన మండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బిల్లు అసెంబ్లీకి చేరితే శీతాకాల సమావేశాలను పొడిగించే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ లెక్కన దాదాపు 20 రోజుల వరకు ఈ సమావేశాలు జరుగుతాయని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.