11 స్థానాలు గెలుచుకోనున్న టీఆర్‌ఎస్-కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీయేదే

న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కారుదే జోరని మరోసారి సర్వేలు పేర్కొన్నాయి. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 11 స్థానాలు గెల్చుకుంటుందని హస్నా రిసెర్చ్ గ్రూప్‌తో కలిసి ఎన్డీటీవీ నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందుతుందని పేర్కొంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో మెజార్టీ ఓటర్లు ఆ పార్టీవైపే చూస్తున్నారని సర్వే ఫలితాలనుబట్టి తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 9 స్థానాలు అదనంగా లభిస్తాయని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 2009 ఎన్నికలతో పోల్చితే ఏడు స్థానాలు కోల్పోయి.. ఐదు స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది.
party తెలంగాణలో టీడీపీ దారుణ పరాభవం చవి చూడక తప్పదని స్పష్టమవుతున్నది. ఈ పార్టీకి ఒక్క సీటు కూడా లభించే అవకాశాల్లేవని సర్వే తేల్చింది. ఓట్లశాతాన్ని బట్టి చూస్తే టీఆర్‌ఎస్‌కు 33శాతం వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 27%, బీజేపీకి 15%, టీడీపీకి 8%, ఇతరులకు 17శాతం లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

జాతీయ స్థాయిలో ఎన్డీయే!
దేశంలో తదుపరి ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని ఎన్డీటీవీ సర్వే అంచనా వేసింది. బీజేపీకి సొంతంగా 195 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన శివసేనకు 13, టీడీపీ (పొత్తు కుదిరితే)9, అకాలీదళ్ 4, ఎల్‌జేపీ 3, ఆర్‌ఎల్‌ఎస్పీ 1, హెచ్‌జేసీ 1, ఎన్‌పీఎఫ్ 1, ఇతరులు 2 స్థానాలు గెలుస్తారని తెలిపింది. ఎన్డీయేకు మద్దతిచ్చే పార్టీల్లో జేఎంఎం 2, స్వతంత్రులు 2, ఎంఎన్‌ఎస్1, ఎస్‌డీఎఫ్ 1, ఇతరులు 8 గెల్చుకుంటారని పేర్కొంది. ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్, అన్నాడీఎంకేలు ఎన్డీయేకే మద్దతు ఇస్తాయన్న సర్వే.. ఆ రెండు పార్టీల బలాలు (టీఆర్‌ఎస్11, అన్నాడీఎంకే 27) కలుపుకొని ఎన్డీయే+మిత్రుల సంఖ్య 281కి చేరుకుంటుందని, తద్వారా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని సూత్రీకరించింది. యూపీఏ విషయానికి వస్తే.. కాంగ్రెస్‌కు 106 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. యూపీ భాగస్వామ్య పక్షాల్లో ఆర్జేడీ 8, ఎన్సీపీ 5, ఆర్‌ఎల్‌డీ 3, జేకేఎన్‌సీ 3, ఏయూడీఎఫ్ 1, ఇతరులు 3 స్థానాల్లో.. మొత్తంగా కూటమి 129 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

ప్రత్యామ్నాయ (మూడో) కూటమిగా భావిస్తున్న పార్టీల్లో వామపక్షాలు 18, బీజేడీ 17, ఎస్పీ 13, జేడీయూ 5, జేడీఎస్ 2 స్థానాల్లో గెలుపొందుతాయని తెలిపింది. అంటే వీటి సంఖ్య 55గా ఉండనుంది. ఇతర పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ 32, బీఎస్పీ 16, వైఎస్సార్సీపీ 15, డీఎంకే 10, ఆప్ 4, ఎంఐఎం1 స్థానం గెల్చుకుంటాయని తెలిపింది. వీటి మొత్తం 78గా ఉంది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.