100+15=టార్గెట్ తెలంగాణ

 

trs-sabha
స్వీయ రాజకీయశక్తిగా ఎదగడం
– రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసించడం
– అనివార్యతను కల్పించి.. రాష్ట్రం సాధించడం
– సంకీర్ణ యుగంలో సాహసోపేత నిర్ణయాలు
– వ్యూహ రచనకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్
– గుబాళించనున్న గులాబీ జాతర
– నేడు ఆర్మూర్‌లో పార్టీ ఆవిర్భావ వేడుక
– పది జిల్లాల నుంచి 35వేల మంది హాజరు
– సకల ఏర్పాట్లు సిద్ధం చేసిన నాయకత్వం
– శోభాయమానంగా ఆర్మూర్ పట్టణం
తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ సమాయత్తమవుతోంది. స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగి, దేశ, రాష్ట్ర రాజకీయాలను శాసించేందుకు వ్యూహాన్ని రచిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ అనివార్యతను సృష్టించి.. తెలంగాణ సాధించే దిశగా సాహసోపేత నిర్ణయాలకు సిద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 100 అసెంబ్లీ స్థానాలను, 15 పార్లమెంటు స్థానాలను గెల్చుకోవడం ద్వారా కీలక రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడకతప్పని పరిస్థితిని కల్పించి, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు అజెండాను రూపొందించుకోనుంది. ఈ కీలక దశకు ఆర్మూర్ సభ వేదిక కానుంది. గత పన్నెడేళ్లుగా తెలంగాణ సాధన కోసం విరామమెరుగక పోరాటాలు చేస్తున్న టీఆర్‌ఎస్ 13వ ఆవిర్భావ వేడుకను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో స్ఫూర్తిదాయకంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం సకల ఏర్పాట్లు భారీ స్థాయిలో పూర్తి చేసింది. తెలంగాణ కోసం ఉద్యమాలను నిర్వహించడంలో చాంపియన్‌గా మారిన ఆ పార్టీ అధినేత కేసీఆర్.. రాజకీయంగా శక్తిని కూడగట్టుకునేందుకు పావులను చురుకుగా కదుపుతున్నారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆర్మూర్ సభలో చర్చకు పెట్టనున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగనున్నట్లు ఇప్పటికే బలమైన సంకేతాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో 100 అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాజకీయంగా కేంద్ర, రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదగాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. 2004, 2009లో కాంగ్రెస్, టీడీపీలతో పొత్తులు పెట్టుకొని మోసానికి గురైన చేదు అనుభవాలు కూడా ఈ నిర్ణయానికి టీఆర్‌ఎస్‌ను పురికొల్పుతున్నాయన్న వాదన ఉంది. దీంతో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుక సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతినిధుల సభను కేసీఆర్ ప్రారంభిస్తారు. తొలుత టీఆర్‌ఎస్ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడ రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ప్రతినిధుల సభ మొదలవుతుంది. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగాడ్డి ప్రతినిధులకు ఆహ్వానం పలికిన తర్వాత.. రాష్ట్ర అధ్యక్షునిగా ఇప్పటికే మరోమారు ఏకక్షిగీవంగా ఎన్నికైన కేసీఆర్ పేరును రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహాడ్డి అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం నూతన అధ్యక్షుని తొలి పలుకులు ఉంటాయి. ప్రతినిధులచే ప్రతిజ్ఞ తర్వాత అమరవీరుల సంస్మరణ గీతాన్ని దేశపతి శ్రీనివాస్ ఆలపిస్తారు. ఈ సభలో 28 తీర్మానాలను ప్రతిపాదించి.. వాటిపై లోతుగా చర్చించనున్నారు. చివరిలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రసంగంతో కార్యక్షికమం ముగియనుంది.

గులాబీమయమైన ఆర్మూర్
ఆర్మూర్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పది రోజులుగా పార్టీ శ్రేణులు సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఆర్మూర్ పట్టణం అంతా గులాబీ జెండాలతో, ఫ్లెక్సీలతో, భారీ కటౌట్లతో గులాబీమయమైంది. ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు దాదాపు 10 గంటల పాటు కార్యక్షికమాలు జరుగనున్నాయి. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను ఎక్కడికక్కడే జిల్లాల వారీగా కేటాయించారు. పార్టీ ముఖ్య నేతలైన ఈటెల రాజేందర్, జితేందర్‌డ్డి, కర్నె ప్రభాకర్‌తోపాటు.. స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జి, సభా నిర్వాహణబాధ్యులు ఆశన్నగారి జీవన్‌డ్డి తదితరులు ఆవిర్భావ సభ నిర్వహణ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. తెలంగాణ పది జిల్లాల నుండి తరలివచ్చే దాదాపు 35వేల మంది ప్రతినిధులకు ఆర్మూర్ ఆత్మీయ ఆతిథ్యమివ్వబోతున్నది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మారక ప్రాంగణంలో శనివారం జరిగే ఆవిర్భావ సభ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కనివినీ ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. 40 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో రెండు లక్షల చదనపు అడుగులలో సమావేశ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎండవేడిమిని ప్రతినిధులు తట్టుకునేలా ఆధునాతన షామియానాలు వేశారు. 13 రకాల మాంసాహార, శాఖహారాలతో తెలంగాణ రుచులను ప్రతినిధులకు వడ్డించనున్నారు.

సభలో 28 తీర్మానాలు
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలోను ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల నీడలో తెలంగాణకు జరుగుతున్న సరికొత్త వివక్షలను ఆర్మూర్ వేదిక ద్వారా ఎండగట్టనున్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదాన్ని భవిష్యత్ పోరాట రూపాలకు దిక్సూచిగా మలిచేందుకు టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ దృష్టి సారించనుంది. సాగునీటి రంగంలో ఇప్పటికీ కొనసాగుతున్న వివక్షను ఎండగడుతూనే ప్రాణహిత-చేవేళ్ళ పథకానికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేయబోతున్నది. కంతనపల్లి ప్రాజెక్టు పనులను వేగిరపర్చాలని కోరబోతున్నది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, చట్ట సభల్లో మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు తదితర సామాజిక, రాజకీయ డిమాండ్లపై మొత్తం 28 తీర్మానాలు చేయబోతున్నారు. రాజకీయపరంగా వెనుకబాటుతనంలో ఉన్న తెలంగాణ సమాజం తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించి స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోవడంతో స్వరాష్ట్ర ఆకాంక్షను సాధించుకోగలుగుతామంటూ మొదటి తీర్మానంగా ప్రవేశపెట్టనున్నారు. పెద్ద సంఖ్యలో ఆదివాసీలను నిరాక్షిశయులను చేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుబడుతూనే 45 వేల కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపాలని ఆర్మూర్ సభ డిమాండ్ చేయబోతున్నది. నేదునూరు, శంకరపల్లి, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులో నిర్లక్ష్యాన్ని వీడాలని మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని, తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్రను శ్లాఘిస్తూ భవిష్యత్ ఉద్యమ ఫలితాలను విద్యార్థి లోకానికే చెందేలా తీర్మానం చేయనున్నారు. పెంచిన విద్యుత్‌చార్జీలు తగ్గించి, నిరంతరాయంగా 7 గంటలు విద్యుత్ సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, ముస్లిం మైనార్టీ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని. చేనేత కార్మికులకు రక్షణలు కల్పించాలని, సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను ఉపసంహరించుకుని, కొత్త గనులు ప్రారంభించాలని, స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని తీర్మానాలు చేయనున్నారు.

పదునైన ఉద్యమ వ్యూహాల ఖరారు వేదిక
– టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభపై ఈటెల రాజేందర్
కమ్మర్‌పల్లి/మెట్‌పల్లి టౌన్, ఏప్రిల్ 26 (టీ మీడియా): ఆర్మూర్‌లో జరిగే టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ పదునైన ఉద్యమ వ్యూహాలను ఖరారు చేసే వేదిక అవుతుందని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. శుక్రవారం పెర్కిట్ గ్రామంలోని నిమ్మల గార్డెన్ పక్కన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి కొండంత అండగా నిలిచిన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో ఆవిర్భావ సభ జరగడం అభినందనీయమన్నారు. జిల్లాలోని ఉద్యమ గ్రామమైన మోతె మట్టిని హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ నిర్మాణానికి టీఆర్‌ఎస్ తీసుకు గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని యాచించి కాకుండా శాసించి సాధించుకోవాలన్నారు. ఆంధ్ర రాజకీయ నాయకులు, సంపన్నులు తెలంగాణ వనరులను తమ ప్రాంతానికి తరలించడానికి కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. బయ్యారం గనులను విశాఖ కర్మాగారానికి కేటాయిస్తూ జీవో జారీ చేయడం ఇందులో భాగమేనన్నారు. వందేళ్లయినా తరగని వనరులున్న బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీని స్థాపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కళ్లు తెరవకుంటే ముచ్చెమటలు పట్టించేలా ఉద్యమిస్తామన్నారు. దీనికి తెలంగాణ యావత్ ప్రజానీకమంతా సంఘటితమై ఉద్యమించడానికి సిద్ధంగా ఉందన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.