– 2002లోనే రెక్కీ!
– విచారణలో మక్బూల్ వెల్లడి?
– దిల్సుఖ్నగర్ పేలుడు ప్రాంతానికి తీసుకెళ్లిన ఎన్ఐఏ అధికారులు
– నగరంలోని పలు ప్రాంతాలకు కూడా..
– విచారణలో ఇతర రాష్ట్రాల పోలీసులు
– నెల్లూరు జైలు నుంచి మరో ఇద్దరు అదుపులోకి!
దిల్‌సుఖ్‌నగర్‌తోపాటు హైదరాబాద్‌లోని 10 ప్రాం తాల్లో భారీ పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కుట్ర చేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు ఉగ్రవాదులు మక్బూల్, ఇమ్రాన్ ఎన్ఐఏ అధికారుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. నిరంతరం జనసంచారం ఉండే ఎల్బీ నగర్, మదీన సెంటర్, సోమాజిగూడ, చైతన్యపురి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, రాణిగంజ్, ట్యాంక్‌బండ్, బేగంబజార్, హబ్సిగూడ ప్రాంతాల్లో బాంబులను పేల్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిందితుడు ఎన్ఐఏ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. గతంలో దిల్‌సుఖ్‌నగర్‌లో రెక్కీకి ముగ్గురు స్థానికులు తమకు సహకరించారని వారిద్దరూ వెల్లడించినట్లు సమాచారం.
దీంతో పేలుళ్లలోనూ ఈ ముగ్గురి పాత్ర ఉండి ఉంటుందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో విచారణను ముమ్మరం చేసిన ఎన్ఐఏ అధికారులు.. మూడు రోజులక్షికితం తీహార్ జైలు నుంచి నగరానికి తీసుకుని వచ్చిన మక్బూల్, ఇమ్రాన్‌లను ప్రశ్నిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో ఘటనా స్థలానికి సమీపంలోని ఒక దుకాణంలో రికార్డయిన ప్రైవేటు ఫుటేజీని స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు.. ఆ క్లిప్పింగుల్లో కనిపిస్తున్నవారిలో ఎవరినైనా గుర్తించగలరా? అని ప్రశ్నిస్తూ విచారణ జరిపారు. వారిద్దరినీ నాటకీయ ఫక్కీలో శనివారం అర్ధరాత్రి నగరంలో వివిధ ప్రాంతాల్లో తిప్పారు.
అర్ధరాత్రి వరకు బేగంపేటలోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణ నిర్వహించిన దర్యాప్తు అధికారులు ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో వారిని ఎక్కించుకొని, దిల్సుఖ్నగర్ పేలుళ్ల ఘటనా స్థలానికి తీసుకు బేగంపేట నుంచి సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్డు, ట్యాంక్‌బండ్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా దిల్సుఖ్నగర్ తీసుకు అక్కడ కొన్ని నిమిషాల పాటే ఉన్న అధికారులు అక్కడ ఇమ్రాన్, మక్బూల్‌ను వేరేవాహనంలో ఎక్కించి తిరిగి బేగంపేటకు తీసుకువచ్చారు. తిరుగు ప్రయాణంలో దిల్సుఖ్నగర్ నుంచి మలక్‌పేట, కోఠి, ట్యాంక్‌బండ్, ప్యారడైజ్ మీ దుగా బేగంపేటకు చేరుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయం లో బేగంపేట నుంచి బయలు దేరి న అధికారులు, ఒకటిన్నర ప్రాం తంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకొని, తిరిగి రాత్రి రెండు గంటల సమయంలో బేగంపేటకు చేరుకున్నా రు. ఇమ్రాన్, మక్బూల్ మీడి యా కంటపడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
పుటేజీలు స్పష్టంగానే ఉన్నాయి..: తాము స్వాధీనం చేసుకున్న సీసీ కెమెరాల ఫుటేజీల్లో దృశ్యాలు అస్పష్టంగా ఉన్నట్లు వచ్చిన వార్తలను దర్యాప్తు సంస్థలు కొట్టిపారేస్తున్నాయి. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన ఫుటేజీల్లో దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని, ఇందులో ప్రతి వ్యక్తిని, ప్రతి సన్నివేశాన్ని గుర్తు పట్టేవీలుందని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. పేలుళ్లకు సంబంధించి ఆధారాలు లభించాయని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని దర్యాప్తు జరుపుతున్న అధికారులు అంటున్నారు. కాగా, దిల్సుఖ్నగర్ పేలుళ్లకు పాల్పడిన నిందితులకు స్థానికులు సహకరించారని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధారణకు వచ్చింది. ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ ముగ్గురి కుటుంబాలు మాత్రం కావాలనే తమవారిని వేధిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న మలక్‌పేటకు చెందిన రియల్టర్ మహ్మద్ అబ్రార్(35), అన్వ ర్ ఉల్ ఉలూం కళాశాలకు చెందిన బీకాం విద్యార్థి సయ్యద్ అద్నన్ అహ్మద్, చాంద్రాయణగుట్టకు చెందిన ఇంటర్ విద్యార్థి ముతీర్ రెహమాన్(20)తో పాటు అతడి సోదరుడు, గతం లో బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసిన ఉబైదుహమాన్లను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
రెక్కీకి అబ్రార్ వాహనం: దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు ముందు నిర్వహించిన రెక్కీ కోసం అబ్రార్ తన వాహనాన్ని మక్బుల్‌కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మక్బుల్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పాతబస్తీలోని ఓ అద్దె ఇంట్లో మాకాం పెట్టినట్లు అధికారులు గుర్తించారు.
పేలుళ్లతో ఆ నలుగురికీ సంబంధాలు: ముంబై, పూణెలో పేలుళ్ల కుట్రతో పాటు దిల్సుఖనగర్ పేలుళ్లతో మరో నలుగురికి సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ వివరాలు మక్బుల్‌కు తెలుసునని అధికారులు భావిస్తున్నారు. బీహాక్ చెందిన యాసిన్ భత్కాల్, తబ్రే, వఖాస్, తహసీన్ షేక్‌లు అనుమానితులను గుర్తించారు.
నెల్లూరు జైలు నుంచి మరో ఇద్దరు అదుపులోకి: దిల్సుఖ్నగర్ కేసులో ఆదివారం మరో ఇద్దర్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని నెల్లూరు జైలు నుంచి తీసుకువచ్చినట్టు తెలిసింది. విచారణలో ఎన్ఐఏతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీ పోలీసులు కూడా పాల్గొంటున్నారు.