కిరాయి పాలన అవసరంలేదు.. మన రాష్ట్రాన్ని మనమే ఏలుకుందాం-కేసీఆర్

 

KCR-speech
పరాయి పాలనలో తెలంగాణ ధ్వంసమైందని కేసీఆర్ అన్నరు.. ఇక మనకు కిరాయి పాలన, కిరాయి మనుషులు అవసరం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం ఉన్న సొంత పార్టీ పాలన కావాలో? పరాయి పాలన కావాలో ప్రజలే నిర్ణయించాలని కోరారు. చంద్రబాబు ప్రపంచం మునిగిపోయినట్లు బీజేపీ కాళ్లు పట్టుకుని మోడీవాదాన్ని అందుకోవాలని చూస్తున్నాడన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు చేతులు కలిపి తెలంగాణలో సుస్థిర పాలన రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్, టీడీపీలు ఏవేవో హామీలు ఇచ్చి ప్రజలను గందరగోళపరుస్తాయని, ప్రజలు చర్చించుకుని, ఎవరైతే ప్రజల కోసం, తెలంగాణ కోసం పదవులను వదులుకుని ఉద్యమించారో వారి పక్షాన నిలవాలని కోరారు. తనకు పదవి ముఖ్యం కాదని చెప్పిన కేసీఆర్ నవ్వెటోని ముందట జారిపడొద్దన్నదే తన అభిమతమన్నారు. తెలంగాణ ప్రజలు ధర్మం, న్యాయంవైపు ఉంటారని, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడ్తామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ.. ఈ రెండు పార్టీలు మనం చూసినవే. కొత్తవేమీకాదు. అసలు ఉద్యమంలో అడ్రస్ లేని వీళ్లు మిమ్మల్ని గోల్‌మాల్ చేస్తరు. ఆగం కావద్దు.. ఆలోచించాలి అని ప్రజలకు చెప్పారు. ఒక్క తప్పుతో జరిగిన విలీనంనుంచి తెలంగాణ బైటకు వచ్చేందుకు 60ఏళ్లు పట్టిందన్నారు. ఉద్యమాలు, కాల్పులు, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు, లాఠీ దెబ్బలకుతోడు చావు నోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణలో ఇంకా వలస పాలన, పరాయి పాలన సాగనివ్వద్దంటూ పిలుపునిచ్చారు.

ప్రజల ఆజ్ఞ మేరకే టీఆర్‌ఎస్ ఒంటరిపోటీకి దిగిందని కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్యవాద ముఖ్యమంత్రి వెనుకచేరి మమ్మల్ని వెక్కిరించిన నేతలు ఇప్పుడు తెలంగాణపై కపట ప్రేమను చూపుతున్నారని టీ కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఒక్క రూపాయి తెలంగాణకు ఇవ్వను. ఏం చేసుకుంటారో చేస్కోండి అని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే.. ఒక్క తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేఅయినా, మంత్రైనా లేసిండా? వారు లేసుంటే ఇలా జరిగేదా? అన్నారు. సీఎంను చూస్తే వాళ్ల లాగులు తడిశాయని ఎద్దేవా చేశారు. తెలంగాణను దేశంలోనే ది బెస్ట్ అని పేరు తెచ్చుకుంటామని ధీమాగా చెప్పారు. తెలంగాణలో నేతలు, వారి చెంచాలు దిగమింగిన హౌజింగ్ నిధులను కక్కిస్తామన్నారు.

నన్ను అడిగే హక్కు పొన్నాలకు లేదు
టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. సమైక్యవాద సీఎంల వెనుకుండి నక్కినక్కి నవ్వుకున్నారు. ఆనాడు పోతిరెడ్డిపాడుపై మాట్లాడుతుంటే పొన్నాల సమాధానం చెప్పలేకపోయిండు. జూబ్లీహాల్లో ఏం మాట్లాడినవో నా దగ్గర సీడీలున్నాయి. నన్ను అడిగే హక్కు నీకు లేదు. టీఆర్‌ఎస్ సీఎం అయితే తప్పేం లేదు. ఎవరి సంగతేందో ప్రజలే తేలుస్తరు. కేసీఆర్ అధికారంలోకి రాడని పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్‌కు 23-35 స్థానాలే దక్కుతాయి.

ఇది నేను చెప్పింది కాదు. సర్వేలో వెల్లడైంది. మీరు చేసిన అభివృద్ధి మాకు రాదు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో మీ జేబులు, పొట్టలు అభివృద్ధి చేసుకున్నరు. మా పార్టీలో ఉన్న కడియం శ్రీహరి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. చిన్న మచ్చ కూడా లేదు. మరి నీ సంగతేంది? వేల కోట్లు జలయజ్ఞంలో మింగారు. కక్కిస్తాం. నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై సీబీఐ కేసు నడుస్తోంది. అదే మా కడియంపై సీబీఐ కేసులేమీ లేవు. గీతారెడ్డి, సబితారెడ్డి, పొన్నాలపై సీబీఐ కేసులున్నాయి. మరికొందరు మంత్రులైతే జైళ్లకే పోయి వచ్చిర్రు. మా ఎజెండా ఎందో మేం చెబుతం. మీ ఎజెండా ఎందో చెప్పుకోండి. కానీ ఈ పిచ్చిపిచ్చి కూతలు బంద్‌చేయండి అని అన్నారు.

ఉద్యమకారులకే టికెట్లు
ప్రస్తుతం విడుదల చేస్తున్నది నాయిని నర్సింహారెడ్డి నేతృత్వంలోని ఎన్నికల కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి రూపొందించిన మొదటి జాబితా అని కేసీఆర్ చెప్పారు. ఉద్యమంలో పనిచేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. మా లిస్టులో 85% బలహీనవర్గాలవారు, ఉద్యమకారులే ఉన్నారు. పొత్తులపై మీడియా అయోమయం చేస్తోంది. నేను ఏనాడో చెప్పాను. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తున్నాం. 2004, 2009 ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం. ప్రజల ఆజ్ఞ మేరకు ప్రథమంగా ఒంటరిగా బరిలోకి దిగుతున్నాం. మా లిస్టులో వీలైనంత వరకు ఉద్యమంలో పనిచేసిన వారే ఉన్నారు.

న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థి ఉద్యమకారులు ఇలా అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించింది. ఇంకా కొన్ని ఇతర వర్గాల వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరో 50 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. శుక్రవారం మంచి ముహూర్తం, పైగా ముస్లింల జుమ్మా కూడా కలిసి వస్తున్నాయని చెప్పారు. పార్టీ టికెట్ల కోసం ఎన్నో అప్లికేషన్లు వచ్చాయి. 2-3రోజుల్లోనే మరో విడత పేర్లను ప్రకటిస్తాం అన్నారు.

తెలంగాణ పాలిట శని చంద్రబాబు
మమ్మల్ని మీరు, మిమ్మల్ని మేం నిందించడం ఇక వద్దు. మీరేం చేస్తారో చెప్పుకోండి. మేం ఎం చేస్తమో చెప్పుకుంటం. మన సంగతి ప్రజలే తేలుస్తరు. పిచ్చికూతలు మానుకోండి అని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు అంటేనే గోముఖవ్యాఘ్రం. తెలంగాణ పాలిట శని ఆయన. పచ్చి సమైక్యవాది. తెలంగాణ బిల్లును చివరి నిమిషం వరకు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. ద్రోహి. మొన్న శ్రీకాకుళంలో నాకు ఎంపీలు లేకపోవడం వల్లే విభజనను ఆపలేకపోయా అన్నాడు. అంటే ఎంపీలుంటే ఆపేవాడేగా. టీడీపీ, దానితో అంటకాగుతున్న పార్టీలు భూస్థాపితం కావాల్సిందే. తరతరాలుగా దెబ్బతింటూనే ఉన్నాం. కేసులు, జైళ్లు, లాఠీచార్జీలు, ప్రాణాల మీదికి తెచ్చుకునే దీక్షలు ఎన్నో చేసినం. ఇంకా మనకు కిరాయి మనుషుల పాలన వద్దు. ఈ విషయంలో రాజీ వద్దేవద్దు. మేం విడుదల చేసిన మ్యానిఫెస్టోలోకంటే ఇంకా మంచి విషయాలను ఎవరు చెప్పినా మ్యానిఫెస్టోకు అనుబంధంగా చేరుస్తాం అని చెప్పారు.

75 సీట్లు మాకే
ఎన్నికల్లో 75 అసెంబ్లీ, 14 పార్లమెంట్ స్థానాలు టీఆర్‌ఎస్ దక్కించుకుంటుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. తాను ఏ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనేది ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో ప్రతి 10 మందిలో 8మంది టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని చెప్పారు. ముస్లింలకు టికెట్లు తక్కువ ఇచ్చారని అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఘాటుగా స్పందించారు. మహబూబ్‌నగర్‌లో ఇబ్రహీంకు రెండుసార్లు టికెట్ ఇస్తే ముస్లింలే ఓట్లు వేయలేదని అన్నారు. బోధన్‌లో 1100 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయాడని, తాను గతంలో జరిగిందే చెబుతున్నానని అన్నారు. అయితే రెండో జాబితాలో ముస్లింలకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కాకుండానే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇంకా పంచాయతీ అయిపోలేదు
ఇల్లలకగానే పండగ కాదని చెబుతూ తెలంగాణ సాధించగానే సరిపోదన్నారు. ఇంకా సీమాంధ్ర నేతలతో పంచాయతీ అయిపోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకవైపు తెలంగాణ బిల్లు ఆమోదం కాగానే మరోవైపు సీమాంధ్ర నేతలు కుట్రపూరితంగా భద్రాచలంలోని 7మండలాలను సీమాంధ్రలో కలుపుకోవాలని ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. వారి కుట్రలను అడ్డుకుని, ముక్కుపిండి తెలంగాణకు న్యాయం చేసేది ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. నిజాంసాగర్.. ప్రపంచంలోనే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఉండేదన్నారు.

సుమారు 3 లక్షల ఎకరాలకు నీరందించే నిజాంగసాగర్ ఎండిపోయి నిజామాబాద్ జిల్లా కరువు బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్‌లో చెరుకు పంటలు పోయి బీడు వారిందని అన్నారు. ఆరు నూరైనా సింగూరు, నిజాంసాగర్ కళకళలాడాలన్నారు. గత వైభవం మళ్లీ రావాలంటే టీఆర్‌ఎస్‌ను అధికారంలో కూర్చోబెట్టాలని ప్రజలను కోరారు. జగన్ పార్టీలో ఉంటూ ఆయన సమైక్యవాదానికి నిసరనగా బైటకు వచ్చిన నేతలు కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్‌లని కేసీఆర్ ప్రశంసించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.