ఒకే ఒక్కడు! తెలంగాణ మొనగాడు

హైదరాబాద్ ఫిబ్రవరి 18 : మలిదశ తెలంగాణ ఉద్యమం ఆసాంతం కేసీఆర్‌దే. ప్రతి మలుపులోనూ ఆయనే. గెలుపులోనూ ఆయనే. 13 ఏళ్ల ప్రస్థానంలో ఉద్యమ దీపం ఆరకుండా ఆయన వేసిన ఎత్తుగడలు, ఆ క్రమంలో జరిపిన పోరాటాలు ఉద్యమాలకు ఒక కొత్త సిలబస్. జలదృశ్యంలో గుప్పెడుమందితో పురుడుపోసుకున్న ఉద్యమం జనసాగర కెరటమై ఢిల్లీని ముంచెత్తడం ఒక అపూర్వ సంఘటన. తొలిఘట్టం జలదృశ్యం.. పదవులకోసం తెలంగాణ అనే అపవాదును బద్దలు కొడుతూ ఆ వేదికపైనుంచి మూడు రాజీనామాలు.. ఎమ్మెల్యే పదవికి, టీడీపీ క్రియాశీల సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి ఏప్రిల్ 27, 2001 న రాజీనామాలిచ్చి ప్రజల తీర్పుకు సిద్ధమయ్యారు. పదవీ త్యాగంతో ఉద్యమానికి పురుడు పోశారు. ఉద్యమాలంటే విధ్వంసాలన్న అపప్రథను తొలగిస్తూ అహింసా మార్గం ఉద్యమ మార్గంగా ప్రకటించారు. రాజకీయ ప్రక్రియలో తెలంగాణ సాధన నినాదంగా తీసుకున్నారు.

chandra69 విద్రోహ ముద్ర చెరుపుకుంటూ మార్గం వదిలితే రాళ్లతో కొట్టమని బహిరంగ శపథం తీసుకుని విశ్వాసం ప్రోది చేశారు. తక్షణ కార్యాచరణ కింద కరీంనగర్ సింహ గర్జన ప్రకటించారు. హేళనగా చూసిన ప్రతీపశక్తుల గుండెలు గుభిల్లుమనేలా కరీంనగర్ గర్జనకు లక్షల మంది చీమలాబారులా తరలివచ్చారు. తొలి అగ్ని పరీక్ష వచ్చింది. సిద్దిపేట ఉప ఎన్నిక. గొంతు విప్పిన ఉద్యమం నోరు మూయించేందుకు డబ్బు సంచులు దిగాయి. అయినా 2001 సెప్టెంబర్ 22న భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాతే తరుముకొచ్చిన స్థానిక ఎన్నికలు. పరీక్షే.. పార్టీ నిర్మాణమే లేదు. ధనబలం లేదు. ప్రచారం చేసే మీడియా లేదు. పది జిల్లాల నలుమూలలకు ఉద్యమ నినాదం చేరనే లేదు. అయినా వెన్ను చూపలేదు. సుడిగాలి పర్యటనలు ప్రచారాలు. తెలంగాణది పెద్ద మనసు. ఉద్యమం మీద మనసు పడింది. బ్యాలెట్ పెట్టెల్లో ఓటూ పడింది. టీఆర్‌ఎస్ ఎత్తుగడ ఫలించింది. పెద్ద పెద్ద పార్టీలకు దిమ్మతిరిగింది. పుట్టి పదినెలలు దాటలేదు. ముక్కుపచ్చలారలేదు.

ఇరవై శాతం ఓటింగ్ శాతం అధిగమించింది. రెండు జడ్పీలు దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు తలుచుకుని నిద్రలు కరువయ్యాయి. కొంతకాలం విరామం. మీడియా సొల్లు ప్రారంభం. చల్లారింది అన్నది. అడ్రస్ ఎక్కడ అన్నాడు చంద్రబాబు. పరీక్షకు నిలబడడమే ధీరత్వం. పరేడ్ గ్రౌండ్ సమాధానం చెప్పింది. ఇసకేస్తే రాలని జనం తరలివచ్చి టీఆర్‌ఎస్ అడ్రస్ ఏదో పాలకులకు చెప్పారు. తెలంగాణ అంశం జాతీయ ఎజెండాకు ఎక్కింది. 2004 ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ప్రతిపక్ష పార్టీకి సంకటం వచ్చింది. రాజకీయ అనివార్యత అన్న సూత్రం ప్రభావవంతంగా పనిచేసింది. దేశాన్ని అనేక ఏళ్లు ఏలిన పార్టీ తెలంగాణకు అనుకూల తీర్మానం చేసింది. కేసీఆర్ ఇంటికి వచ్చి పొత్తు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం సగర్వంగా 26 స్థానాలతో శాసనసభకు చేరింది. ఐదు లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. యూపీఎ-1 కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో స్థానం దక్కించుకుంది. ఆ తరువాత రాష్ట్రపతి ప్రసంగంలో, ప్రధాన మంత్రి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

ఉత్తానాల వెంట పతనాలూ ఉంటాయి. యూపీఎ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని తేల్చక పోవడంతో రాష్ట్రంలోని మంత్రిపదవులకు, కేంద్ర మంత్రి పదవులకు టీఆర్‌ఎస్ పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చింది. కేసీఆర్ దెబ్బతిన్న బెబ్బులిలా కరీంనగర్ స్థానానికి రాజీనామా చేశారు. బంగారం లాంటి అవకాశమనుకున్నారు సీమాంధ్ర నాయకులు, మీడియా. కనివిని ఎరుగని దాడి. కోట్ల రూపాయలు కురిపించారు. లారీలకు లారీలు క్రికెట్ కిట్లు పంచారు. తమ కోసం అగ్ని పరీక్షకు సిద్ధమైన కేసీఆర్‌కు తెలంగాణ యావత్తూ అండగా నిలిచింది. లక్షల మెజార్టీతో కేసీఆర్ విజయం సాధించారు. ఆరిపోతుందనుకున్న ఉద్యమ దీపం దేదీప్యమానమైంది. మళ్లీ ఎన్నికలు వచ్చేలోపు తిరిగి రాజకీయ అనివార్యత సృష్టి లక్ష్యంగా మొత్తం టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఎన్నికలకు నిలబడ్డారు. గెలిచి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది. కానీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 7 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది.

టీఆర్‌ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పంచన చేరారు. ఆ తరువాత వచ్చిన రాజకీయపరిణామాల నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు.. ఉద్యమ పంచవర్ష ప్రణాళికకు మెరుగులు దిద్దాల్సిన సమయం. 2009 ఎన్నికలు టీఆర్‌ఎస్ చెప్పిన రాజకీయ అనివార్యతకు పరాకాష్ట. సమైక్యమే విధానమన్న తెలుగుదేశం దానికి చెల్లుచీటి ఇచ్చి తెలంగాణ తీర్మానం చేసి పొత్తుకోసం మోకరిల్లింది. ఫలితం 45 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు మాత్రమే దక్కాయి. ఉథ్తాన సమయంలో ఆకాశానికెత్తిన వాళ్లు ఓటమి వేళ రాళ్లు వేశారు. కుడి ఎడమ భుజాలనుకున్న వాళ్లూ నిందలు వేసి వెళ్లి పోయారు. పద్మవ్యూహంలో చిత్తు అయిన అభిమన్యుడి స్థితి. కానీ కేసీఆర్ అభిమన్యుడు కాదు. ఆశావాది. ఇంకా పోరాటం మిగిలే ఉంది అని ప్రకటించారు. మూడు నెలల నిశబ్దం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరణ నిరాహార దీక్షకు ప్రకటించారు.

నవంబర్ 29, 2009 కేసీఆర్ సిద్దిపేటలో దీక్షకు కూర్చునేందుకు కరీంనగర్ నుండి బయలు దేరారు. అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. తెలంగాణ సమాజం ఆగ్గిమీద గుగ్గిలం అయింది. మొత్తం ప్రజాజీవనం స్తంభించిపోయింది. కేసీఆర్ జైల్లోనే అమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తుండటంతో పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఇక్కడి పరిస్థితిని పార్టీ హైకమాండ్‌కు వివరించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9వ తేదీ ఉదయానికి పరిస్థితి దిగజారుతోందనే సమాచారం బయటకు రావడంతో కేంద్రం అలర్ట్ అయింది.

రాత్రి 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. అయితే సీమాంధ్రలో సమైక్య కృత్రిమ ఉద్యమంతో అది విఫలమైంది. కేసీఆర్ కొత్త ఎత్తుగడ.. జానారెడ్డితో మంతనాలు చేసి జేఏసీని సృష్టించారు. ఇక రాజకీయం ఉద్యమం చెట్టపట్టాలేసుకుని ఉద్యమాలను ఉరకలెత్తించాయి. తరువాత కేంద్ర హోంశాఖ అఖిలపక్షం పెట్టి మరోసారి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంది. 2013 జూలై 30 వ తేదీ సీడబ్ల్యూసీ తీర్మానం తదనంతరం తెలంగాణ ప్రకటన.

This entry was posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.