హోంశాఖ చేతికి టీ బిల్లు – ఊపందుకున్న కేంద్ర కార్యాచరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 3 : మరో రెండు రోజుల్లో తెలంగాణకు అత్యంత కీలకమైన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటం.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అభిప్రాయాలు జత చేసుకుని టీ బిల్లు హస్తినకు చేరుకోవటం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం మరింత వేడెక్కింది. దీనికి దాదాపు రాష్ట్ర ముఖ్యనాయకత్వం మొత్తం హస్తినలో మకాం వేయడం మరింత సెగను రాజేసింది. ఒకవైపు తెలంగాణ అనుకూల శక్తులు.. మరోవైపు విభజన వ్యతిరేకులు ఢిల్లీకి చేరుకోవడంతో దేశ రాజధానిలో చర్చలు మొత్తం తెలంగాణ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి.

chidambarmటీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని, బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో మునిగిపోయారు. విభజనను అడ్డుకునే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు తన బందంతో చేరుకున్నారు. అదే పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలు.. అధినేత అభీష్ఠానికి వ్యతిరేకంగా.. తెలంగాణ సాధనకు అనుకూలంగా పావులు కదిపేందుకు ఢిల్లీలో తిరుగుతున్నారు. టీ కాంగ్రెస్ నేతలు కూడా సీనియర్ మంత్రి జానారెడ్డి నాయకత్వంలో పార్టీ అధిష్ఠానం పెద్దలతోపాటు.. ఇతర జాతీయ పార్టీల నేతలను కలిసే పనిలో పడ్డారు. రాష్ట్రపతిని కలిసి, అనంతరం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ సమాధి వద్ద దీక్ష చేయనున్నారన్న వార్తల నడుమ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా అదే రోజు చేరుకుంటున్నారు.

విభజన వ్యతిరేక, అనుకూల నేతల రాకలు ఎలా ఉన్నా.. తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం స్థాయిలో కసరత్తు ముమ్మరమైంది. ఇందులో భాగంగా ఒక్క మంగళవారమే మూడు కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రుల బందం సమావేశం అవుతుండగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. హోంశాఖకు అందిన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయాల మేరకు.. తాము అవసరమని భావించిన సవరణలు ప్రతిపాదించేందుకు జీవోఎం సమావేశమవుతున్నదని సమాచారం. అన్నింటికీ మించి.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో 15, రకాబ్‌గంజ్‌లోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో కీలక భేటీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. తెలంగాణపై బీజేపీ కొర్రీలు పెట్టే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చినా.. వాటన్నింటినీ కొట్టిపారేసిన ఆ పార్టీ నేతలు.. తాము ఏ బిల్లు ఆమోదానికైనా సిద్ధంగానే ఉన్నామని, అయితే.. సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సహకరించే అంశంపైనే సభ జరిగే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు.

సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణ కోరుతున్నా.. తెలంగాణ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నేతలు హైదరాబాద్‌లో విస్పష్టంగా ప్రకటించారు. బిల్లును వ్యతిరేకించేవారు.. వ్యతిరేకంగా ఓటు వేయాలని, కానీ.. సభను అడ్డుకుంటే సహించేది లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ అఖిలపక్షంలో ప్రకటించారు. అడ్డుకునేవారిని సస్పెండ్ చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. దీంతో బంతి పూర్తిగా కాంగ్రెస్ కోర్టులోనే ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలను దారికి తెచ్చుకునే ఆఖరి ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వార్‌రూమ్ భేటీ జరుగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు సీమాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులకూ ఈ సమావేశం కోసం ఆహ్వానం అందింది.

సీడబ్ల్యూసీ నిర్ణయం అనంతరం తెలంగాణ ఏర్పాటును సీఎం బాహాటంగా వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఏది ఏమైనా తెలంగాణ ఏర్పాటు జరిగి తీరుతుందని కాంగ్రెస్ అధిష్ఠానం కుండబద్దలు కొట్టి చెబుతున్నది. దీంతో వార్‌రూమ్ భేటీలో సీఎం ఎలా వ్యవహరిస్తారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర నేతలను బుజ్జగించేందుకు పిలిచారా? లేక హెచ్చరికలు జారీ చేసేందుకా? అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో అసలు ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారా? లేదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌లో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ముఖ్యమంత్రి కిరణ్ అధిష్ఠానంతో దూరం పాటిస్తున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ వెళ్లినా.. పార్టీ నేతలను కలిసింది లేదు. ఇక పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కిరణ్ కలుసుకుని నెలలు అవుతున్నది. కొద్ది రోజుల క్రితం రాజ్యసభ అభ్యర్థుల ఖరారుకు అధిష్ఠానం పిలిచినా.. సీఎం వెళ్లలేదు. అంతకు ముందు ఏఐసీసీ సమావేశాలకు కూడా సీఎం డుమ్మా కొట్టారు. రాహుల్‌గాంధీని కలిసే సందర్భం వచ్చినా దానినీ తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో వార్ రూమ్ భేటీకి సీఎం హాజరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హస్తిన చేరిన టీ బిల్లు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 సోమవారం హైదరాబాద్ నుంచి హస్తినకు చేరింది. తొలుత ఏపీభవన్‌కు, అటు నుంచి హోంశాఖ కార్యాలయమైన నార్త్‌బ్లాక్‌కు అధికారులు వాటిని చేర్చారు. అంతకు ముందు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇన్నోవా వాహనంలో మొదట విడతగా 20 కవర్లలో ఉన్న 5 బండిళ్లను హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి తీసుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అధికారులు, ఎస్కార్టు సిబ్బంది చేరుకున్నారు. అనంతరం గంట వ్యవధి తర్వాత మరో వాహనం మిగిలిన ప్రతులను తీసుకుని విమానాశ్రయం చేరుకుంది. 20 కవర్లు, నలుగురు అధికారులు, ఎస్కార్టు సిబ్బందితో ఉదయం 6.15 గంటల నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం తీసుకుంది.

అనంతరం ఉదయం 9.45 గంటలకు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మరో 15 కవర్లలో ఉన్న ప్రతులతో మరో బందం ఢిల్లీకి పయనమైంది. బిల్లుతోపాటు వెళ్లినవారిలో సాధారణ పరిపాలనావిభాగం అసిస్టెంట్ సెక్రటరీ లలితాంబిక, మరో ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లతోపాటు ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారు. వీరు ఉదయం 11గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి కేంద్ర హోంశాఖ సమకూర్చిన వాహనాల్లో ఏపీ భవన్‌కు చేరుకుని, రెండో విమానంలో అధికారులు వచ్చేంతవరకు అక్కడే వేచిఉన్నారు. ఉదయం 9.45కు హైదరాబాద్‌నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో బయలుదేరిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రామకష్ణారావు, హోంశాఖ శాంతి భద్రతల విభాగం డిప్యూటీ సెక్రెటరీ రామరాజు, మరో ఇద్దరు అధికారులతో కలిసి మధ్యాహ్నం సమయంలో దేశ రాజధానికి చేరుకున్నారు. అందరూ కలిసి బిల్లును హోంశాఖ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.