హైదరాబాద్ మీద కిరికిరి పెడితే ఒప్పుకోం: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు చేసి హైదరాబాద్ మీద ఆంక్షలు పెడితే సహించమని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ‘తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జంగ్ సైరన్’ సభలో ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్ మీద కిరికిరి పెడితే ఒప్పుకోం. హైదరాబాద్‌కు కూలీ కుతుబ్‌షా పునాది వేస్తే నిజాం ప్రభువులు అభివృద్ధి చేశారు. ఇవాళ సీమాంధ్రులు హైదరాబాద్‌ను మేం అభివృద్ధి చేశాం హైదరాబాద్ మాది అంటే ఊరుకోం’ అని హెచ్చరించారు. హైదరాబాద్ మీద ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ మీద ఆంక్షలకు ఒప్పుకుంటే భవిష్యత్ తెలంగాణ పౌరులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ విషయంలో అవసరమైతే మరోసారి ఉద్యమానికి సిద్ధంకావాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంట్రాక్టు ఉద్యోగులంటే శ్రమ దోపిడే: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులంటే శ్రమ దోపిడేనని పేర్కొన్నారు. పెడితే మంత్రులను, ముఖ్యమంత్రులను కాంట్రాక్టు మీద పెట్టాలిగానీ, చిన్నచితకా ఉద్యోగులను కాదని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగికి కనీసం ఈఎస్‌ఐ కార్డు కూడా ఉండొద్దా అని ప్రశ్నించారు. తెలంగాణ రాగానే విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను పాలకులు కనీసం మనుషులని కూడా ఆలోచించరా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేసేందుకు తాను ముందుండి పోరాడుతానని పేర్కొన్నారు.

రాబోయేది చిరునవ్వుల తెలంగాణ కావాలి: కేసీఆర్
తెలంగాణ వస్తే చిరునవ్వుల తెలంగాణ కావాలి అని కేసీఆర్ అన్నారు. రాబోయే తెలంగాణలో అందరు చిరునవ్వులతో జీవించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణలో ఎనబై ఐదు శాతం మంది ఎస్సీ,ఎస్టీ, బీసీలున్నారని వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేపడతామని స్పష్టం చేశారు. అగ్ర వర్ణాల్లో ఉన్న పేదవారిని కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఉద్యమం ఇంతటిత ఆగిపోదని, ఇక ముందు కూడా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కొనసాగుతదని తెలిపారు. ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ సాధించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం: కేసీఆర్
‘హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం. ఈనాడు కాదు నిజాం కాలం నుంచే ఇది కాస్మోపాలిటన్ సిటీగా ఉంది. ఇక్కడ అందరూ ఉన్నారు, ఉంటారు’ అని కేసీఆర్ అన్నారు. ‘హైదరాబాద్‌లో బాంబే బేకరీ ఉంది. కరాచీ బేకరీ ఉంది. చంద్రబాబుకు పాలు, కూరగాయల దుకాణం ఉంది. కిరణ్ కర్రీ పాయింట్ పెట్టుకుంటే తప్పేంటీ?’ అని అన్నారు. కర్రీ పాయింట్ కాకుంటే ఫైవ్ స్లార్ హోటల్ కట్టుకోమనండి ఎవరొద్దన్నారని అన్నారు.

ఐటీఐఆర్ రావడం ఎవరి మెహర్బానీ కాదు: కేసీఆర్
హైదరాబాద్‌కు ఐటీఐఆర్ రావడం శుభపరిణామని కేసీఆర్ అన్నారు. ఐటీఐఆర్ రావడం ఎవరి మెహర్బానీ కాదని స్పష్టం చేశారు. ప్రపంచ సీఈవోల సదస్సులో హైదరాబాద్ ఐటీ పెట్టుబడులకు అనుకూలమని తీర్మానం చేశారని తెలిపారు. హైదరాబాద్ భూకంపాలు రాకుండా, భూమి లభించే నగరంగా ఉందని వాళ్లు అన్నారని తెలిపారు. వాళ్లంతా ప్రపంచమంతా తిరిగి చివరికి హైదరాబాద్ తమకు అనుకూల ప్రదేశమని ఎన్నుకున్నారని వివరించారు. ఐటీఐఆర్ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 30 నుంచి 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిలికాన్ నగరంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు రావాలంటే ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొద్దని పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా రూపుదిద్దుకుంటుందని వివరించారు.

‘తెలంగాణలో ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అంగీకరించం’
తెలంగాణ వచ్చాక ఎక్కువగా విస్తరించే రంగం ఒకటుందంటే అది విద్యుత్ రంగం అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడగానే ఐదేళ్లలో పదిహేను వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది, అంత ఉత్పత్తికి మనం కృషి చేయాల్సి ఉంటుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ విద్యుత్ కేంద్రాలను అంగీరించబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు అవసరానికి మించి సర్‌ప్లస్‌గా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కేసీఆర్ తెలిపారు. అవసరమనుకుంటే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేవరకు అక్కడ నుంచి కొనుక్కోవచ్చని వివరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.