హైదరాబాద్ తెలంగాణ సొత్తు-కేసీఆర్

రంగారెడ్డి: సీమాంధ్ర నేతలు టీజీ వెంకటేశ్, కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌లు హైదరాబాద్ వాళ్ల సొత్తు అన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరమాబాద్ ముమ్మాటికీ తెలంగాణ సొత్తేనన్నరు. రాష్ట్ర ఆదాయంలో డెబ్బయి శాతం తెలంగాణ ప్రాంతం నుంచే వస్తుందని ఆయన వివరించారు. సొమ్మొకరిది, సోకొక్కరిది అన్నట్టు తెలంగాణ సొమ్ముతో సీమాంధ్ర నేతలు అధికారాన్ని, సంపదను అనుభవిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడేం కొత్తగా అడుగుతలేమని, ఇంతకు ముందున్న తెలంగాణనే తాము డిమాండ్ చేస్తున్నామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బలవంతంగా తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్నారని చెప్పారు. ఇవాళ ఆయన మేడ్చల్ సర్పంచ్ రామన్నగారి రాజేశ్వర్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై మాట్లాడారు. కేసీఆర్ సమక్షంలో రాజేశ్వర్‌గౌడ్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.  డిసెంబర్ 9న రాత్రి ప్రకటన వచ్చిన వెంటనే తెల్లారేకల్లా సీమాంధ్ర జీవులన్నీ ఏకమై తెలంగాణను అడ్డుకున్నాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రాంతం నుంచి సీమాంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించుకు పోతున్నారని దుయ్యబట్టారు. వేలకోట్ల విలువ చేసే నిజాం భూములను సీమాంధ్ర పెట్టుబడిదారులు అమ్ముకున్నారని విమర్శించారు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హామీలు
రేపటి తెలంగాణలో వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.1000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల లోన్లను రద్దు చేస్తామని తెలిపారు. పూర్తి సబ్సిడీతో రూ.2 లక్షలతో పక్కా ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వాటికి మౌళిక సదుపాయాలు కూడా కల్పిస్తామని తెలిపారు.

తోక రాజ్యాలు మనకెందుకు: కేసీఆర్
సీమాంధ్ర నేతలు రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం అని అంటున్నారు. ఈ తోక రాజ్యాలు మనకెందుకు అని కేసీఆర్ అన్నారు. ఈ తోక రాజ్యాలతో మనకొరిగిందేమీ లేదని కేసీఆర్ తెలిపారు. వంద ఎమ్మెల్యేలను, పదిహేను మంది ఎంపీలను మీరే గెలిపించబోతున్నరని ప్రజలనుద్దేశించి అన్నారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ముస్లింలకు అన్యాయం జరిగిందని కేసీఆర్ ఆవేదనతో అన్నారు. తెలంగాణ వస్తే డిప్యూటీ సీఎం పదవి ముస్లింలకే నని వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.