హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే


-కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబోము
-ఉమ్మడి రాజధాని ప్రతిపాదనకూ నో
-కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టీకరణ
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనున్నారని గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కొట్టిపారేశారు. హైదరాబాద్ తెలంగాణ అంతర్భాగమని స్పష్టంచేశారు. చండీగఢ్ తరహాలో ఉమ్మడి రాజధానిగా కానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా కానీ కేంద్రం చేయబోదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీకి ముందు దిగ్విజయ్‌సింగ్ ఓ జాతీయ చానెల్‌కు ఇంటర్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోని వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఆ ఇంటర్వ్యూలోని కీలక వివరాలివి.. విభజనపై నిర్ణయం ఎప్పుడన్న ప్రశ్నకు ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షులను రోడ్‌మ్యాప్ తీసుకురమ్మని చెప్పాం. వాటిపై కోర్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. వాటిపై చర్చించి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది.

రాష్ట్ర విభజనపై 2014 ఎన్నికల లోపే నిర్ణయం రావచ్చు’ అని తెలిపారు. హైదరాబాద్ పరిస్ధితి ఎలా ఉండబోతోందన్న ప్రశ్నకు ‘హైదరాబాద్ ఏ ఒక్కరికో చెందిన పట్టణం కాదు. అక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతా ల ప్రజలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ నివాసముంటున్నారు. వారికి అక్కడ ఓటు హక్కు కూడా ఉంది. అక్కడ తెలంగాణ ఉద్యమం కూడా బలంగా లేదు. హైదరాబాద్‌తో ఎవరికీ సమస్య లేదు. అది నేడు ఒక మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీ. కార్పొరేట్ కేంద్రం’ అని స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను చండీగఢ్‌లాగా ఉమ్మడి రాజధాని లేదా, కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారా అన్న ప్రశ్నకు ‘అట్లాంటిదేమీ ఉండబోదు. రాష్ట్ర విభజన జరిగితే హైద్రాబాద్ సహజంగా అలాగే ఉంటుంది. ( చాయిస్ ఈజ్ ఆబ్వియస్)’ అని దిగ్విజయ్‌సింగ్ బదులిచ్చారు.

కోర్‌కమిటీ చర్చల సారాంశం చెప్పలేం: దిగ్విజయ్
రాష్ట్ర విభజన అంశంపై కోర్‌కమిటీ చర్చల సారాంశాన్ని తాను వెల్లడించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్వియ్‌సింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన రోడ్‌మ్యాప్‌లపై అనేక రకాలుగా జరుగుతున్న ప్రచారం వివరణ ఇవ్వాల్సిందిగా విలేకరులు కోరగా, ఆయన ఈ విధంగా బదులిచ్చారు. మంగళవారం సీమాంధ్ర నేతలు ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో దిగ్విజయ్ భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో ముక్తసరిగా మాట్లాడిన దిగ్విజయ్.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా రోడ్‌మ్యాప్ ఇచ్చారని వస్తున్న విమర్శలపై స్పందించడానికి నిరాకరించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనున్నారనే వార్తలపై స్పందిస్తూ.. ‘ఆ విషయమై మాట్లాడటానికి నా దగ్గర ఏమీ లేదు’ అని అన్నారు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.