హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరానికి తీసిపోదు-న్యూయార్క్ టైమ్స్’ ఇంటర్వ్యూలో కేటీఆర్

KTR-తెలంగాణకు మౌలిక సదుపాయాల కొరత లేదని, రాజధాని హైదరాబాద్ ఇక్కడే ఉండటంతో కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, శాసనసభ్యుడు కే తారకరామారావు అభివూపాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మాటతప్పిందని, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా బలపడి నిర్ణయాత్మక శక్తిగా మారతామని ఆయన చెప్పారు. భారతదేశంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యమే సాగుతోందని, జాతీయ పార్టీలనేవి పెద్ద ప్రాంతీయ పార్టీలుగా మారాయని ఆయన ఇటీవల ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం పరిణామాలు, భవిష్యత్తు ప్రణాళికలపై పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణ కోసం ప్రజలు అనూహ్య రీతిలో ఉద్యమించారని, గత మూడేళ్లలో అనుసరించని నిరసన రూపం లేదని కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో జరిపిన చర్చలు ఏ ఫలితాలనిచ్చాయన్న ప్రశ్నకు- అవి విఫలమయ్యాయని కాంగ్రెస్ మరోసారి మోసపుచ్చిందని చెప్పారు. చివరికి తమ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసేందుకు కూడా సిద్ధమయ్యామని, కానీ కాంగ్రెస్ నుంచి ప్రతిస్పందన కరువయ్యిందని తెలిపారు. ప్రాణం తీసుకోవడానికి మించిన త్యాగం లేదని, ఆమరణ దీక్షకు దిగడమంత ఉద్వేగపరమైన అంశం ఉండదని.. వీటన్నిటినీ తెలంగాణ ఉద్యమంలో చూడొచ్చని అన్నారు.

లక్షల మంది ప్రజలు వీధుల్లోకొచ్చారు.. వందల మంది యువకులు తమ ప్రాణాలు తీసుకున్నారు.. వీటన్నిటి గురించి కాంగ్రెస్‌కు వివరించామని, అయినా ఫలితం లేదని చెప్పారు. అందుకే ఇంతదాకా వీధుల్లో అన్ని రకాలుగా ప్రయత్నించిన తాము ఇప్పుడు దానికి బదులు తెలంగాణ ఓట్లను టీఆర్‌ఎస్ రూపంలో బలవత్తర రాజకీయ శక్తిగా మలచే ప్రయత్నంలో ఉన్నామని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలో, పార్లమెంటులో సాధ్యమైనన్ని సీట్లను గెలుచుకుని, ప్రజల కోసం ఆ ఫలితాలను ఉపయోగిస్తామన్నారు. అదే తమ ఉద్దేశమని తెలిపారు. ఎన్డీయేతోగానీ, యూపీయేతోగానీ కలిసి పనిచేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయా కూటములు ఎన్నికల తర్వాత ఏర్పడినవేనన్నారు. దేశంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యమే కొనసాగుతోందని, జాతీయ పార్టీలనేవి వాస్తవానికి పెద్ద ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ, బీహార్‌లో నితీశ్‌కుమార్, ఒడిశాలో నవీన్‌పట్నాయక్, ఉత్తరవూపదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, మహారాష్ట్రలో శివసేన, ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్సీపీ కీలక శక్తులుగా వ్యవహరిస్తున్నాయని అభివూపాయపడ్డారు.

ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడే అవకాశాల గురించి ప్రశ్నించగా- అదంతా ఎన్నికల తర్వాత పరిశీలించాల్సిన విషయమని కేటీఆర్ బదులిచ్చారు. ప్రాంతీయ పార్టీలకు చాలావరకు ఉమ్మడి లక్ష్యాలంటూ ఉండవని, తమ విషయానికే వస్తే తెలంగాణే తమకు ముఖ్యమని, మిగతావన్నీ ఆ తర్వాతేనని స్పష్టం చేశారు. మరో ప్రాంతీయ పార్టీతో చర్చించాలంటే ఉమ్మడి ఎజెండా అంటూ ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిది సాధ్యం కాకపోవచ్చని అన్నారు. తెలంగాణ ఒకప్పుడు నక్సలిజానికి పెట్టని కోట, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ వామపక్ష తీవ్రవాదులు పాల్గొంటున్నారన్న పోలీసు వాదన గురించి ప్రస్తావించగా- అది సహజమేనని కేటీఆర్ బదులిచ్చారు. తెలంగాణ ఉద్యమం సిద్ధాంతాలు, భావజాలాలకు అతీతంగా భిన్న శక్తులను ఏకం చేసిందని, విశ్వ హిందూ పరిషత్ నుంచి మావోయిస్టుల దాకా ఉద్యమాన్ని బలపరుస్తున్నారని చెప్పారు.

చిన్న రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ అనుభవాలను గమనిస్తున్నారా, సమస్యలు ఎదురయ్యే అవకాశాల్లేవా అన్న ప్రశ్నకు- తెలంగాణను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందని టీఆర్‌ఎస్ నేత అభివూపాయపడ్డారు. నిజానికి తెలంగాణ చిన్న రాష్ట్రం కాబోదని, పశ్చిమబెంగాల్ కన్నా పెద్దదని, దేశంలో 13వ పెద్ద రాష్ట్రంగా ఉంటుందని తెలిపారు. చిన్న రాష్ట్రాల్లోని రాజకీయ అస్థిరత, ఇతర సమస్యలను తెలంగాణకు ఆపాదించడం సముచితం కాదని అన్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ సమస్యలు ఆ రాష్ట్రాలకే ప్రత్యేకమని తెలిపారు. నిజానికి తమ మాతృ రాష్ట్రాలకన్నా అవి మెరుగ్గా ఉన్నాయని అన్నారు. సకల వనరులు, విశాల భూభాగం ఉన్న తెలంగాణకు అలాంటి సమస్యలు ఎదురుకాబోవని అభివూపాయపడ్డారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.