హైదరాబాద్‌పై రాజీలేదు మన జాగీరే

షరతులకు ఒప్పుకొనేదే లేదు.. అవసరమైతే మూడురెట్ల ఉద్యమం
– ఇంకా తెలంగాణ ఆగుతుందన్నోడు మూర్ఖుడే
– మా దిష్టి బొమ్మలు కాల్చి మాతో కలిసి ఉంటరా?
– సీమాంధ్ర నాయకుల్లో ఒక్క మేధావికూడా లేడా?
– ఇన్ని రోజులుగా ఒక్క నాణ్యమైన ప్రకటన చేశారా?
– అక్కడి ఉద్యోగులుంటే మాకే టాక్సులు వస్తయి
– సీమాంధ్ర వాదనలపై జవాబుకు సిద్ధం
– టీజీవో భవనం ప్రారంభోత్సవ సభలో
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

kcrహైదరాబాద్‌పై ఏ ఒక్క షరతుకూ అంగీకరించేది లేదని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షల్లేని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే… 2006లో పుట్టిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వం బెదిరింపుల నుంచి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి సొంత భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయం. ఒకనాడు తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో ఉచ్చరించేందుకు భయపడే పరిస్థితి, ఈరోజు హైదరాబాద్‌లోనే తెలంగాణ కార్యక్షికమాలను నిర్వహించుకునేందుకు ఏకంగా భవనం ప్రారంభించుకోవడంతో ఆత్మగౌరవం పెరిగింది. తెలంగాణ ఉద్యమం త్వరలో విజయతీరాలకు చేరుతుంది. ఎవరూ ఆపలేరు. ఆ టీవీ.. ఈ టీవీవోడు ఏదో చెప్పంగనే మనోళ్లు అనవసరంగా గాబరా పడుతుంటరు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆగుతుందని భావించేవారంతా మూర్ఖులే. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, ప్రభుత్వం కాదని.. కొంతమంది అంటున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరమే రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి కూడా చెప్పారు.

కేసీఆర్, కోదండరామ్‌లు కాదు. ప్రకటన రాగానే చంద్రబాబునాయుడు, విజయమ్మ ఎంత ఇది చేశారో అందరం చూశాం. అందరి రంగులు బయటపడ్డాయి. తెలంగాణ ఆగుతుందని గాబరా అవసరం లేదు. రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకటన వచ్చి 50 రోజులు అవుతుంది. తమకు సమస్యలు వస్తాయని సీమాంధ్ర ఉద్యోగులు, సీమాంధ్ర రాజకీయ నాయకులు ఢిల్లీకి యాత్రలపై యాత్రలు చేస్తున్నారు. లోపలేమైతదో తెల్వది కని బయటకు వచ్చి ఆపేస్తామని చెబుతున్నారు. ఆంధ్ర ప్రాంతలో ఒక్క మేధావి ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఇన్ని రోజుల్లో అక్కడి నుంచి ఒక్క నాణ్యమైన ప్రకటన వచ్చిందా? కేసీఆర్ దిష్టిబొమ్మలు కాలుస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా తిట్టిపోస్తున్నారు. తెలంగాణ పిల్లలు కూడా సోషల్ మీడియాలో బాగా పోరాటం చేస్తున్నరు. ఎప్పుడో జరిగిన విషయాలను కూడా సోషల్ మీడియాలో ఆంధ్రోళ్లకు దీటుగా పెడుతున్నారు. తెలంగాణ అంత పరిణితి చెందింది. అయిపోయిన తెలంగాణను ఎవరూ ఆపలేరు. కేసీఆర్ ఎందుకు మాట్లాడుతలేడని చాలా మంది అడుగుతున్నారు. మౌనంగా ఉంటున్నది ప్రకటన వచ్చిందని…. మాటలు రాకకాదు. తెలంగాణ ఎన్జీఓలతో నేను చెప్పిన మాటల్లో ఏమన్న తప్పుందా? నేను మాట్లాడింది కరెక్ట్ అని కేంద్రహోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య ఏదో టీవీల్లో చెప్పిండు. తెలంగాణ ప్రకటన రాగానే బాబు ఆంధ్రకు 4-5లక్షల కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం ఎందుకు?

50 ఏళ్లు సమైక్య రాష్ట్రంలో నష్టపోయింది ఎవరు? నలిగిపోయిందెవరు? మీకెందుకు ఇవ్వాలి. ఇస్తే అసలు మాకు ఇవ్వాలి. మావోల్లకు నష్టం జరిగింది. వాళ్లు ఇస్తే తీసుకోండి. మాక్కూడా కేంద్రం ఆశీస్సులు కావాలి, ప్యాకేజీలు ఇవ్వాలి. ఉమ్మడి రాజధాని ఉండనీయండి, మద్రాసు వాళ్లు పంపించినట్లు పంపీయద్దు, వాళ్లు రాజధాని కట్టుకొన్న తర్వాత వెళ్లిపోవచ్చు. ఉమ్మడి రాజధానిలో సీమాంవూధులు 20 వేల మంది ఉద్యోగులు ఇక్కడే ఉంటే ఒల్వో బస్సుల నుంచి వచ్చే ఆదాయం, కమర్షియల్ టాక్స్ తెలంగాణకే వస్తుంది. అటువైపు కూడా అమాయకులు లేరు. ఈ కథ… లొల్లి ఎందుకంటే సమస్యను పక్కదారి పట్టించేందుకు. అందుకోసం కవ్విస్తున్నారు. ఆంధ్రవూపాంతం నుంచి వచ్చిన ఉద్యోగి గొంతు కోస్తామని చెయ్యి చూపించిండు. తెలంగాణవాదులు తలుచుకుంటే ఆ సభ జరిగేదా? హైదరాబాద్ పోలిమేర్లపై అడుగు కూడా పెట్టరు. కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను కొట్టిండ్రు. నువు ప్రభుత్వ ఉద్యోగివే. నువు జై సమైక్యాంధ్ర అనచ్చు. శ్రీనివాస్ జై తెలంగాణ అనద్దా? సమస్యను 1969లాగా చేద్దామని చూస్తున్నరు. ఈ రోజు శ్రీశైలంకు వెళ్లి వస్తున్న తెలంగాణ భక్తులను కర్నూల్ జిల్లా పంచలింగాల దగ్గర కొట్టారని సమాచారం వచ్చింది. అలంపూర్ నుంచి కొంతమందిని పంపించాం, ఏదైనా జరిగితే ఆ పరిణామాలకు బాధ్యత వహించాల్సింది మీరేనని ఆ జిల్లా ఎస్పీకి చెప్పాం. ఏదైనా హైదరాబాద్‌ను దక్కించుకోవాలని, ఇంకా ఆపాలని వాళ్లు కుట్ర చేస్తున్నారు. మనం అవతలి వాళ్ల జుట్ల నుంచి వెళ్లేటట్లు ఉండాలి. షార్ప్‌గా, నిశితంగా గమనించాలి. ఆత్మ విశ్వాసంతో ఉండాలి. కన్‌ఫ్యూజ్ కావద్దు, ఎక్కడో అస్థిత్వాన్ని కోల్పోయి..

ఈ స్థాయికి వచ్చాం. రాష్ట్రం వచ్చేదాక పోరాడుదాం. హైదరాబాద్‌పై లెక్కలన్నీ తీసినం, శంకించాల్సిన అవసరం లేదు. సీమాంవూధులు చెప్పినవన్నీ సుద్ద లెక్కలు. హైదరాబాద్ నుంచి కొంత ఆదాయం వస్తుంది. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలు చాలా ప్రాంతాలు కోల్పోయి పరిక్షిశమలు ఏర్పడ్డాయి. వీటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎలాంటి షరతుల్లేని హైదరాబాద్ 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రమే మన లక్ష్యం. ఏదైనా ప్రతిపాదన పెడితే తిరుగుబాటు తప్పదు. ఏ తెలంగాణను ప్రజలు కోరుకుంటాన్నారో అదే కావాలి. ఇంకా పోరాటం చేయాల్సి ఉంది. విజిపూంట్‌గా ఉండాలి. సమయం, సందర్భం వచ్చినప్పుడు మళ్లీ ఉద్యమించాలి. ఆంధ్ర నాయకులు కూడా గుర్తించాలి. ఎవరం వెయ్యేళ్లు బతికేందుకు రాలేదు. డోంట్ ఫర్గెట్.. మీరు చేసే ఆర్గ్యుమెంట్లకు వివరణ ఇచ్చేందుకు నేను సిద్ధమే. మహబూబ్‌నగర్ నుంచి భద్రాచలం వరకూ అతిపెద్ద భౌగోళిక ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుంది. మీరు చిమ్ముతున్న విషబీజాలు, విద్వేషం ఎటుదారి తీస్తుంది? ఎవరిని ఉద్దరిస్తారు? హైదరాబాద్ భద్రత- పరిస్థితి ఏవిధంగా ఉంటుందో హైదరాబాద్ నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు. పక్క ఇంటి వాళ్లను కూడా పట్టించుకోరు. మంది సొమ్ము తీసుకునే సంప్రదాయం మా తెలంగాణది కాదు.

అన్నం తింటుంటే.. తిందాం రండి అని పిలిచే సంప్రదాయం. మీలాగా తినొచ్చారా.. అనే సంప్రదాయం కాదు. ఇది తెలంగాణ సంస్కృతిలోనే లేదు. నీ అయ్యదా హైదరాబాద్? ఏం తెచ్చావు. ప్రపంచంలో ఎక్కడైన బాగుంటే అక్కడికి అందరూ వెళ్తరు. హైదరాబాద్ బాగుంది కాబట్టి దగ్గరకు వచ్చావు. హైదరాబాద్ అప్పటికే అభివృద్ధి చెందిందని వచ్చావు. ఇప్పటికైనా మర్యాదగా ప్రవర్తించండి, ప్రేమభావంతో విడిపోదాం. మా జేఏసీ, మేధావులు, ఉద్యమకారులు, మీ ప్రాంత మేధావులు అందరూ కూర్చోని చర్చించుకుందాం. అంగీ, లాగు ఎందుకు చించుకుంటావు. నువు చించుకుంటే తెలంగాణవాళ్లు ఒప్పుకుంటారనుకుంటున్నారా? మాది కావాలి…మీది కావాలి అంటే ఊరుకోనేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌పై షరతులు పెడితే అంగీకరించేది లేదు. ఇంకా వెర్రి ప్రయత్నాలు వద్దు. తెలంగాణ ప్రజలు వీరులు. రెట్టింపు ఉత్సాహంతో గమ్యం వైపు పయనిస్తుంటారు. దేనికి రాజీపడం. ఈనెల 29న నిజాంకాలేజీ గ్రౌండ్‌లో జరిగే సకల జనుల భేరీకి మహిళలు రావాలని కోదండరామ్ పిలుపుఇచ్చారు. కానీ మనకు నిజాంకాలేజీ సరిపోదు. ఏదైన తొక్కిసలాట జరిగితే మహిళలు ఇబ్బందుల పాలవుతారు. కొన్ని జాగ్రతలు తీసుకోవాలి. మహిళలు సభకు కొంత ముందుగా వస్తే బాగుంటుంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.