హైదరాబాద్‌పై ఎలాంటి కొర్రీని అంగీకరించం : కేసీఆర్

రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాద్‌పై ఎలాంటి కొర్రీని అంగీకరించమని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌పై లేనిపోని అపోహాలు వస్తున్నాయి, హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని కోరుతున్నాం. 28 రాష్ట్రాలకు ఎలాంటి సర్వధికారాలు ఉన్నాయో తెలంగాణకు అలాంటి అధికారాలే ఉండాలి. హైదరాబాద్ పట్టణం శాంతికి, సహనానికి చిహ్నం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతినకుండా చూడాలి.హైదరాబాద్ అంశంలో స్పష్టత ఇవ్వాలని జీవోఎంను కోరుతాం. కేకే నాయకత్వంలో పార్టీ తరపును జీవోఎంకు నివేదిక ఇస్తాం. తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుతా. తేడా వస్తే యుద్ధానికి సిద్ధం.’
చంద్రబాబు చేసేవన్ని లత్కోర్ పనులే
‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసేవన్ని లత్కోర్ పనులే. తెలంగాణను చంద్రబాబు నరనరాన వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినట్లు లేవు. ఎజెండా లేకుండా దీక్ష చేసిన ఘనత బాబుదే. ఎజెండా లేని దీక్షలతో బాబు ఢిల్లీలో అభాసుపాలయ్యిండు. గట్టిగా నిలదీస్తే, అడిగితే నీకెంత మంది కొడుకులు అంటడు. ఏం కావాల్నో చంద్రబాబు స్పష్టంగా చెప్పొచ్చు కదా? తెలంగాణను బాబు వ్యతిరేకిస్తున్నారని ఇక్కడి వారికి అర్థమైంది. దక్కన్ క్రానికల్ పత్రికలో చంద్రబాబు కామెంట్లను టీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. 2009లో అడ్డుకున్న చంద్రబాబు తెలంగాణ ప్రజల ఉసురు తగిలి పోతాడు. అసలు చంద్రబాబు డిమాండ్ ఏంటి? టీ టీడీపీ నేతలు ఇంకా అభాసుపాలు కావొద్దు. ఇంత జరిగినా చంద్రబాబు దగ్గరుండి ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకోవద్దు. బాబు పంచన చేరి ఆత్మవంచన చేసుకోవద్దు.’

తెలంగాణ రైతులపట్ల సర్కార్ వివక్ష: కేసీఆర్
తెలంగాణ రైతాంగంపట్ల సీమాంధ్ర సర్కారు వివక్ష ప్రదర్శిస్తోంది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలేదు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వారికి ప్రభుత్వం వెంటనే పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఈ విపత్తులో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు సాయం చేసేందుకు పార్టీ తరపున ఐదు బృందాలను ఏర్పాటు చేశాం. కరీంనగర్, మంచిర్యాలలో పర్యటనకు వినోద్, కేసీఆర్, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య బృందం వెళ్తుంది. నల్లగొండ, మెదక్‌కు హరీష్‌రావు, వరంగల్‌కు ఈటెల రాజేందర్, కరీంనగర్‌కు వివేక్ వెళ్లారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌కు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు మందా జగన్నాథం వెళ్తారు. వరద ప్రాంతాలకు నేను, కేకే కూడా వెళ్తాం. తెలంగాణలో వరద బాధితులకు అనేక మంది దాతలు విరాళాలు ప్రకటించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.