హైదరాబాద్‌కు ఐటీ హబ్

న్యూఢిల్లీలో శుక్రవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు పచ్చజెండా ఊపింది. ఈ వివరాలను రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట పంపిన ఈ ప్రతిపాదనను సీసీఏఏ శుక్రవారం పరిశీలించి, ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో(50 వేల ఎకరాల్లో) 25 ఏళ్ల కాలంలో రెండు దశల్లో ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తారు. గచ్చిబౌలి, మాదాపూర్, మామిడిపల్లి, రావిర్యాల్, ఆదిభట్ల, మహేశ్వరం, ఉప్పల్, పోచారం తదితర ప్రాంతాలతో కూడుకొని ఈ ఐటీ హబ్ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వ ఐటీ విధానానికి అనుగుణంగా ఇక్కడ ఉత్పాదక యూనిట్లు, లాజిస్టిక్స్, పబ్లిక్ యుటిలిటీస్, పర్యావరణ పరిరక్షణ, గృహ సముదాయ, పాలనా సంబంధ సర్వీసులు వంటివి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వీటిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక పార్కులు, స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలు, గిడ్డంగులు, ఎగుమతి యూనిట్లు తదితరాలను నెలకొల్పే అవకాశం ఉంది. తద్వారా ఈ ఐటీఐఆర్‌లో వచ్చే 30 ఏళ్లలో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే సామర్థ్యం ఉంది. 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, సుమారు 53 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

ఈ ప్రాంతం నుంచి రూ.2.35 లక్షల కోట్ల మేర ఐటీ ఎగుమతులు కానున్నాయి. తద్వారా ప్రత్యక్షంగా రూ.3.11 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. అలాగే, పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30,170 కోట్లు జమ కానుంది. ఈ ఐటీఐఆర్‌లో మౌలిక వసతుల కల్పన కోసం తొలి ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.4,863 కోట్లను వెచ్చించనుంది. రెండు దశల్లో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో 2013 నుంచి 2018 వరకు, రెండో దశలో 2018 నుంచి 2038 వరకు ఐటీ, ఐటీ అనుబంధ, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల హబ్‌గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 12.4 శాతం కాగా, ఎగుమతుల్లో నాలుగో ర్యాంకులో ఉంది. 2011-12లో రాష్ట్రం నుంచి ఐటీ సేవల టర్నోవర్ రూ.53,246 కోట్లుగా నమోదైంది. హైదరాబాద్‌ను సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతంగా గుర్తించి, అభివృద్ధి చేయడం వల్ల ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమల రంగానికి మరింత ఊతం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఇంత భారీ ప్రాజెక్టును కేంద్రం హైదరాబాద్‌కు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.