హిందూ-ముస్లింలు ఏకమై పేదరికంపై పోరాడాలి-మోడీ

పేద ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం బీజేపీ ‘హూంకారం’ (సమరనాదం) చేస్తోందని, ఈ ర్యాలీ బీహార్ పేదల హూంకారమని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ చెప్పారు. హిందువులు, ముస్లింలు ఏకమై పేదరికంపై పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. హిందూ-ముస్లింల ఐక్యత గురించి ప్రస్తావించిన మోడీ.. india
వారిలో ఎవరూ ఒకరితో ఒకరు కొట్లాడాలని అనుకోవడం లేదన్నారు. తన రాజకీయ విరోధి నితీశ్‌కుమార్ సొంత గడ్డపైనే నరేంద్రమోడీ ఆదివారం సమరనాదం చేశారు. ఒకవైపు తన సభకు కొద్దిముందే వరుస పేలుళ్లు జరిగినా బెదరని మోడీ.. బీహార్ సీఎం తీరును చీల్చిచెండాడారు. నితీశ్ అవకాశవాది, ఆత్మవంచనకు నిలు నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజకీయ గురువులైన జయవూపకాశ్ నారాయణ్, రాంమనోహర్ లోహియాలకు ఆయన వెన్నుపోటు పొడిచారని, వారిని మోసం చేశారని మండిపడ్డారు. తమ జీవితాంతం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన జేపీ, లోహియాల అనుచరుడైన నితీశ్.. ప్రధాని కావాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారని దుమ్మెత్తిపోశారు. ఎన్డీయేతో నితీశ్ పార్టీ జేడీయూ తెగదెంపులు చేసుకున్న తర్వాత తొలిసారి బీహార్‌లో పర్యటించిన మోడీ ప్రధానంగా బీహార్ సీఎంనే టార్గెట్ చేశారు. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో బీజేపీతో పొత్తును తెంచుకున్నందుకు ఆయనను తీవ్రంగా తప్పుబట్టారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభ ‘హూంకార్ ర్యాలీ’లో మోడీ ప్రసంగిస్తూ.. ‘జయప్రకాశ్ నారాయణ్‌నే వదులుకున్నవాడు..

బీజేపీని ఎందుకు వదల్లేడు? జేపీ తన జీవితాంతం కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు పోరాడారు. కానీ లోహియా, జేపీ శిష్యుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి.. వారికి వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్‌తో దాగుడుమూతలు ఆడుతున్నారు. ఆయన అనుచరులు దీనిని క్షమిస్తారో లేదో తెలియదు కానీ, లోహియా, జేపీ ఆత్మలు మాత్రం అతని చర్యలను ఎంతమాత్రం క్షమించవు’ అని విరుచుకుపడ్డారు. దేశంలోని అతిపెద్ద సోషలిస్టు నాయకుడైన జేపీ.. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమ్జన్సీని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని లేవదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి 1977లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో సోషలిస్టు ప్రభుత్వాన్ని స్థాపించారు. సభలో మోడీ మాట్లాడుతూ.. ఎక్కడా నితీశ్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఆయనను వ్యంగ్యంగా స్నేహితుడిగా అభివర్ణిస్తూ.. విమర్శనాస్త్రాలు సంధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీహార్‌లో ప్రచారం చేయకుండా నితీశ్ అడ్డుకున్నారని దుయ్యబట్టారు.

బీహార్‌ను మళ్లీ జంగల్‌రాజ్ (ఆటవిక రాజ్యం)గా చేయడం ఇష్టంలేక తాను ఈ అవమానాన్ని భరించినట్టు మోడీ చెప్పారు. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న జేడీయూను బీహార్‌లో గద్దె దించుతామని ఆయన ప్రతిన బూనారు. 40 నిమిషాలపాటు ప్రసంగించిన ఆయన.. బీహార్ ప్రధాన భాషలైన భోజ్‌పూరిలో మొదలుపెట్టి మైథిలి, మగధి భాషలల్లోనూ కొన్ని మాటలు మాట్లాడారు. నితీశ్ ఆత్మవంచనకు పాల్పడ్డారని మోడీ మండిపడ్డారు. ‘ఏడాది కిందట నేను, బీహార్ సీఎం ఇద్దరం ప్రధాని ఇచ్చిన విందులో ఒకే వద్ద పక్కపక్కనే కూర్చున్నాం. వంట కాలు ముందు పెట్టినా ఆయన తినడం లేదు. అసౌకర్యంగా కదులుతూ.. చుట్టూ చూస్తున్నారు. విషయం అర్థం చేసుకున్న నేను, చుట్టూ కెమెరాలేమీ లేవు, ప్రశాంతంగా తిను అని చెప్పాను.. హిపోక్రసీకి కూడా హద్దు ఉండాలి’ అని మోడీ ఎద్దేవాగా వ్యాఖ్యానించారు. నితీశ్ కోసం బీహార్ బీజేపీ నేత సుశీల్‌కుమార్‌మోడీ సీఎం పదవి వదులుకున్నారని గుర్తుచేశారు.

ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం!
బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన తర్వాత తొలిసారి మోడీ ముస్లింల సంక్షేమం గురించి మాట్లాడారు. గుజరాత్‌లో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారని, బీహార్‌లో కన్నా గుజరాత్‌లో ఎక్కువ మంది హజ్‌యాత్రకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. సెక్యులరిజం పేరిట కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.2002 గుజరాత్ అల్లర్లలో భారీగా ముస్లింలు చనిపోవడంతో మోడీకి మైనారిటీ వ్యతిరేకిగా ముద్రపడిన విషయం తెలిసిందే. తాను శ్రీకృష్ణుడి జన్మస్థలంగా భావించే ద్వారాకలో పుట్టానని చెప్పడం ద్వారా మోడీ.. బీహార్‌లో అత్యధికంగా ఉన్న యాదవ వంశస్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూప్రపసాద్ యాదవ్‌కు ప్రమాదం జరిగినప్పుడు ఆయనను ఫోన్‌లో పరామర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. తాను రైళ్లలో టీ అమ్ముకొని ఈస్థాయికి వచ్చానని, రైళ్లలో టీ అమ్ముకునే వారి బాధలు ఏ రైల్వేమంత్రికీ తెలియవన్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వారసత్వ రాజకీయాలను మానుకుంటే.. ఆయనను ఉద్దేశించి తాను ‘షెహజాదే’ (యువరాజు) అనడం మానుకుంటానని మోడీ పేర్కొన్నారు. తాను రాహుల్‌గాంధీని యువరాజు అంటుండటంతో కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. ‘అంతటా బురద పేరుకుపోతోంది. దేశం మార్పు కోరుకుంటోంది. కానీ ఎంత బురద పేరుకుపోతే.. కమలం అంతగా వికసిస్తుంది’ అంటూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రానుందన్నారు.

పేలుళ్ల గురించి ప్రస్తావించని మోడీ!
తన ‘హూంకార్ ర్యాలీ’కి కొన్ని నిమిషాల ముందే.. సభాస్థలికి సమీపంలో పేలుళ్లు జరిగినప్పటికీ, ఈ అంశాన్ని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. అయితే ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనాలను సురక్షితంగా ఇంటికి వెళ్లాలని మోడీ సూచించారు. అనంతరం పేలుళ్ల మృతులకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో సంతాపం తెలిపారు. ‘పాట్నాలో పేలుళ్లు జరగడం చాలా బాధాకరం. దురదృష్టకరం. ప్రశాంతంగా, సహనంగా ఉండాలని ప్రజలను కోరుతున్నా’ అని ఆయన తన పోస్టులో తెలిపారు.

సభ ఖర్చుపది కోట్లు!
నితీశ్‌కుమార్ గడ్డపై నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిగా తొలిసారిగా నిర్వహించిన ‘హూంకార్ ర్యాలీ’కి ప్రత్యేక రైళ్లు, ఆరువేల బస్సులు, 20వేల ప్రత్యేక వాహనాలలో (ఎస్‌యూవీలు) లక్షల మంది జనాన్ని తరలించారు. వక్తలు ప్రసంగాలు వినడానికి సభా ప్రాంగణంలో భారీ ఎల్‌సీడీ తెరలు ఏర్పాటుచేశారు. వేదిక పక్కన 30 అడుగుల డైనమిక్ స్కీన్ భారీ తెరను ఏర్పాటుచేశారు. ఈ సభకు దాదాపు రూ. పది కోట్లు ఖర్చు చేసినట్టు భావిస్తున్నారు. కాగా, మోడీ ‘హూంకార్ ర్యాలీ’ నిర్వహించిన పాట్నాలోని గాంధీ మైదానానికి చారిత్రక నేపథ్యముంది. ఈ మైదానంలో గతంలో మహాత్మాగాంధీ, సుభాష్‌చంద్రబోస్, జయప్రకాశ్ నారాయణ వంటి ఎందరో ప్రముఖులు స్వాతంత్రోద్యమ సమయంలో, అనంతరం ర్యాలీలు తీశారు. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ అంతగా భయపడితే.. తనకు మరింత భద్రత పెంచుకోవాలిగానీ, ప్రజల ముందు ఏడ్వవద్దని మండిపడ్డారు. ఈ సభ వేదికపై నేతలు అరుణ్‌జైట్లీ, శత్రుఘ్నసిన్హా, సుశీల్‌మోడీ ఉన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.