హస్తినకు కేసీఆర్.. -ఈనెల 4న ప్రధానితో భేటీ .

జనవరి 31: తెలంగాణ అంశం తుది దశకు చేరుకున్న తరుణంలో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందేవరకు కేసీఆర్ బందం ఢిల్లీలోనే ఉండనుంది. తెలంగాణ బిల్లులోని 8 అంశాలపై టీఆర్‌ఎస్‌కు అభ్యంతరాలున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌పై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు, ఉద్యోగులు, పెన్షనర్లను జనాభా ప్రాతిపదికగా పంచడం, గోదావరి, కష్ణా నదులపై బోర్డులు చేయడం, రెండు రాష్ర్టాలకు ఒకే విద్యా విధానం, ఉమ్మడి హైకోర్టు, రాజధాని 10 సంవత్సరాలు తదితర అంశాలపై టీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇవి ఇలాగే కొనసాగితే తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టమని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు.

KCRR
ఈ నేపథ్యంలో బిల్లులో చేయాల్సిన సవరణలను ఒక డ్రాఫ్ట్‌రూపంలో టీఆర్‌ఎస్‌లోని రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రూపొందించారు. అదే సమయంలో పార్టీ లైన్‌ను కూడా పొందుపర్చారు. ఈ డ్రాఫ్ట్‌ను 4న ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఇవ్వనున్నారు. అపాయింట్‌మెంట్ ఖరారైన సమాచారం ప్రధాని కార్యాలయం నుంచి ఇదివరకే టీఆర్‌ఎస్ నేతలకు అందింది. ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేముందే యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, జాతీయ నాయకులు మాయావతి, లాలూప్రసాద్‌యాదవ్, శరద్‌పవార్, రాంవిలాస్ పాశ్వాన్, అజిత్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, పార్లమెంటరీపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో పాటు మరికొంత మందిని కలువనున్నారు. ఈమేరకు వారి అపాయింట్‌మెంట్లు సైతం అడిగారు. తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

ఈమేరకు 15 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారమే రైల్లో ఢిల్లీ బయలుదేరి వెళ్లగా.. మిగిలినవారు ఆదివారం వెళ్తున్నారు. కేసీఆర్ వెంట పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సుభాష్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నిరంజన్‌రెడ్డి, వినోద్, నారదాసు లక్ష్మణ్‌రావు, బాలమల్లు, దుబ్బాక నర్సింహారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, రిటైర్డ్ ఐఏఎస్‌లు రామచంద్రు, గోయల్, రామలక్ష్మణ్ ఢిల్లీ వెళ్లారు.

శంషాబాద్‌లో ఘనంగా వీడ్కోలు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఢిల్లీ వెళ్లడానికి శుక్రవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కార్యకర్తలు, తెలంగాణ అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో జై తెలంగాణ నినాదాలతో ఎయిర్‌పోర్టు మార్మోగిపోయింది. అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఎయిర్‌పోర్టు లోపలికి కేసీఆర్ వెళ్తున్న సమయంలో పెద్దఎత్తున తోపులాట జరిగింది. అంతకుముందు ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కవిత అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యం అని అన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వీడ్కోలు పలికినవారిలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, మహిళా జిల్లా అధ్యక్షురాలు స్వప్న, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టం పురుషోత్తం, నాయకులు కొనమోల్ల శ్రీనివాస్, మోహన్‌రావు, రాజేందర్, కమలమ్మ ఉన్నారు.

టీ బిల్లుకు అన్ని పార్టీలను ఏకం చేస్తాం: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో అన్ని పార్టీలను ఏకం చేస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఢిల్లీకి వెళ్లారు.ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కష్టరావు, వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి, విద్యాసాగర్‌తోపాటు ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్, మహబూబ్‌అలీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4న బిల్లు జీవోఎం ముందుకు వెళ్తుందని.. 11న ఉభయ సభల్లో ప్రవేశపెట్టడం ఖాయమన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.