ఉద్యమ పార్టీకి పుష్కరం పూర్తి


trsanna

రాజీలేని రాజకీయ పోరాటాలు..
ఉధృతమైన క్షేత్రస్థాయి ఉద్యమాలు
స్ఫూర్తినిస్తున్న కార్మిక సంఘ విజయాలు..
కేసీఆర్ సారథ్యంలో దూకుడు
నేడు ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
100 అసెంబ్లీ 15 ఎంపీ స్థానాలపై గురి..
తద్వారా తెలంగాణ సాధించే వ్యూహం
తెలంగాణ పోరుగడ్డపై పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి శనివారంతో పదమూడవ ఏట అడుగుపెట్టనుంది. పుష్కరకాల ఉద్యమ, రాజకీయ ప్రస్థానంలో అగ్రభాగాన నిలిచిచిన టీఆర్‌ఎస్.. అనేక ఆటుపోట్లు, సవాళ్లు అధిగమించి.. అనేక విజయాలను సాధించింది. మడమ తిప్పని ఉద్యమమే మూలధనంగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర రాజకీయ చిత్ర పటాన్ని సమూలంగా మార్చివేసింది. కాకలుతీరిన రాజకీయయోధులకే ముచ్చెమటలు పట్టిస్తున్న టీఆర్‌ఎస్.. చూస్తుండగానే ఉద్యమ చరివూతలో కలికితురాయిగా నిలిచింది. పుష్కరకాలపు ప్రస్థానాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే.. రాష్ట్ర రాజకీయాలపై టీఆర్‌ఎస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యమంలో టీఆర్‌ఎస్ విశిష్ఠత అర్థమవుతుంది.2000 సంవత్సరం నాటికే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోనే మంచి పేరున్న నాయకుడు. ముఖ్యంగా టీడీపీ సిద్ధాంతకర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. మంచి వ్యూహకర్త. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అప్రతిహతంగా విజయాలు సాధిస్తూనే మంత్రిగానూ పని చేసిన కేసీఆర్‌లో ఏదో తెలియని అసంతృప్తి. తెలంగాణ ప్రాంతం మళ్లీ వివక్ష విష వలయంలో చిక్కుకుంటోందన్న బాధ. సీమాంధ్ర నాయకత్వ ప్రభావం నిలు ఉన్న టీడీపీలో ఉంటూ తెలంగాణకు సరైన రీతిలో న్యాయం చేయలేకపోతున్నానన్న ఆవేదన. ఇవే ఆయనలో గుణాత్మక మార్పుకు బీజాలు వేశాయి. అప్పటికే అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నప్పటికీ సవతి తల్లి ప్రేమకు గురవుతున్న సొంత గడ్డపై ఉన్న మమకారం ఆయన ఆలోచనా విధానాన్ని మార్చివేసింది. టీడీపీకి గుడ్‌బై చెప్పారు. డిప్యూటీ స్పీకర్, సిద్దిపేట ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలా త్యజించారు. ప్రజాస్వామ్యబద్ధంగా మరో చారివూతక పోరాటానికి తెరలేపారు. కొన ఊపిరితో ఉన్న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నానికి కొత్త ఊపిరి అందించారు. స్వరాష్ట్ర సాధన కోసం మహత్తర పోరాటానికి అంకురార్పణ చేస్తూ 2001, ఏప్రిల్ 27న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’కి కేసీఆర్ ప్రాణం పోశారు. ఉద్యమపార్టీకి తెలంగాణ ప్రజలు నీరాజనాలు పలికారు. పార్టీ ఆవిర్భవించిన మూడు నెలలకే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణవాదం సత్తాను చాటాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫలితాలతో ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

సిద్దిపేట నుంచి తిరిగి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచిన కేసీఆర్ 2004 సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాలనే శాసించే స్థాయికి చేరారు. అప్పటికి రాష్ట్రంలో ఉద్దండ నాయకులుగా నాటి సీఎం చంద్రబాబు.. ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌డ్డి ఉన్నారు. ఈ ఇద్దరి నడుమ ఒకే ఒక్కడుగా నిలిచిన కేసీఆర్ 2004 సాధారణ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యంగల నాయకుడిగా వెలుగొందారు. టీఆర్‌ఎస్ ప్రాధాన్యాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఎన్నికల్లో పొత్తులకు సిద్ధపడింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీరుస్తామని సోనియాగాంధీయే స్వయంగా చెప్పడంతో కాంగ్రెస్‌తో జత కట్టడానికి కేసీఆర్ సరేనన్నారు. చంద్రబాబు పాలనకు తెర దిగింది. టీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు ఎంపీలు, 26 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. కాంగ్రెస్ హామీల మేరకు రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రివర్గాల్లో టీఆర్‌ఎస్ చేరింది. కానీ.. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడుతుండటంతో రెండు కేబినెట్‌ల నుంచి టీఆర్‌ఎస్ వైదొలిగింది. కుట్ర చేసిన కాంగ్రెస్.. పది మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని.. టీఆర్‌ఎస్ ఉనికినే సవాల్ చేసింది. అసలు తెలంగాణవాదమే లేదంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేయడంతో కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది వారి నోటికి తాళం వేశారు. ఆ తరువాత 16మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణం ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేశారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల్లో మిశ్రమ ఫలితాలతో టీఆర్‌ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. సీఎంగా ఉన్న వైఎస్ చర్యలతో టీఆర్‌ఎస్ మరింత కష్టకాలాన్ని చవిచూసింది. అయినా వెరవక.. వివిధ రూపాల్లో ఉద్యమాలను ఉధృతం చేసింది. 2009 ఎన్నికల్లో కొత్త పరిణామాలు సంభవించాయి. కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న టీఆర్‌ఎస్‌పై టీడీపీ చూపు పడింది. సమైక్యవాదాన్ని సడలించుకొని తెలంగాణకు జైకొట్టింది. కాంగ్రెస్‌పై కోపంతో ఉన్న టీఆర్‌ఎస్.. తెలంగాణకు సై అన్న టీడీపీతో జతకట్టింది. మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. స్వల్ప తేడాతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. మిత్రధర్మాన్ని పాటించకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా బీ ఫారాలు ఇచ్చి టీడీపీ చేజేతులా అధికారంలోకివచ్చే అవకాశాన్ని జారవిడుచుకుంది. టీఆర్‌ఎస్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
kcranna
2009 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో రాష్ట్రం రాజకీయ అనిశ్చితికి చేరింది. అధికారపక్షంలో ముఠా కుమ్ములాటలు రేగాయి. అప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న సీఎం రోశయ్యకు కేసీఆర్ రూపంలో పెనుసవాల్ ఎదురైంది. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఇస్తారా? చస్తారా? అని సింహగర్జన చేస్తూ 2009 నవంబర్ 28న సిద్దిపేటలో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. దీక్ష చేపట్టకముందే ప్రభుత్వం కేసీఆర్‌ను కరీంనగర్ శివారులోనే అరెస్టు చేయించి ఖమ్మం జిల్లాకు తరలించింది. ఆ పరిణామంతో తెలంగాణ అట్టుడికిపోయింది. హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినప్పటికీ కేసీఆర్ దీక్ష వీడలేదు. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుండటంతో తెలంగాణ ఉద్రిక్తతతో అగ్నిగుండమైంది. కలవరపడిన కేంద్రం.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒకటి రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలూ తెలంగాణ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశాయి. దీని ఆధారంగా 2009 డిసెంబర్ 9న నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. కాని ఈ ఆనందం కొన్ని గంటలు కూడా నిలువలేదు. అర్ధరాత్రి మొదలైన కుట్రలతో.. తెల్లారి వరుసకట్టిన ఉత్తుత్తి రాజీనామాలతో పరిస్థితి మారిపోయింది. దీంతో మరో ప్రకటన చేసిన కేంద్రం.. తెలంగాణను పక్కనపె దీక్ష విరమించి నీరసంగా ఉన్నప్పటికీ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి టీ జేఏసీకి అంకురార్పణ చేశారు. ఉద్యమం ఊపందుకుంది. శ్రీకృష్ణ కమిటీని వేసి ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కేంద్రం యత్నించింది. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని 2010లో టీజేఏసీ పిలుపునివ్వగా కేవలం టీఆర్‌ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే మాత్రమే రాజీనామాలు చేశారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ పోరు బిడ్డలకే పదవిని కట్టబెట్టి ప్రజలు తమ ఆకాంక్షలను గట్టిగా వినిపించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగానే వచ్చింది.

అయినా వెనుకంజ వేయని టీఆర్‌ఎస్ పార్లమెంటులోను, బయట పోరుబాట వీడలేదు. కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. దాంతో టీఆర్‌ఎస్ బలం 19కు చేరింది. గడిచిన ఏడాది కాలంలో టీఆర్‌ఎస్ పలు కార్మిక సంఘాల ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలను సాధించింది. సింగరేణి, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ, జలమండలి కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కూటమి ఘన విజయాన్ని సాధించింది. హైదరాబాద్‌లో తెలంగాణవాదం లేదంటున్న సీమాంవూధుల నోళ్లను కట్టివేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ గడప గడపకు తెలంగాణ అనే నినాదంతో ముందుకు సాగుతోంది. సంకీర్ణ యుగంలో తెలంగాణ సాధనకు టీఆర్‌ఎస్ స్వీయ రాజకీయ అస్థిత్వమే కీలకమని గుర్తించిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర పార్టీలను సమూలంగా తుడిచిపె క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం చేస్తున్నది. ఈ క్రమంలోనే తెలంగాణలో 100 అసెంబ్లీ స్థానాలను, 15 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ గెల్చుకుంటే రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఉద్యమక చక్రం తిప్పవచ్చని భావిస్తున్నది. తెలంగాణ విషయంలో నాన్చుడు ధోరణులకు, మాయ మాటలకు, మోసాలకు పాల్పడుతున్న టీడీపీ, కాంగ్రెస్‌లను ఖాళీ చేయించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేవారికి మే 15 గడువుగా ప్రకటించారు. ఆ తరువాత ఏ క్షణంలోనైనా టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. దానితోపాటు మే నెలలో మహోద్యమాన్ని నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇంతటి వ్యూహాత్మక పరిస్థితుల నడుమ టీఆర్‌ఎస్ పదమూడవ ఏట అడుగుపెట్టబోతున్నది. దీనికి సూచికగా ఈనెల 27న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 40వేల మందితో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల కీలక నిర్ణయాలకు ఆర్మూరు సభ వేదిక అవుతుందని భావిస్తున్నారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.