స్థానికత ఆధారంగానే ఉద్యోగులను పంచాలి-తెలంగాణ ఉద్యోగ సంఘాలు

  ఉద్యోగ సంఘాలతో కమల్‌నాథన్ కమిటీ సమావేశాలు శనివారం రెండో రోజు కూడా కొనసాగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ, మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలతో కమిటీ చైర్మన్ కమల్‌నాథన్ వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. శుక్రవారం ఆహ్వానం అందిన 19 గుర్తింపు ఉద్యోగ సంఘాలు తమ వాదనలను కమిటీ ముందు వినిపించాయి. మరికొన్ని సంఘాలు సమయం సరిపోలేదని, భేటీ తీరు సరికాదని విమర్శలు చేయడంతో కమల్‌నాథన్ అభిప్రాయాల సేకరణకు శనివారం అవకాశమిచ్చారు. కాగా ఉద్యోగ సంఘాలన్నీ శుక్రవారంనాటి డిమాండ్లనే కమిటీముందు వినిపించాయి.
officer
వారు వెల్లడించిన అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసికెళ్తానని, మరోసారి సమగ్రంగా చర్చించేందుకు సమయం ఇస్తానని కమల్‌నాథన్ చెప్పారు. ఉద్యోగులందరికీ ఆప్షన్లు వర్తింపజేయాలని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులు చేశాయి. ఇతర రాష్ర్టాల విభజనలో అనుసరించిన విధానాలు కాకుండా ముల్కీ, 610 జీవో ఉల్లంఘనలు, రాష్ట్రపతి ఉత్తర్వులు పరిగణలోకి తీసుకుని ఏ ప్రాంత ఉద్యోగులను ఆ ప్రాంతానికి పంపించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు పునరుద్ఘాటించాయి. ఆప్షన్‌లు వద్దని, సర్వీస్ రికార్డులోని చిరునామా ఆధారంగా నేటివిటీని నిర్ధారించి అక్రమ ఉద్యోగులను స్వస్థలాలకు పంపించాలని పట్టుపట్టాయి.
ఉద్యోగుల విభజనపై రాజకీయ నేతలు మాట్లాడుతున్న ఆచరణ సాధ్యంకాని మాటలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం చెప్పింది. కమిటీని కలిసి సంఘాలు, నాయకుల్లో తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, ఆఫీసర్స్ అసోసియేషన్, జైళ్ళు, తెలంగాణ తహశీల్దార్‌ల సంఘం, సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంఘం, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, తెలంగాణ ఐ అండ్ పీఆర్ జేఏసీ అసోసియేసన్ నేత సీహెచ్ సీతారాంరెడ్డి, ఏపీ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ సలీం, ఏపీఎస్ ఆర్టీసి అధికారుల సంఘం, ఏపీ ఫైర్ సర్వీసెస్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ది టీచర్స్ ఆఫ్ డెఫ్, విజయభాను ఆర్టీసి అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ యానిమల్ హస్బెండరీ ఆఫీస్ అధికారుల సంఘం నేత డాక్టర్ టీ శ్రీనివాస్, తెలంగాణ వీఆర్వోల సంఘం నేతలున్నారు. ఉద్యోగ సంఘాల వాదనలు…

డిప్యుటీ తహశీల్దార్‌లుగా నియమితులైన ప్రాంతేతరులు ఎక్కడ రిక్రూట్ అయితే అక్కడికే పంపాలి. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టేలా 6 మండలాల్లో సీమాంధ్ర ఉద్యోగులను నియమించుకునేందుకు సృష్టించిన డిప్యుటీ తహశీల్దార్ల అప్‌గ్రేడేషన్‌ను రద్దుచేయాలి. – లచ్చిరెడ్డి, లక్ష్మయ్య, పద్మాచారి, చంద్రకళ, టీ రెవెన్యూ తహశీల్దార్ల సంఘం
విభజనకు స్థానికతే ప్రామాణికంగా పరిగణించాలి. స్థానికత విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్న ఉద్యోగులను ఉద్యోగంలోంచి తొలగించాలి. – పాండు బీ నాయక్, తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంఘం
స్వంత జిల్లా మినహా ఇతర ప్రాంతాలకు ఆప్షన్లు ఇవ్వవద్దు. స్వంత జిల్లాకు వెళ్తామంటే పంపేయాలి. డిప్యుటేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగులను స్వంత శాఖలకు పంపాలి. పదోన్నతులను తక్షణం నిలిపివేయాలి.- చంద్రశేఖర్‌గౌడ్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం
ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలి. విభజన సుహృద్భావ వాతావరణంలో జరగాలి. వేధింపులు ఆపాలి.ఆప్షన్లపై రాజకీయ పార్టీల వాదనలు ఎన్నికల సంఘం దృష్టికి తీసికెళ్తాం. – ఏవీ పటేల్, సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం
నేటివిటీ ప్రకారమే ఉద్యోగులను కేటాయించాలి.40 శాతం ఓపెన్ కోటాలో వచ్చిన స్థానికేతరులను మెరిట్ ఉద్యోగులను వారి సొంత రాష్ర్టాలకు పంపించాలి.- వెంకటేశం, టీ ఇంజనీర్స్ జేఏసీ

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.