స్తంభించిన సడక్

మహబూబ్‌నగర్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష మరోమారు ఉవ్వెత్తున ఎగిసిపడింది. జాతీయ రహదారి పొడవునా గురువారం సడక్‌బంద్ సందర్భంగా జరిగిన నినాదాలు ఢిల్లీకి ప్రత్యేక సెగలను తగిలించాయి. సడక్‌బంద్‌లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు చేసిన హెచ్చరికలు, అరెస్టులు, బైండోవర్‌లు తెలంగాణ ప్రజల కాంక్షను అడ్డుకోలేకపోయాయి. అన్నింటికీ తెగించి ఊళ్లకు ఊళ్లు రోడ్లపైకి చేరుకొని తమ ఆకాంక్షను వెల్లడి చేయడంలో విజయవంతమయ్యారు. అడుగడుగునా ఖాకీల అడుగుల చప్పుళ్లు, లాఠీదెబ్బలను లెక్కచేయకుండా సడక్‌బంద్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిమ్మ తిరిగేలా తమ ఆకాంక్షను చాటుకున్నారు. జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ప్రధానంగా ఐదు కేంద్రాలలో జాతీయ రహదారి దిగ్బంధం చేయాలని తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన లభించింది.

ఎనిమిది వేల మందికి పైగా ఖాకీల లాఠీలు, తుపాకీ తూటాలకు బెదరకుండా ప్రజలు సడక్‌బంద్‌లో పాల్గొని సక్సెస్ చేశారు. అలంపూర్ చౌరస్తా వద్ద నిర్వహించిన సడక్‌బంద్ ఆద్యంతం ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఒకవైపు ఉద్యమకారులు, మరోవైపు పోలీసులు నువ్వా, నేనా అన్నట్లుగా వ్యవహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా సడక్‌బంద్‌ను నిర్వహించేందుకు వస్తున్న జేఏసీ చైర్మన్ కోదండరాం, కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యుడు జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, గంప గోవర్ధన్, టీఎంయూ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామరెడ్డి, సుబ్బన్న, భూషణంలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యనాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన తెలంగాణవాదులు చౌరస్తాలో బైఠాయించి సడక్‌బంద్‌ను జయప్రదం చేశారు. భూత్పూర్ మండలంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడంతో మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు స్వచ్ఛందంగా జాతీయ రహదారి వద్దకు తరలివచ్చారు.

భూత్పూర్-పోతులమడుగు గ్రామాల మధ్య ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంలోనే ఉద్యమకారులు, పలువురు జేఏసీ, టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు సైతం మహిళలతో కలిసి సడక్‌బంద్‌ను నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించిన మహిళలు, ఆందోళనకారులను తొలగించే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య పెద్దఎత్తున వాదోపవాదాలు జరిగాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి వాహనాల్లోకి ఎక్కించే ప్రయత్నం పోలీసులు చేయగా, మరోవైపు నుంచి ఆందోళనకారులు కిందికి దిగి పోలీసులతో పెద్ద ఎత్తున గొడవకు దిగారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీ దెబ్బలు తింటూనే మహిళలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, వినయ్‌భాస్కర్, విద్యాసాగర్, బీజేపీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర నాయకులు వేదకుమార్, రత్నమాలను పోలీసులు అరెస్టు చేసి బిజినేపల్లి, జడ్చర్ల, భూత్పూర్, పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అంతకు ముందు గోప్లాపూర్ గ్రామంలో సమావేశమైన మహిళలను చెదరగొట్టేందుకు వెళ్ళిన పోలీసులపై ఆందోళనకారులు ఎదురు తిరుగడంతో పోలీసులు పలాయణం చిత్తగించారు.

మహిళలు బృందాలుగా ఏర్పడి సడక్‌బంద్‌కు చెట్లు, గుట్టల వెంబడి తరలివచ్చారు. సడక్‌బంద్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేందర్‌రెడ్డి అలంపూర్ టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు టోల్‌గేట్ వద్దకు భారీగా చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. వెంటనే పోలీసులు జూపల్లి, జితేందర్‌రెడ్డితో పాటు పలువురిని అరెస్టు చేసి జీపు, డీసీఎంలో తరలించడానికి ప్రయత్నించగా తెలంగాణవాదులు అడ్డుపడి వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. జూపల్లి, జితేందర్‌రెడ్డి కిందికి దిగి మళ్లీ రహదారిపై బైఠాయించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం, కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్ టోల్‌గేట్ వద్దకు రావడంతో పోలీసులు వారినీ అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, జేఏసీ నాయకులు వారిని చుట్టుముట్టి అరెస్టు చేయకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పోలీసుల బలవంతంగా వారిని అరెస్టు చేసి కర్నూలు జిల్లా మీదుగా రాజోళి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది న్యాయవాదులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో దాదాపు 200 మంది తెలంగాణవాదులు పొలాల వెంట పరుగెత్తుకుంటూ టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. సీపీఐ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డితో పాటు సీపీఐ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో వారిని కూడా పోలీసులు డీసీఎంలో ఎక్కించి ఆయా పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఇందుకు ఆగ్రహించిన ఉద్యమ కారులు నాలుగు లారీలు, ఓ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. పలు వాహనాల టైర్లలో గాలి తీసి నిరసన తెలిపారు. టీఎస్ జేఏసీ నాయకులు పూనె కైలాసనాథ్, ఓయూ జేఏసీ నాయకులు మాడకంటి విజయ్, శివకుమార్, మల్లిఖార్జున్‌యాదవ్, నరేష్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశారు.

అరెస్టు అయిన ఎమ్మెల్యేలతో పాటు జేఏసీ ఛైర్మన్ కోదండరాం, కో ఛైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ రాజోలి పోలీస్‌స్టేషన్‌లో ఆందోళన నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ఎండలోనే కూర్చొని అరెస్టుకు నిరసన తెలిపారు. జడ్చర్ల వద్ద టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు లకా్ష్మరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణవాదులు సడక్‌బంద్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పోలీసులు చేరుకొని సడక్‌బంద్‌ను అడ్డుకొని లకా్ష్మరెడ్డితో పాటు టీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలానగర్ వద్ద నిర్వహించిన సడక్‌బంద్‌లో విమలక్క, దాస్‌రాంనాయక్ పాల్గొని విజయవంతం చేశారు. రాజాపూర్ వద్ద పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సడక్‌బంద్ కార్యక్రమానికి బుధవారం రాత్రికే ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్‌లతో పాటు రాష్ట్రంలోని ఆయా తెలంగాణ జిల్లాల నుంచి నేతలు, సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఉదయానికే వారు రోడ్డుపై బైఠాయించి సడక్‌బంద్‌ను జయప్రదం చర్యలు చేపట్టడంతో పోలీసులు హుటాహుటిన రాజాపూర్‌కు చేరుకొని పీఆర్‌టీయూ నేతలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనాల్లో తీసుకెళుతున్న సమయంలో తెలంగాణవాదులు, కుల సంఘాల నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు భారీగా చేరుకొని ఎమ్మెల్సీలు, పీఆర్‌టీయూ నేతలతో పాటు విమలక్కను అరెస్టు చేసి కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గొల్లపల్లి వద్ద బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, పాలాది రాంమోహన్‌ను అరెస్ట్ చేశారు. మాచారం వద్ద పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ కార్యకర్తలు సడక్‌బంద్‌లో పాల్గొని రహదారిపైనే భోజనాలు చేశారు. జడ్చర్ల క్రాస్‌రోడ్డు వద్ద సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొత్తకోట మండల కేంద్రానికి సమీపంలో నిర్వహించిన సడక్ బంద్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఎద్దుల బండ్లను రోడ్డుపైకి తీసుకొచ్చారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా వారు ఏ మాత్రం భయపడకుండా నిరసన కార్యక్రమాలకు బయలుదేరారు.

రైతులను అరెస్టు చేసినా ఉద్యమకారులు ఎద్దులు, బండ్లను రోడ్లపైనే ఉంచి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు, పోలీసుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రాణిపేట గ్రామంలో తలదాచుకున్న ఎమ్మెల్యేలు రాజయ్య, బిక్షపతి, జోగురామన్న, కొప్పుల ఈశ్వర్ గురువారం ఉదయం సడక్‌బంద్ స్థలానికి చేరుకోగానే పోలీసులు అరెస్టు చేసి వనపర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాలెం, కనిమెట్ట, అమడబాకుల, రాణిపేట గ్రామాల జాతీయ రహదారిపై టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో సడక్‌బంద్ నిర్వహించారు. రహదారిపై టైర్లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. షాద్‌నగర్, కొత్తూరు, తిమ్మాపూర్‌ల వద్ద నిర్వహించిన సడక్‌బంద్ ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. పోలీసులు అతిగా ప్రవర్తించడంతో ఒకానొక సందర్భంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. సడక్‌బంద్ కోసం అన్నారం గ్రామానికి చేరుకున్న సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారకరామారావు, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్‌రావులను పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై ర్యాలీగా వస్తుండగా కేటీఆర్, గుండా మల్లేష్, బాల్కసుమన్‌ను అరెస్టు చేసి షాబాద్, షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ జంగారెడ్డితో పాటు ఏబీవీపీ, టీఆర్‌ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. షాద్‌నగర్ వద్ద జాతీయ రహదారిపై గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.