స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో అమరులకు స్మారకస్తూపం

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరులకోసం.. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో మహత్తర స్తూపాన్ని నిర్మిస్తామని, ప్రభుత్వమే ఈ బాధ్యతను తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ స్తూపాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని.. తెలంగాణ రాష్ట్ర అధికారిక కార్యక్రమాలన్నీ అమవీరుల స్తూపానికి సెల్యూట్ చేసిన తర్వాత ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ శనివారం శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి శాసనసభలో, శాసనమండలిలో విశేష స్పందన లభించింది. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అమరులకు జోహార్.. వీరులకు జోహార్ అంటూ వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకున్నారు.

nivali

సీఎం ప్రవేశపెట్టిన తీర్మానంపై అసెంబ్లీలో పార్టీలవారీగా సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ చర్చలో మొదటగా కాంగ్రెస్ సభ్యుడు జీ చిన్నారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చినట్లుగానే అమరుల కుటుంబాలకు రాయితీలు ఇవ్వాలన్నారు. శ్రీకాంతాచారి మతిచెందిన దినాన్ని తెలంగాణ అమరవీరుల దినంగా గుర్తించాలని టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. అమరుల కుటుంబాలకు లోటు రానివ్వద్దని ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. 1969 అమరుల కుటుంబాలకు కూడా సమానహోదా ఇవ్వాలని బీజేపీ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. వైఎస్సార్సీపీ సభ్యుడు బానోతు మదన్‌లాల్, సీపీఐ సభ్యుడు రవీంద్ర కుమార్, టీఆర్‌ఎస్ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి స్వాగతించారు. జైళ్లకు పోయి, బాధలుపడి, గాయాలపాలైన ఉద్యమ కారులను గుర్తించి వారిని తెలంగాణ పోరాట యోధులుగా గుర్తించాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

శాసనమండలికే అగ్రతాంబూలం: సీఎం

శాసనసభకన్నా శాసనమండలి ఉన్నతమైన సభ అని, మండలికే ఇకనుంచి అగ్రతాంబూలం ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం శాసనమండలిలో ఉభయసభలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. అమరులకు భారీ స్మారక చిహ్నం నిర్మిస్తామని సీఎం ప్రకటిస్తూ.. శాసనసభ, మండలి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. దీనిపై టీడీపీ సభ్యుడు పొట్ల నాగేశ్వర్‌రావు సానుకూలత వ్యక్తం చేస్తూనే.. సీఎం ప్రతీ సందర్భంలోనూ శాసనసభను ముందుగా ప్రస్తావిస్తున్నారని, ఉన్నతసభ శాసనమండలి అని గుర్తించాలి అని పేర్కొన్నారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నుంచి శాసనమండలికి ప్రత్యేక గౌరవ ప్రతిపత్తులు లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం ప్రవేశపెట్టిన 11 తీర్మానాలను మండలి ఆమోదించింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.