స్కాలర్ షిప్‌లకు ఆధార్ తప్పనిసరి-ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో విద్యార్థుల గగ్గోలు

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల ఉపకారవేతనాలు, బోధనా రుసుములపై ఆధార్ వేటు వేసింది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇబీసీ విద్యార్ధులు వీటిని పొందాలంటే ఆధార్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. ఈనెల 2న సాంఘిక సంక్షేమ శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం ఉపకార వేతనాలను, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పొందే ప్రతి విద్యార్ధి తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మూడొంతుల మంది విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్‌మెంట్, బోధనా రుసుములు అందని పరిస్థితి నెలకొంది.

ఇప్పటికీ రాష్ట్రంలో 68% మందికి ఆధార్ కార్డులే లేవు. ప్రభుత్వ నిర్ణయం ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్ భారాన్ని వదిలించుకునేందుకేననే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాసంవత్సరం ముగుస్తున్న తరుణంలో కొత్త నిబంధనలు అమలుచేయాలనే ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్ధుల్లో తీవ్ర ఆందోళన అలుముకుంటోంది. ఈ సర్యులర్‌లో పేర్కొన్న అనేక అంశాలు కూడా ఆచరణ సాధ్యం కాదని విమర్శలు వస్తున్నాయి.

గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షలమంది విద్యార్థులు ఉపకార వేతనాలకు అర్హత సాధించారు.ఈ ఏడాది ఇప్పటికే 32 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. బోధనా ఫీజుల బడ్జెట్ ఈ ఏడాది రూ. 4500కోట్లనుంచి రూ. 5వేల కోట్లకు చేరడంతో ఆందోళనకు గురయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4500కోట్లనుంచి రూ.5వేల కోట్లు అవసరంకాగా ప్రభుత్వం కేవలం రూ. 2513కోట్లు మాత్రమే చెల్లించగలిగింది. వీటికి అడ్డుకట్ట వేయకపోతే చెల్లింపులు సాధ్యం కాదన్న నిర్ణయానికి రావడం వల్లనే ఆధార్‌ను అనుసంధానిస్తూ కొత్త నిబంధనలను తెచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.