సోనియా, రాహుల్‌ డూప్లికేట్‌ గాంధీలు-కేటీఆర్‌

డూప్లికేట్ గాంధీలు సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో తెలంగాణ రాదని తేలిపోయిందని కేటీఆర్‌ తెలిపారు. డూప్లికేట్ గాంధీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు జేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో తెలంగాణ నేతలకు విలువ, స్థానం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తెలంగాణ కూడా ఇవ్వదని స్పష్టమైందని ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగడమంటే వాళ్లను ఎన్నుకున్న తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని కేటీఆర్ విమర్శించారు.

టీఆర్‌ఎస్‌లోకి రావడం శుభపరిణామం: కేటీఆర్
కాంగ్రెస్ ఎంపీలు మంద జగన్నాథం, వివేక్, నేతలు కే కేశవరావు, వినోద్‌లు టీఆర్‌ఎస్‌పార్టీలోకి రావడం శుభపరిణామమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో కాలం చెల్లిందని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ నేతల పట్ల దురహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుతున్నట్టుంది: కేటీఆర్

సీమాంధ్ర నేతల వాలకం చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నట్టుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ నేతల పట్ల సీమాంధ్ర నేతలు దురహంకార పూరితంగా వ్యవహరించడాన్ని ఆయన ఎండగట్టారు. ఎంపీలు వివేక్, మందా, రాజయ్యలు తెలంగాణ దళిత నేతలైనందుకేనా పార్లమెంట్‌లో తెలంగాణ కోసం దీక్ష చేసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అదే కాంగ్రెస్ నేతలను కడిగి పడేసినా సీమాంధ్ర ఎంపీ కావూరిని సీఎం కిరణ్ పిలిచి బుజ్జగించారని ఆయన అన్నారు. కావూరి పెట్టుబడిదారుడు కాబట్టే ఆయను బుజ్జగించారు. తెలంగాణ ఎంపీలు దళితులైనందుకేనా ఈ వివక్ష అని నిలదీశారు. ఇక పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అయితే తెలంగాణ నేతలు పార్టీ నుంచి పోతేపోనీ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరు వ్యవహరిస్తున్న తీరు నీరో చక్రవర్తి తీరులా ఉందని తెలిపారు.

కిరణ్ వంటి సీఎం తెలంగాణ ప్రజలకు శాపం:కేటీఆర్
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు దొరకడం ఒక శాపంలాంటిదని కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం ఆయనకే చెల్లిందని స్పష్టం చేశారు. సీఎం మాటలు, వాలకం చూస్తూంటే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీకి సమాధి కట్టేందుకు కంకణం కట్టుకున్నట్టు ప్రజలు భావిస్తోన్నారని తెలిపారు. బొత్స కూడా తెలంగాణ నేతలు పార్టీలు మారితే పట్టించుకోవడంలేదని, అదే సీమాంధ్ర నేతలైతే సంప్రతింపులు జరుపుతున్నారని అన్నారు. తెలంగాణ నేతలు పోతేపోనీ అని వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌పార్టీని తెలంగాణలో బొందపెట్టడానికే అన్నట్టు ప్రజలు భావిస్తోన్నారని తెలిపారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలేదని కేటీఆర్ అన్నారు. ఆజాద్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వచ్చి తెలంగాణ ఇస్తామని చెప్పి పొత్తు పెట్టుకుంది నిజంకాదా అని ప్రశ్నించారు. గులాబీ కండువా కప్పుకుని సోనియాగాంధీ బహిరంగ సభలో తెలంగాణ ఇస్తామని ప్రకటించింది అబద్దమా అని నిలదీశారు. అప్పుడు ఎందుకు సీమాంధ్రులు స్పందించలేదని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. చివరికి డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని చెప్పి కూడా సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గి తెలంగాణను ఇవ్వకుండా అన్యాయం చేశారని తెలిపారు.

లేఖ ఇచ్చినం అంటూ పీక నొక్కింది టీడీపీయే: కేటీఆర్
తెలంగాణపై లేఖ ఇచ్చామని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అనడంపై కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణపై లేఖ ఇచ్చినమంటూనే పీక నొక్కింది కూడా టీడీపీయే అని విమర్శించారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత యూటర్న్ తీసుకున్నది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. టీడీపీ లేఖ ఒక బూటకమని ఆ లేఖను తీసుకుపోయిన అప్పటి టీడీపీ నేత కడియం శ్రీహరి స్వయంగా చెప్పారని తెలిపారు.

అవకాశవాదానికి బాబు మారుపేరు: కేటీఆర్
టీడీపీ అధినేత అవకాశ వాది అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటని విమర్శించారు. ఆయన కోసం ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడని, ఇవాళ ఆయన కుమారుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడుస్తున్నాడని దుయ్యబట్టారు. కార్యకర్తల పార్టీగా ఉన్న టీడీపీని కాంట్రాక్టర్ల పార్టీగా మార్చాడని అన్నారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించే పరిస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. ఆంధ్రాపార్టీల్లో ఉంటే తెలంగాణ నేతలు ఓడిపోతారని, అందుకే ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ కోసం పోరాడేందుకు రావాలని అన్నారు. ఇప్పటికైనా పార్టీని వీడి ప్రజా ఉద్యమంలో కలవాలని తెలంగాణ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.