సోనియాపై కేసు పెట్టండి

 

soniya ఉండవల్లిపైనా నమోదు చేయండి
బీజేపీ నేత పిటిషన్‌పై మల్కాజిగిరి కోర్టు
29 లోపు నివేదిక ఇవ్వాలి .. కుషాయిగూడ పోలీసులకు ఆదేశం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో వేయిమందికిపైగా యువత, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవడానికి కారణమయ్యారన్న ఆరోపణలపై యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై కేసులు నమోదు చేయాలని నేరేడ్‌మెట్‌లోని మల్కాజిగిరి పదవ మెట్రోపాలిటన్ కోర్టు కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పైనా కేసులు పెట్టాలని ఆదేశాలు జారీచేసింది. తెలంగాణలో యువకుల బలిదానాలకు సోనియా, ఆమెకు సహకరించిన ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కారణమని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు సతీష్ అగర్వాల్ జనవరి 29న మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో సోనియా పేరును ఎడ్వీజ్ ఆంటోనియా అల్బీనా మైనో అలియాస్ సోనియా గాంధీ అని పేర్కొన్నారు. పిటిషన్‌ను సోమవారం పరిశీలించిన న్యాయమూర్తి 120బీ, 420, భారతీయ పౌరసత్వ చట్టంలోని సెక్షన్ ఐదు కింద సోనియాపై, ఉండవల్లిపై కేసులు నమోదు చేసి, 29లోపు తమకు నివేదిక అందజేయాలని ఆదేశించారని న్యాయవాది మేకల శ్రీనివాస్ యాదవ్ విలేకరులకు తెలిపారు. తెలంగాణ ప్రజలకు సోనియా హామీ ఇచ్చి, మాట మార్చడం ద్వారా ఇక్కడి ప్రజల మనోభావాలను ఎలా దెబ్బతీశారో వివరించడంతో పాటు.. 2004 కరీంనగర్ ఎన్నికల సభలో సోనియా ప్రసంగాన్ని అనువదించి, తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఉండవల్లి అరుణ్‌కుమార్ పేరును పిటిషన్‌లో పేర్కొన్నారు.

సోనియా ఇటలీ పౌరసత్వాన్ని కలిగివున్నారని, కానీ భారత్‌లోని యూపీ రాష్ట్రం రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో తెలంగాణను ప్రకటిస్తామంటూ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సోనియా మోసపూరిత మాటల వల్లనే తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కోర్టుకు నివేదించారు. రాహుల్‌గాంధీ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇటాలియన్ పౌరసత్వాన్ని కలిగి ఉండడమే కాక ఇటాలియన్ పాసుపోర్టును కూడా రాహుల్ ఉపయోగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. కోర్టు ఆదేశాలపై కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌డ్డిని టీ మీడియా వివరణ కోరగా కోర్టు నుండి తమకు ఎలాంటి అదేశాలు అందలేదని ఆయన చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.