సెల్లోకి సంజయ్

sanjay

-ముంబై బాంబు పేలుళ్ల కేసులో లొంగుబాటు
– కళతప్పిన ముఖంతో అభిమానులకు అభివాదం
– జైలుకు తరలించేవరకు చెయ్యి వదలని
భార్య మాన్యత
– ఇరువురి భావోద్వేగం.. కంటతడి
– నెలరోజులపాటు ఇంటి భోజనానికి కోర్టు అనుమతి
– ఎలక్ట్రానిక్ సిగట్‌కు నిరాకరణ
– ఎరవాడకు తరలించే అవకాశం
– ఇదే కేసులో లొంగిపోయిన మరో నలుగురు
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జైలు గూటికి చేరారు. గురువారం ఆయన ముంబైలోని టాడా ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు న్యాయస్థానం 1993నాటి ముంబై పేలుళ్ల కేసులో సంజయ్‌దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన ఇప్పటికే ఏడాదిన్నర శిక్షను అనుభవించగా మరో మూడున్నరేళ్లు పూర్తిచేయాల్సి ఉంది.

మిగిలి ఉన్న సినిమా షూటింగ్‌లు పూర్తిచేసిన తర్వాత లొంగిపోయేందుకు తనకు కొంత సమయమివ్వాలని సంజయ్ కోర్టును కోరడంతో నాలుగువారాలకు అనుమతిచ్చింది. ఈ గడువు బుధవారంతో ముగిసింది. ఈ గడువు ముగియడానికి ముందుకూడా మరింత సమయం పొడిగించాలని కోర్టును కోరినా అందుకు న్యాయస్థానం అనుమతించలేదు. దీంతో ఆయన గురువారం కోర్టు ముందు లొంగిపోవాల్సిన తప్పనిసరిపరిస్థితి ఏర్పడింది. నుదుట ఎర్రటి తిలకాన్ని దిద్దుకుని, తెల్లటి పైజామా, బ్లూజీన్స్ ధరించి ఆయన తన భార్య మాన్యత, చిత్ర నిర్మాత, దత్ మిత్రుడు మహేష్‌భట్, సోదరి ఎంపీ ప్రియదత్, బావ ఓవెన్ రాంకన్‌తో కలిసి ఆయన మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో బాంద్రాలోని తన ఇంటి నుంచి కోర్టుకు బయలుదేరారు.

ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ సంఖ్యలో సంజయ్ ఇంటి ముందుకు చేరారు. భార్య మాన్యతతో కలిసి గేటుముందుకు వచ్చిన సంజయ్ కళతప్పిన ముఖంతో అభిమానులకు అభివాదం చేశారు. గాంభీర్యాన్ని కోల్పోయారు. కంటతడి కూడా పెట్టారు. కోర్టులో లొంగిపోతుండటంతో బుధవారం రాత్రి ప్రముఖ బాలీవుడ్ నటులు సల్మాన్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, అజయ్‌దేవ్‌గణ్, దర్శకులు డేవిడ్ ధావన్, సంజయ్‌గుప్తా, అపూర్వా లఖియా, రాజ్‌కుమార్ హిరానీ, వ్యాపారవేత్తలు శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా తదితరులు సంజయ్‌ను పరామర్శించి వెళ్లారు. బుధవారం రాత్రి నుంచే సంజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు అటుపక్కగా ఎవరిని రానివ్వనప్పటికీ గురువారం ఉదయం భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. వారికి ఆయన అభివాదం చేస్తూ విషణ్ణవదనంతో 15 కార్లు వెనుక వస్తుండగా టాడా కోర్టు ప్రాంగాణానికి చేరుకున్నారు.

అప్పటికే అక్కడ మీడియా ప్రతినిధులు, అభిమానులతో కోర్టు ప్రాంగణం కిక్కిరిసింది. దీంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులకు, అభిమానులకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి కారుదిగి మధ్యాహ్నం 3.12గంటల ప్రాంతంలో కోర్టులో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయనను టాడా కోర్టు ప్రత్యేక జడ్డి జీఏ సనాప్ కొన్ని ప్రశ్నలు అడిగారు. పేరేమిటి? అని ప్రశ్నించగా సంజయ్ సునిల్ దత్ సార్ అని ఆయన సమాధానం ఇచ్చారు. ఎన్ని రోజుల శిక్షకాలం పూర్తి చేశావని మరోసారి ప్రశ్నించగా 551 రోజులు సార్ అని బదులిచ్చారు.

నువ్విక వెళ్లి వెనుక రూములోని బెంచ్‌పై కూర్చోవచ్చు అని జడ్జి చెప్పారు. దీంతో సంజయ్‌దత్ చేతిని ఆయన భార్య బిగుతుగా పట్టుకోగా ఇద్దరు భావోద్వేగానికి లోనవుతూ బెంచ్‌పై కూర్చున్నారు. ఆ సమయంలో వారితో సోదరి ప్రియాదత్, ఓవెన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌దత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ తన క్లైంట్ సంజయ్‌కు ఫ్యాన్, మెడిసిన్, మెత్తటిపరుపు, దిండు, ఇంటి భోజనం, చైన్‌స్మోకర్ అయినందున ఎలక్ట్రానిక్ సిగరేట్‌కు అనుమతించాలని కోర్టును అభ్యర్థించారు. విధిగా ఆయనను చూసేందుకు కుటుంబసభ్యులను అనుమతించాలని కోరారు. అయితే నిందితులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ వాదనలు విన్న న్యాయస్థానం వీటన్నింటికి ఒక నెలరోజులు మాత్రమే అనుమతిస్తూ ఎలక్ట్రానిక్ సిగట్‌కు మాత్రం నిరాకరించింది. జైళ్లో ఎలక్ట్రానిక్ సిగట్‌ను అనుమతించబోమని, నెల రోజుల తర్వాత ఆయన జైలు ఆహారం తినాల్సి ఉంటుందని, మందులు కూడా జైలు అందిస్తుందని జడ్జి స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. జైలు నుంచి బయటకు వచ్చేసమయంలో మీరు మరో సంజయ్‌ను చూస్తారని ఆయన మిత్రుడు మహేష్ భట్ విలేకరులతో అన్నారు. ప్రస్తుతం సంజయ్‌ను ఆర్థర్ జైలుకు తరలిస్తున్నందున అక్కడ భద్రతను పెంచారు. అయితే తాను పుణెలోని ఎరవాడ జైలులో లొంగిపోతానని సంజయ్‌దత్ కోరడం, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఇటీవల ఆగంతుకుని నుంచి ఆర్థర్ జైలుకు లేఖరావడం వంటి పరిణామాల నేపథ్యంలో సంజయ్‌దత్‌ను త్వరలోనే ఎరవాడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం.

సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్!
గురువారం టాడా కోర్టులో లొంగిపోయిన సంజయ్‌దత్ త్వరలోనే సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేయనున్నట్లు ఆయన తరపు న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ తెలిపారు. రివ్యూ పిటిషన్ కోర్టు తిరస్కరించిన తర్వాత ఈ పిటిషన్‌ను నిందితుడు దాఖలు చేసుకోవచ్చు. తీర్పును పునఃపరిశీలించాలని ఇటీవల సంజయ్ సుప్రీంకోర్టును కోరినా అందుకు అనుమతించని విషయం తెలిసిందే. దీంతో కోర్టులో లొంగిపోయిన ఆయన క్యురేటివ్ పిటిషన్ వేయనున్నారు. దీని ప్రకారం కోర్టు ఇచ్చిన తుదితీర్పులో న్యాయలోపాలు ఏవైనా జరిగి ఉంటే మరోసారి పరిశీలిస్తారు. ఈ విధానాన్ని సుప్రీంకోర్టు 2002లో ప్రవేశ పెట్టింది.

లొంగిపోయిన మరో నలుగురు
1993నాటి ముంబై పేలుళ్ల కేసులో మిగిలిన శిక్ష కాలాన్ని పూర్తిచేసేందుకు సంజయ్‌దత్‌తోపాటు మరో నలుగురు నిందితులు కూడా గురువారం టాడా కోర్టులో లొంగిపోయారు. తీర్పును మరోసారి పరిశీలన చేయాలని ఎస్సా మెమాన్, కేర్సి అడ్జానియా, నుల్వాలా, అల్తాఫ్ సయ్యద్ షేక్ అనే వ్యక్తులు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో వారు కోర్టులో లొంగిపోయారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.