సుష్మాను అనుమానిస్తే.. తెలంగాణ అమరుల అమరత్వాన్ని అవమానించినట్టే: కిషన్‌రెడ్డి

తెలంగాణపై బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంతోపాటు, ఆ తరువాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ మోసాల వల్లే తెలంగాణలో 1100 మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును పెట్టకుండా కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణపై బీజేపీ చిత్తశుద్ధితో ఉందని, సీమాంధ్రుల సమస్యల పరిష్కరించాలన్న డిమాండ్‌కీ తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. సీమాంధ్రుల అనుమానాలను నివత్తి చేసేందుకు ముసాయిదా బిల్లులో కొన్ని సవరణలను ప్రతిపాదిస్తామన్నారు. ఒకవేళ ఆ ప్రతిపాదనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోయినా, తాము తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశానంతరం బీజేపీ పార్లమెంటరీ నాయకురాలు సుష్మా స్వరాజ్ మాట్లాడిన అంశాలను మీడియా వక్రీకరించిందని ఆయన మండిపడ్డారు.

సుష్మాస్వరాజ్ తెలంగాణ ఆడపడుచు అని, తెలంగాణపై ఆమెచిత్తశద్ధిని అనుమానిస్తే.. తెలంగాణ అమరుల అమరత్వాన్ని అవమానించినట్లేనని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణబిల్లును మొదటి ప్రాధాన్యతాంశంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా, తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతునిస్తుందని, కానీ కాంగ్రెస్ రాష్ర్టానికి చెందిన తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలను కట్టడి చేసి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని సుష్మా సూచించారని కిషన్‌రెడ్డి వివరించారు. కానీ ఈ విషయాన్ని మీడియా వక్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగర్‌రావు, మురళీధర్‌రావు, డాక్టర్ కే లక్ష్మణ్, వీ రామారావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, చందుపట్ల జంగారెడ్డి, రామచందర్‌రావు, ఎస్ కుమార్, ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

సీమాంధ్ర చానల్స్ దుష్ప్రచారం: ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి
బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలంగాణకు కట్టుబడి ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుష్మాస్వరాజ్ మాటలకు సీమాంధ్ర చానళ్లు వక్రభాష్యం చెబుతూ, దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర చానళ్ళకు ఇదే నా హెచ్చరిక. ఖబర్దార్ బీజేపీపై బురద చల్లకండి అని మండిపడ్డారు. సుష్మా మాటలను వక్రీకరించడం ద్వారా సీమాంధ్ర మీడియా పార్టీపై విషప్రచారాన్ని చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణపై బీజేపీ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పిన ఆయన సుష్మా స్వరాజ్ అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు.

కాంగ్రెస్ తీరు.. ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టుంది:
ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణపై బీజేపీ కట్టుబడి ఉందని, కానీ కాంగ్రెస్ పార్టీ కుప్పిగంతులు వేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే ఉల్టా చోర్ కోత్వాల్‌కో డాంటే అన్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ విషయంలో దోషిగా నిలువాల్సి వస్తుందని భయపడి కాంగ్రెస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణపై సుష్మా స్వరాజ్, బీజేపీ చిత్తశుద్ధిని శంకించినవారు చరిత్రహీనులుగా మిగులుతారని యెన్నం అన్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.