తెలంగాణపై రాయలసీమ ఆధిపత్యాన్ని రుద్దితే మరోసారి సకలజనుల సమ్మెకు సిద్ధమవుతామని టీ జేఏసీ హెచ్చరించింది. రాయలతెలంగాణ పేరుతో తెలంగాణపై మరోసారి రాయలసీమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, ఈ కుట్రలను ఛేదించేందుకు తెలంగాణ సర్వసన్నద్ధంగా ఉన్నదని హెచ్చరించింది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ తప్ప మరే ఇతర ప్రతిపాదనలను తెలంగాణ ప్రజలు అంగీకరించే ప్రసక్తి లేదని టీ జేఏసీ స్పష్టం చేసింది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయలేనిపక్షంలో యూపీఏ ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని, ఉద్యమాలతోనే తెలంగాణ సాధించుకునే చేవ, చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉన్నదని పేర్కొంది.
శనివారం టీ జేఏసీ స్టీరింగ్ కమిటీ అత్యవసర సమావేశం టీ జేఏసీ కార్యాలయంలో జరిగింది. సమావేశం అనంతరం టీ జేఏసీ కో చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్, అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఎంపీజే చైర్మన్ హమీద్ మహ్మద్‌ఖాన్, రసమయి బాలకిషన్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ టీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ సత్యం గౌడ్ ఈ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఒకవైపున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవోఎం కసరత్తు చేస్తున్నదని ప్రకటిస్తునే మరోవైపున రాయలతెలంగాణ ఏర్పాటు జరుగుతున్నదని, హైదరాబాద్‌ను యూటీ చేస్తున్నారంటూ ఢిల్లీ నుంచి రోజుకోరకమైన లీకులు ఎందుకు ఇస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు ఉద్యమాలకు సర్వసన్నద్ధంగా ఉన్నారని, జూలై 30న సీడబ్ల్యూసీ తీర్మానానికి భిన్నంగా ఏ నిర్ణయం జరిగినా సహించే ప్రసక్తి లేదని.. మరోసారి సకలజనుల సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులందరం ఢిల్లీకి వెళ్తున్నామని, 32 జాతీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. రాయల తెలంగాణ పేరుతో ప్రజలను గందరగోళపరుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తెలంగాణ భగ్గుమంటుందని హెచ్చరించారు. శ్రీశైలం ఎడమకాలువ, నాగార్జునసాగర్ ఎడమకాలువ, భద్రాచలం, మునగాల తెలంగాణవి కావంటూ విషపూరిత ప్రచారాలను చేస్తున్నారని, వీటిని తిప్పికొడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
పాలమూరును వలసల జిల్లాగా మార్చిన నాయకులే రాయల తెలంగాణ ప్రతిపాదనలు తెస్తున్నారని విమర్శించారు. అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విభజన విషయంలో కేంద్రం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించి, శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అనవసర వాగ్వాదాలకు, గందరగోళాలకు అవకాశం కల్పించకుండా, సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారం హూందాగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కిరికిరిలతో తెలంగాణ ఇస్తే అసలు తెలంగాణ రాష్ట్రం రాలేదని ప్రజలకు తెలియచెప్పి మళ్లీ ఉద్యమబాట పడుతామని హెచ్చరించారు. సత్యంగౌడ్ మాట్లాడుతూ వారం రోజుల పాటు టీ జేఏసీ జరిపే ఢిల్లీ యాత్ర తెలంగాణ సాధనలో కీలకమైన ఘట్టమన్నారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణను సమర్థిస్తున్న జాతీయ రాజకీయ పార్టీల నాయకులందరితో సమావేశమవుతామని, తెలంగాణ బిల్లుకు మద్దతు కోరుతామని చెప్పారు.