సీమాంధ్ర సీఎంకు టీ మంత్రుల గులాంగిరి

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్న తెలంగాణ మంత్రులపై మండిపడుతున్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న కేసీఆర్‌పై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోసం ఎంపీలు పార్టీని సైతం వదులుకోవడానికి సిద్ధపడితే మంత్రులకు ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి టీ మంత్రులు గులాంగిరి చేస్తున్నారని కోపోద్రిక్తులవుతున్నారు. సీమాంధ్ర నేతలు ఏం మాట్లాడిన పట్టించుకోని సర్కార్ కేసీఆర్‌పై కేసులు నమోదు చేయడమంటే తెలంగాణను అడ్డుకోవడమేనని ధ్వజమెత్తుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి తెలంగాణపై మాట తప్పిన అధిష్టానానికి టీ మంత్రులు వత్తాసు పలకడం సబబుగా లేదంటున్నారు. టీ మంత్రులు సీఎం తొత్తులని నిరూపించుకున్నారని అభివర్ణిస్తున్నారు.

సీఎంతో కలిసి సుదీర్ఘంగా నాలుగు గంటలు చర్చించిన టీ మంత్రులే కేసీఆర్‌పై కేసులు పెట్టాలని నిర్ణయించారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. మాతృభూమికి నమ్మక ద్రోహం చేసిన మంత్రులు తక్షణమే పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర సీఎం చేతిలో కీలుబొమ్మగా మారి టీ మంత్రులు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవబాంబులుగా మారుతామని హెచ్చరించిన పయ్యావుల కేశవ్‌పై కేసులు ఎందుకు నమోదు చేయరని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణవారికో న్యాయం.. సీమాంధ్రవారికో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌పై కేసులు నమోదు చేస్తే జరగబోయే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.