జగన్, బాబు నాటకాల్లో సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలు పావులు కావొద్దని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు హితవు పలికిన్రు. సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగులో ఆధిపత్య పోరు, ముఠా తగాదాలు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నయి. జగన్ అవినీతి, కుంభకోణం గురించి మాట్లాడాలి. జగన్ తన దీక్ష కోసం జూనియర్ ఆర్టిస్టులను మాట్లాడుకున్నట్లు సమాచారం ఉంది. తెలంగాణ ఓట్ల కోసం నాడు కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్న జగన్…. ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకున్నంక సీమాంధ్ర ఓట్ల కోసం సమైక్యం అంటున్నారు. నిజాయితీ అనే పదాన్ని జగన్ తన డిక్షనరీ నుంచి తొలగించాలి. శాఖాహారం గురించి పులి మాట్లాడినట్లుగా జగన్ మాటలున్నాయి.’
రాత్రికి రాత్రి విభజన జరగలేదు
‘తెలంగాణ నిర్ణయం రాత్రికిరాత్రి వచ్చిందని చంద్రబాబు విషం కక్కుతున్నడు. అందరినీ సంప్రదించాకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నరు.రాష్ట్ర విభజన ఆగే పరిస్థితి లేదు. రాత్రికి రాత్రే విభజన జరగలేదు. సీమాంధ్రులు తమ సమస్యలపై మాట్లాడాలి. సమస్యలను పరిష్కరించి ఏర్పాటు చేసినా రాష్ట్రం ఏదైనా ఉందా?. విభజన సందర్భంగా తలెత్తే సమస్యలను పరిష్కరిస్తరు. తెలంగాణను అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు చేసిన్రు. విభజన తర్వాత ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడానికి జీఎంవోను ఏర్పాటు చేసిన్రు. తెలంగాణ సమస్యలపై కూడా జీఎంవోను సంప్రదిస్తం. సీమాంధ్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి.’
సీఎం కిరణ్ ఫ్యాక్షనిస్ట్
‘విభజనకు సహకరించాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ రక్షించాల్సిన సీఎం ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నరు. సమైక్యాంధ్ర ముసుగు వేసుకుని ఫ్యాక్షనిస్టులు రెచ్చిపోతున్నారు. కిరణ్ చేతిలో లా అండ్ ఆర్డర్‌ను ఉంచడం తోడేళ్లకు గొర్రెల మందను కాపాడే బాధ్యతను ఇచ్చినట్లుంది. విజయనగరం ఘటనల వెనుక సీఎం హస్తమున్నట్లు వార్తలు వస్తున్నాయి’.
దీక్ష చేస్తనన్న కేసీఆర్‌ను జైల్లో పెట్టిన్రు
‘తెలంగాణ కోసం దీక్ష చేస్తనన్న కేసీఆర్‌ను జైల్లో పెట్టిన్రు. ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా దీక్ష చేస్తున్న జగన్‌కు రాచమర్యాదలు చేస్తున్నరు. పిచ్చి పిచ్చి డ్రామాలు చేసి హైదరాబాద్‌లో అల్లర్లు రేపాలని చూస్తే ఎట్ల సమాధానం చెప్పాలో తమకు తెలుసు. తుపాకి గుండ్లకు ఎదురొడ్డి మానుకోటలో నిన్ను తరిమికొట్టింది మరిచిపోయినవా? జులై 9, 2009లో తెలంగాణ న్యాయమైన పోరాటం అని జగన్ చెప్పిండు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని జగన్ కోరిండు. తెలంగాణకు వ్యతిరేకం కాదని విజయలక్ష్మి, షర్మిల పరకాలలో చెప్పిన్రు. కానీ హింసను ప్రోత్సహించే విధంగా హైదరాబాద్‌లో దీక్ష చేయడమేంటి? సీఎంలను దించడానికి వైఎస్ చేసిన కుట్రలు ప్రజలు మరవలేదు. సీమాంధ్ర పార్టీలు తెలంగాణను అడ్డుకోవడానికి ఇప్పటివరకు చేసిన కుట్రలు చాలని చెబుతూ’ మీడియా సమావేశాన్ని ముగించారు.