సీమాంధ్ర నేతలది అనవసర రాద్ధాంతం: జైపాల్‌రెడ్డి

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతలు చేస్తోన్న లాబీయింగ్‌పై కేంద్రమంత్రి, తెలంగాణ నేత జైపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలతో సమావేశమై రేపు కేంద్ర మంత్రుల బృందానికి ఇవ్వబోయే నివేదికను తయారు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు జీవోఎంకు ఇచ్చే నివేదికపై తెలంగాణ నేతలం చర్చించామని, అయితే రేపు కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నందును ఇపుడే వివరాలు చెప్పలేమని తెలిపారు. రేపు జీవోఎం ముందు తెలంగాణ ప్రజల తరపున ముగ్గురు తెలంగాణ ప్రాంత మంత్రులు అభిప్రాయం చెబుతారని అన్నారు. 11 ప్రశ్నలపై ఇప్పటికే నివేదిక ఇచ్చామని స్పష్టం చేశారు. విభజనపై నేతల అసలు రూపం ప్రజలకు తెలుసన్నారు. సీమాంధ్ర నేతలు చేస్తున్న రాజకీయాలు అధిష్ఠానం గమనిస్తుందని తెలిపారు.

అన్ని పార్టీలతో చర్చించాకే విభజన నిర్ణయం: జైపాల్
రాష్ట్రంలోని అన్ని పార్టీలతో చర్చించాకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. ఇపుడు సీమాంధ్ర నేతలు రాద్దాంతం చేయడం అనవసరమని అన్నారు. న్యాయాన్యాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలించాకే నోట్ తయారు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలం జీవోఎంకు నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘మేమందరం సూచనలు మాత్రమే చేశాం. తుది నిర్ణయం పార్లమెంట్‌దే’ అని స్పష్టం చేశారు. ‘మేం తెలంగాణ ప్రాంతం గురించే ప్రస్తుత నివేదికలో ప్రస్తావించామని పేర్కొన్నారు.

సీమాంధ్రులకు అన్యాయం చేయం: జైపాల్‌రెడ్డి
రాష్ట్ర విభజన జరిగినా సీమాంధ్రులకు అన్యాయం జరగకూడదనే తాము కోరుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేతలు విజ్ఞులని, వాళ్లు అర్థం చేసుకుని అందరికి న్యాయం చేస్తారని వ్యాఖ్యానించారు. అందరి అభిప్రాయాలు తీసుకునే వాళ్లు విభజనపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ‘ఇప్పుడు మేం ఎవరిని నిందించం, ఎవరిపైనా కాంమెంట్లు చేయం. మాకు జాతీయ పార్టీల మద్దతు కావాలి. కాబట్టి ఆపార్టీలపై వ్యాఖ్యలు చేయను. ఇంత దూరం విభజన వ్యవహారం వచ్చాక మౌళిక ప్రశ్నలపై స్పందించనని తెలిపారు. విభజనపై నేతల అసలు రూపం ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ ఆఖరి క్షణంలో అందరూ సహకరించాలి.

చంద్రబాబుకు జ్ఞానంలేదు: జైపాల్‌రెడ్డి
రాష్ట్ర విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరుపై జైపాల్‌రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, పదేళ్ల నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న వ్యక్తి రాష్ట్ర విభజనపై స్పందించక పోవడం సరికాదన్నారు. అసలు చంద్రబాబుకు జ్ఞానం ఉందా? అని నిలదీశారు. విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి లేఖ ఇవ్వకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇదేనా ఒక నేత వ్యవహరించాల్సిన తీరు అని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.