సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు జ్ఞానోదయం!

 సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నేలకు దిగుతున్నారు. ఖడ్గచాలనం కన్నా కరచాలనమే మేలని భావిస్తున్నారు. విభజన ఆపలేనంతగా ముందుకు వెళ్లినందున ఇక లాభం లేదని, సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణపైకి దృష్టి మరల్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామాలు చేసిన నేతలు ఒక్కొక్కరు వెనకడుగు వేస్తున్నారు. రాజీనామాలవల్ల లాభంలేదని కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి , కిల్లి కృపారాణి చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాన్నే సూచిస్తున్నాయి. విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందాన్ని కేంద్ర మంత్రులందరం కలుస్తామన్న పనబాక లక్ష్మి సాగునీరు, విద్యుత్, విద్య, ఉపాధి సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. విభజన అనివార్యమని, సమస్యలను కేంద్రానికి చెప్పుకోవడమే మంచిదనే అభిప్రాయాన్ని పురందేశ్వరి కూడా వ్యక్తం చేశారు.
సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు కూడా రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతల అభిప్రాయాలను హై కమాండ్ పెద్దలు తీసుకున్నారు. అప్పుడు అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పిన వారు తీరా సీడబ్ల్యూసీలో నిర్ణయం తర్వాత రాజీనామా డ్రామాలకు తెరలేపారు. ముఖ్యమంత్రి కూడా హై కమాండ్ నిర్ణయాన్ని ధిక్కరించేలా సమైక్య గళాన్ని వినిపించారు. కొందరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు మాత్రం పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని భావించారు.

కేంద్ర మంత్రుల్లో పనబాక లక్ష్మి, జేడీ శీలం రాజీనామాలకు ససేమిరా అన్నారు. కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి కూడా అధిష్ఠానానికి విధేయులుగానే ఉన్నారు. స్థానిక నేతల ఒత్తిడి మేరకు పదవులకు రాజీనామాలు ప్రకటించినా మారిన పరిస్థితుల నేపథ్యంలోవెనక్కి తగ్గారు. నలుగురైదుగురు ఎంపీలు రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. అనంతపురం, నంద్యాల ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, ఎస్పీవై రెడ్డిలు పార్టీ, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారు జగన్ పార్టీలో చేరుతున్నారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి ఆరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్ ఎంపీ పదవికి రాజీనామాలు చేశారు. ఉండవల్లి రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లగడపాటి నిర్ణయం తెలియదు. మరోవైపు సీమాంధ్ర రాష్ట్ర మంత్రుల్లో పలువురు అధిష్ఠానం నీడనే పయనించాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స, ఆర్థిక మంత్రి ఆనం నేతృత్వంలో జరిగిన మంత్రుల సమావేశం అధిష్ఠానం విధేయులదేనని అంటున్నారు. సీనియర్ మంత్రులందరూ ఆ సమావేశానికి వచ్చారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికంటూ ఈనెల 17న జరపనున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ సమావేశానికి ఎంత మంది నేతలు హాజరవుతారనేది అనుమానంగానే ఉంది.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.