సీమాంధ్రలో ఛాంపియన్ ట్రోఫీ పోటీ నడుస్తుంది: కేటీఆర్

సీమాంధ్రలో ఛాంపియన్ ట్రోఫీ నడుస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ఈ ఛాంపియన్‌షిప్ కోసం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, వైఎస్ జగన్, చంద్రబాబునాయుడు పోటీ పడుతున్నారని అన్నారు. ఆనాడు కేసీఆర్ విసిరిన సవాలుకు సీఎం కిరణ్ భయపడి పారిపోయాడని ఎద్దేవా చేశారు. సీఎం కిరణ్ ఉద్దేశ్యం సీమాంధ్ర పండాలి, తెలంగాణ ఎండాలి అనేలా ఉందని అన్నారు. ఎవరేమైనా ఫర్వాలేదు తన పదవీ మాత్రం అట్లనే ఉండాలని సీఎం కోరుకుంటున్నారని తెలిపారు.
‘1955లోనే నాగార్జునసాగర్ శంకుస్థాపన జరిగింది’
రెండు ప్రాంతాలు కలిసి రాష్ట్రం ఒకటి కావడం వల్లే రాష్ట్రానికి జలవనరుల సమస్యలేదని, వేరువేరుగా ఉంటే నీటి సమస్య ఉండేదని నిన్నటి ప్రెస్‌మీట్‌లో సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సాగర్ నిర్మాణం 1955 డిసెంబర్ 10న హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర ప్రాంతంతో విలీనం కాకముందే జరిగిందని వివరణ ఇచ్చారు. అంతకు ముందే 1903లోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం సర్వే జరిగిందని వివరించారు. సాగర్ ప్రాజెక్టు పాత డిజైన్‌ను మార్చి సీమాంధ్ర ఇంజినీర్లు ఆంధ్రాప్రాంతానికి నీటిని తరలించుకుపోయారని ఆరోపించారు. దీంతో తెలంగాణలో మూడు లక్షల ఎకరాల ఆయకట్టును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నందికొండ వద్ద ప్రాజెక్టును కట్టిఉంటే నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యే ఉండేదే కాదని అన్నారు.

జలయజ్ఞంకాదు, జలగల యజ్ఞం: కేటీఆర్
జలయజ్ఞం పథకంలో తెలంగాణకు ఎన్నో నిధులు మంజూరు చేశామని సీఎం కిరణ్ అనడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ పథకంలో తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చారో, ఎన్ని ఎకరాలకు సాగునీటిని అందించారో సీఎం కిరణ్ బహిరంగంగా ప్రకటించాలని సవాలు విసిరారు. జలయజ్ఞంలో నిధులన్నీ బొక్కారని ఆరోపించారు. ఇది జలయజ్ఞంకాదు జలగల యజ్ఞం అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించినా అది సీమాంధ్రకే లాభమని, తెలంగాణకు ఎంతో నష్టమని వివరించారు. శ్రీరాంసాగర్ రెండో దశ పనులు గత నలబై ఏళ్లుగా కొనసాగుతున్నాయి. జలయజ్ఞంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతులు, నీటి కేటాయింపులు లేవని తెలిపారు. జల దోపిడి జరిగిందని సీఎం స్వయంగా ఒప్పుకున్నాడని అన్నారు. తెలంగాణ నీటిని దోచుకుని సర్దుబాటు అంటున్నారని దుయ్యబట్టారు. అబద్దాల అంకెలతో సీఎం రంకెలు వేస్తున్నాడని విమర్శించారు.

సీఎం మాటలకు పొంతనలేదు: కేటీఆర్
తెలంగాణపై మాట్లాడే ప్రతిసారి సీఎం కిరణ్ పొంతనలేకుండా మాట్లాడాతాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయన చెప్పే ప్రతీమాట తెలంగాణకు వ్యతిరేకంగా, అన్యాయం చేసేలా ఉంటుందని ఆరోపించారు. తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్‌కు చాలా విద్యుత్ అవసరమని అంటున్నాడని, కానీ తెలంగాణలో ఇప్పటి వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే లేవని అన్నారు. అయితే లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ గత నలబై ఏళ్లుగా ఉందని వివరించారు. విద్యుదుత్పత్తి కోసం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా నలబై లక్షల ఎకరాలకు నీటిని అందిస్తున్నామని సీఎం అన్నారు. మరి ఏ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని మళ్లిస్తున్నారో సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 26 లక్షల ఎకరాలు రాయలసీమలోనే సాగు అవుతున్నాయని తెలిపారు. నీటి వనరుల లూటీని శాశ్వతం చేయడానికే సమైక్యం అంటున్నారని విమర్శించారు. 3వేల టీఎంసీల నీళ్లు కృష్ణానది నుంచి సముద్రంపాలు కావడానికి మీ అసమర్థత కారణం కాదా? అని నిలదీశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.