సీమాంధ్రకు బలగాలు

సీమాంధ్రలోని పలు ముఖ్య నగరాలు, పట్టణాలకు భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు చేరుకోనున్నాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తుది అంకానికి చేరుకుని డిసెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందని స్పష్టమైన నేపథ్యంలో సీమాంధ్రలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు యత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రం లో శాంతి భద్రతల పరిస్థితికి ఎలాంటి విఘాతం కలుగకుండా చూసేందుకు ఉన్నతాధికారులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. గతంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విధుల్లో ఉండి.. ఇక్కడి నుంచి ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు వెళ్లిన దాదాపు 50 కంపెనీల పారా మిలిటరీ బలగాలను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్నట్లు తెలియవచ్చింది.

armypolis వచ్చేవారంలో దశలవారీగా ఈ బలగాలు రాష్ట్రానికి చేరుకుంటాయని సమాచారం. వీటిల్లో అధికశాతం బలగాలను విజయనగరం, కర్నూలు, అనంతపురం, కడప, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో మోహరించనున్నట్టు తెలిసింది. విభజన ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో వివిధ వ్యక్తులు, సంస్థలు చేస్తున్న ప్రకటనలతోపాటు నిఘా సమాచారాలను సేకరిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు.. తెలంగాణ బిల్లు వచ్చే సమయం నాటికి సీమాంధ్రలో పెద్దఎత్తున ఆల్లర్లు సృష్టించేందుకు కొన్ని వర్గాలు వ్యూహాలు తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనను అడ్డుకుని తీరుతామని ప్రకటిస్తున్న ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు.. బిల్లు వస్తే ఇక తమది గాంధేయ పోరాటంగా ఉండదని, సివిల్‌వార్ సృష్టిస్తామని హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చే సమయంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండే అవకాశాలు లేకపోలేదని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే అంశంపై

రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది.
వెనక్కి వస్తున్న కేంద్ర బలగాలు…నిఘా వర్గాల సూచనలను స్వీకరించిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు గతంలో ఎన్నికల బందోబస్తు కోసం ఇతర రాష్ట్రాలకు పంపించిన యాభై కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఇటీవల సమైక్యాంధ్ర ఆందోళనలు జరిగినపుడు విజయనగరం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులు చూస్తుండగానే జాతీయ, రాష్ట్ర నాయకుల విగ్రహాలను పగులగొట్టటం, దహనం చేయటంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై విచ్చలవిడిగా దాడులు జరిపారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రధానంగా ఈ నాలుగు జిల్లాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిని సారించారని తెలుస్తున్నది. వచ్చే యాభై కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాల్లో సింహభాగం బలగాలను ఈ నాలుగు జిల్లాల్లోనే మోహరించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

దాంతోపాటు విశాఖపట్టణం, విజయవాడపై కూడా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం. సీమాంధ్రలోని మిగితా అన్ని జిల్లాల హెడ్‌క్వార్టర్లకు రెండు, మూడు కంపెనీల చొప్పున బలగాలను పంపించాలని నిశ్చయించినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. నిఘా విభాగానికి చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారితో మాట్లాడితే శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవలి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ శాతం కేంద్ర పారా మిలిటరీ బలగాలను సీమాంధ్ర జిల్లాలకు తరలించనున్నట్లు వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.