సీమాంధ్రకు ప్రోత్సాహకాలు : జైరాం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణను విడదీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సీమాంధ్రకు భారీగానే వరాల వర్షాన్ని కేంద్ర కేబినెట్ కురిపించింది. సీమాంధ్రలో మూడు కేంద్రీయ విద్యాలయాలతోపాటు ప్రఖ్యాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)ను సీమాంధ్రకే కేటాయిస్తూ కేం ద్రం నిర్ణయం తీసుకున్నది. సీమాంధ్రలో మూడు కేంద్రీయ విద్యాలయాలను కడప, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. ఇందుకు ఒకొక్కదానికి 15 కోట్ల రూపాయల చొప్పున ఖర్చవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేశ్ చెప్పారు.

మరో ఏడు కేంద్రీయ విద్యాలయాలను తెలంగాణలోని వరంగల్, సికింద్రాబాద్, మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాస్తవానికి ఎన్‌ఐడీని తొలుత తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే.. కేంద్ర కేబినెట్ సమావేశం సందర్భంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు దీనిని సీమాంధ్రలోని తగిన స్థలంలో ఏర్పాటు చేయాలని పట్టుపట్టడంతో విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ అంగీకరించింది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని అంశంపైనా చర్చలు జరుగుతున్నాయని జైరాం చెప్పారు. ఈ సందర్భంగా కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలపై కేబినెట్‌లో ప్రాథమికంగా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది.

jairam అయితే.. రాష్ట్ర విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి.. అప్పాయింటెడ్ డే ప్రకటించిన తర్వాత కొత్త రాజధాని ఎంపిక ప్రక్రియ ఊపందుకుంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాజధాని నగరం ఎంపిక కోసం నిపుణుల కమిటీని నియమిస్తామని జైరాం తెలిపారు. ప్రతి ప్రాంతం నుంచి తమ వద్దే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్నదని ఆయన చెప్పారు. రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసే నిపుణుల కమిటీ ప్రతిపాదిత నగరాల్లో పర్యటించి, స్థానిక ప్రముఖులు, వివిధ గ్రూపులను కలిసి అభిప్రాయాలు సేకరిస్తుంది. ఈ ప్రక్రియ కొద్దినెలల్లో ముగుస్తుందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ ఆదాయం తెలంగాణ రాష్ర్టానికే చెందనున్న నేపథ్యంలో సీమాంధ్రకు ఐదేళ్లు ప్రత్యేక హోదా, పదేళ్లు పన్ను రాయితీ వంటి ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు వారు చెప్పారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.