సీపీనా.. సీఎమ్మా

 

Tjac-పాలకుపూవరు కిరణ్!?.. మాట విననన్న సీపీపై చర్య తీసుకోవాలి, చాతకాకపోతే తప్పుకోవాలి
– పాలన పోలీసులకు అప్పగించేశారు
– నిర్బంధానికి పాలకులు మూల్యం చెల్లిస్తారు
– ఉదయం 11 గంటలకే ఇందిరాపార్క్ చేరుకోండి
– తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం
హైదరాబాద్, జూన్ 13 (టీ మీడియా): రాష్ట్రాన్ని పోలీసులు పరిపాలిస్తున్నారా?.. లేక ప్రజాస్వామ్య పాలకులు పరిపాలిస్తున్నారా? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తేల్చి చెప్పాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతున్నదన్న నమ్మకం ముఖ్యమంవూతికి ఉన్నట్లయితే, ‘‘ముఖ్యమంత్రి చలో అసెంబ్లీకి అనుమతిని ఇచ్చినా తాను అనుమతిని ఇవ్వనని’’ బాహాటంగా ప్రకటించిన నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మపై చర్యలు తీసుకోవాలని, చేతకాకపోతే పదవికి రాజీనామా చేయాలని సూచించారు. కిరణ్‌కుమార్ పాలనను పూర్తిగా పోలీసుల చేతికి అప్పగించి చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. అసాంఘిక శక్తులు ప్రవేశిస్తాయనే నెపంతో పాలకులే హింసకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఫత్తే మైదాన్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల నిర్బంధాలు, అణచివేతలు బద్దలు కొట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ శుక్రవారం ఉదయం 11 గంటలకల్లా ఇందిరాపార్క్‌కు చేరుకోవాలని కోదండరాం పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య నిరసనలకు కేటాయించిన స్థలం ఇందిరాపార్క్ కాబట్టి అక్కడకు చేరుకోవడం తెలంగాణ ప్రజలందరి హక్కు అని స్పష్టం చేశారు. నిర్బంధాన్ని, అవరోధాలను, అడ్డంకులను, తుత్తునియలు చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్ష చాటాలన్నారు. ఒకవేళ పోలీసుల అక్రమ నిర్బంధకాండవల్ల ఇందిరాపార్క్‌కు చేరుకోలేని పరిస్థితులు ఏర్పడితే, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనోద్యమాలు వెల్లు ఎంపీడీవో, ఎమ్మార్వో, జిల్లాపరిషత్తు, పోలీస్‌స్టేషన్‌లలో ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ చైతన్యాన్ని చాటి చెప్పాలని కోదండరాం శుక్రవారం కోసం కార్యాచరణ ప్రకటించారు. రాస్తారోకో, పికెటింగ్, రోడ్లపై బైఠాయింపు వంటి ప్రజాస్వామ్య నిరసనలతో తెలంగాణ మార్మోగాలని సూచించారు.

వేలసంఖ్యలో బైండోవర్ కేసులు పెట్టారని, ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, విద్యార్థులను, మహిళలను అక్రమంగా అరెస్టు చేశారని, నిబంధనలకు వ్యతిరేకంగా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని, ఈ పాశవిక నిర్బంధకాండకు తెలంగాణ ప్రజావూపతినిధులు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైకాపా శాసనసభ్యులు కిమ్మనకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని వీరందరినీ వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓట్లకోసం వస్తే గ్రామాల నుండి తరిమికొట్టాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ పిలుపు నిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.