సీపీఐతో పోత్తుకు నో

kcr
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరి పోరు.. కేంద్రంలో రాష్ట్రంలో ముందస్తు తథ్యం
ఎన్నికలకు కేడర్ సిద్ధంగా ఉండాలి.. కేంద్రంలో ఎన్డీయేకు అనుకూల వాతావరణం
ఎక్కువ సీట్లు సాధించి.. క్రియాశీలకంగా మారాలి
టీఆర్‌ఎస్ కార్యవర్గం, పొలిట్‌బ్యూరో సమావేశాల్లో కేసీఆర్
రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సీపీఐతో పొత్తు పెట్టుకోవాలని తొలుత భావించామని, కానీ.. ఆ ఆలోచనను విరమించుకున్నామని చెప్పారు. శనివారం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ, పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీమాంధ్రలో టీడీపీతో సీపీఐ జత కడుతున్న నేపథ్యంలో ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నాయకులెవరూ అధైర్యపడవద్దని, అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పారు. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల ఒక టీవీ నిర్వహించిన పోల్‌లో 87% ప్రజలు తమ అభిప్రాయాలను విస్పష్టంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు కేడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటిలేటర్‌పై కొనసాగుతున్నాయని, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ ఏ క్షణంలోనైనా యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

దీంతో కేంద్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి ముందస్తు ఎన్నికలకు వెళ్లక తప్పదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ కూల్చివేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని కేసీఆర్ విశ్లేషించారు. తెలంగాణ పట్ల ఎన్డీయే అనుకూలంగానే ఉన్నందున అది టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశమని చెప్పారు. అయినా రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా నిర్ణయాత్మక శక్తిగా మారాల్సిన అవసరముందని అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో అధిక సీట్లను సాధించడం ద్వారా క్రియాశీల పాత్రను టీఆర్‌ఎస్సే పోషించాలని చెప్పారు. అందుకు తమిళనాడులో పెరియార్ రామస్వామి ఉద్యమ నేపథ్యాన్ని ఉదహరించారు. తమిళనాడులో ఉద్యమాలను నిర్వహించి, ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీల అడ్రస్ లేకుండా చేసిన ఘనత రామస్వామికే దక్కుతుందని చెప్పారు. పెరియార్ రామస్వామిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఉద్యమాలను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంలో జాతీయ పార్టీలకు స్థానం లేకుండా చేయడమే లక్ష్యంగా సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. సంస్థాగతంగా కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో నిర్వహించని నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చకతప్పదని, అటువంటి పరిస్థితులు కల్పించవద్దని అన్నారు.

ఏప్రిల్ 5న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కనకమామిడి స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి, మహమూద్ అలీ ఏప్రిల్ 5న ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం నూతన ఎమ్మెల్సీల చేత ప్రమాణం చేయించనున్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.