సీట్లు లేవు.. నిధులు లేవు!

 

NIZAMABAD-MEDICAL-COLLEGE-నాలుగేళ్లుగా ఇదీ నిజామాబాద్ మెడికల్ కాలేజీ దుస్థితి
-గతేడాది ఉత్తపుణ్యానికే చేజారిన సీట్లు
-వైద్య విద్య శాఖ నిర్లక్ష్యమే కారణం!
-ఎంసీఐ అధికారులను రప్పించడంలో విఫలం
– ఈసారైనా సీట్లు వస్తాయన్న నమ్మకమూ లేదు
– బడ్జెట్ కింద కాలేజీకి పైసా కేటాయించని సర్కారు

నాలుగేళ్ల క్రితం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ పొందిన నిజామాబాద్ మెడికల్ కాలేజీని ఇంకా బాలారిష్టాలు వీడటం లేదు. నాలుగేళ్లక్షికితం నిజామాబాద్‌లో మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెనుక మంత్రి సుదర్శన్‌డ్డి ప్రయత్నాలు పుష్కలంగా ఉన్నా.. ప్రకటించిన తర్వాత అటు ప్రభుత్వంగానీ, ఇటు సీమాంధ్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గానీ దృష్టిపెట్టలేదు. ఈ కాలేజీ కోసం ప్రభుత్వం రూ. 164కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 32కోట్లు పరికరాల కోసం కేటాయించగా, మిగిలినవి భవనాల నిర్మాణాలు, హాస్టల్ భవనా లు, ఆడిటోరియం కోసం కేటాయించారు. 2012-13లో ఈ కాలేజీకి తప్పకుండా సీట్లు వస్తాయని చివరినిమిషం వరకు ఊదరగొట్టిన వైద్యావిద్య శాఖ అధికారులు చివరికి ఎంసీఐకి సాఫ్ట్ కాపీని పంపడంలోనూ విఫలమయ్యారు.

కాలేజీలో ఉన్న సౌకర్యాలు, వసతులకు సంబంధించిన వివరాలు, ఫ్యాకల్టీ వివరాలతో కూడిన ఒక సాఫ్ట్ కాపీని ఎంసీఐకి పంపితే ఎంసీఐ నుంచి ఒక తనిఖీ బృందం వచ్చి పరిశీలిస్తుంది. అయితే గత సంవత్సరం నిజామాబాద్ కాలేజీలో ఫర్నిచర్‌గానీ, పరకారాలు గానీ, బోధనా సిబ్బందిగానీ లేకపోవడంతో ఈ కాలేజీకి సంబంధించిన సాఫ్ట్ కాపీని పంపలేకపోయారు. ఫలితంగా ఎంసీఐ నుంచి తనిఖీలకు ఎవరూ రాకపోవడంతో సీట్లూ రాలేదు. 2009లో కాలేజీ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత ప్రభుత్వం ఏడాదికి నిధులు కేటాయించింది. ఆ నిధులు కేటాయించి మూడేళ్లు అయినా భవనాలు పూర్తిచేయించడంలో, ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి ఫర్నిచర్, ఎక్వీప్‌మెంట్‌ను కొనుగోలు చేయించడంలో డీఎంఈ అధికారులు పూర్తిగా విఫలమైనట్లు విమర్శలు వస్తున్నాయి.

రెగ్యూలర్ బడ్జెట్‌కూ కరువొచ్చింది
కాలేజీ ప్రారంభానికి ముందు అవసరమైన వాటికోసం ప్రభుత్వం రూ. 164కోట్లు కేటాయించింది. అయితే గతేడాదికే నిర్మాణాలు పూర్తిచేసుకున్న నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అదే సంవత్సరం రెగ్యులర్ బడ్జెట్ కింద నిధులు కేటాయించలేదు. దీంతో నాటినుంచి ఈ కాలేజీ అనేక ఇబ్బందు లు పడుతోంది. చివరికి నిజామాబాద్ మెడికల్ కాలేజీలో తెల్లపేపర్లకూ కరువొచ్చింది. ఆస్పత్రి బడ్జెట్‌లో నుంచి తెల్ల కాగితాలు తెప్పించి కాలేజీ పనుల కోసం వినియోగిస్తున్నట్లు సమాచారం. దీనిపై మీడియాలో ప్రముఖంగా వార్తలొచ్చినా ప్రస్తుత డీఎంఈ విష్ణువూపసాద్ నిధులు కేటాయించడంలేదనే విమర్శలున్నాయి. గత సంవత్సరం నుంచి ఎందుకు నిజామాబాద్ మెడికల్ కాలేజీకి నిధులు కేటాయించడంలేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే నాడు బడ్జెట్ అమల్లోకిచ్చిన తర్వాత కాలేజీ అందుబాటులోకి వచ్చిందని, ఏవైనా అత్యవసరాలు ఉంటే డీఎంఈకి ఉండే జనరల్ బడ్జెట్ నుంచి కేటాయించాలని ప్రస్తుత డీఎంఈకి చెప్పినట్లు సమాచారం. అయినా కానీ డీఎంఈ కార్యాలయం మాత్రం నిజామాబాద్ మెడికల్ కాలేజీని జనరల్ బడ్జెట్‌ను కూడా ఇవ్వలేదు.

కనీసం 2013-14బడ్జెట్‌లో కూడా నిజామాబాద్ మెడికల్ కాలేజీకి ఇప్పటికీ డీఎంఈ ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ప్రిన్సిపాల్‌కు ఉండాల్సిన సపోర్టింగ్ స్టాఫ్ 50మందిలో కేవలం 15మందే కాలేజీలో ఉన్నారు. త్వరలో ఎంసీఐ బృందం తనిఖీలకు వస్తున్న తరుణంలో ప్రిన్సిపాల్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండే టైపిస్టులు, స్టెనోక్షిగాఫర్లు కూడా లేకపోవడం విడ్డూరం. కాగా, నిజామాబాద్ మెడికల్ కాలేజీకి జిల్లాలోని జనరల్ ఆస్పవూతిని అటాచ్ చేశారు. దీంతో ఇందులో పనిచేసే సిబ్బంది దాదాపు 300మంది వరకు కాలేజీకి అటాచ్ అయ్యారు. కానీ డీఎంఈ వైపు నుంచి.. నాన్ టీచింగ్, నాన్ క్లినికల్ సైడ్‌లో ఇంతమంది తమకు అవసరం లేదని అంటోంది. దీనిపై ఆస్పత్రి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీచింగ్ వైపు డీఎంఈ నుంచి జరగాల్సిన అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఇంకా భర్తీ చేయనే లేదు. అయితే డీఎంఈలో కొంతకాలం క్రితం చేపట్టిన ప్రమోషన్లలో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

డీఎంఈ కార్యాలయానికి సంబంధం లేని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు మేరకు పోస్టింగుల్లో పాలుపంచుకున్నారు. ముందుగా కావాల్సిన వారికి కావాల్సిన చోట పోస్టింగ్‌లు ఖరారు చేసి, నిజామాబాద్ కాలేజీకి తాము చెప్పినట్లు వినని వారిని బలవంతంగా పంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ భర్తీ కావాల్సిన మూడు క్యాడర్ల ప్రొఫెసర్ల పోస్టుల్లో ఖాళీలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసీఐ తనిఖీలకు వచ్చిన సమయంలో ఈ ఖాళీలు ఇలాగే ఉంటే సీట్లకు తప్పకుండా ఇబ్బంది ఉంటుందని తెలుస్తోంది.

సీమాంవూధపైనే ప్రేమ..
2012 సంవత్సరంలో నెల్లూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఇచ్చిన వెంటనే అక్కడ ఆగమేఘాల మీద సీఎం వెళ్లి శంకుస్థాపనలు చేశారు. వచ్చే ఏడాది నెల్లూరుకు సీట్లు తెచ్చేందుకు డీఎంఈ అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే నిజామాబాద్ కాలేజీకి 2009లో ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఇచ్చినా 2013-14లో కూడా సీట్లు వస్తాయనే అంశంపై ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి! అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు నెల్లూరు మెడికల్ కాలేజీపై చూపిస్తున్న శ్రద్ధ నిజామాబాద్ కాలేజీపై కాస్తా చూపినా ఈ సంవత్సరం సీట్లు వస్తాయని తెలంగాణ అధికారులు అంటున్నారు.

నిజామాబాద్ మెడికల్ కాలేజీ
-నిజామాబాద్ మెడికల్ కాలేజీని 21ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అదీ రెండు వేర్వేరు ప్రదేశాల్లో నిర్మాణాలు సాగుతున్నాయి. హాస్టల్ భవనాలు ఒకచోట, కాలేజీ మరో చోట చేపట్టారు.
-వాస్తవానికి నిజామాబాద్ మెడికల్ కాలేజీకి 25ఎకరాలు నిజామాబాద్ బయట ఇచ్చారు. కానీ ఆ స్థలాన్ని వదిలేసి మార్కెట్‌కు దగ్గరగా ఉన్న గ్రౌండ్‌లో నిర్మాణాలు చేపట్టారు. ఎంసీఐ గైడ్‌లైన్స్ ప్రకారం కాలేజీ, హాస్టల్ భవనాలు, ఆస్పత్రి మొత్తం ఒకే క్యాంపస్‌లో ఉండాలి. కానీ నిజామాబాద్ కాలేజీకి సంబంధించి వేర్వేరు ప్రదేశాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి.
-నిజామాబాద్ మెడికల్ కాలేజీకి 2009లో 100సీట్లకు ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఇస్తే ఇప్పటికీ ఈ కాలేజీలో సమస్యలు తీరలేదు.. సీట్లు రాలేదు.
-నిజామాబాద్ జిల్లా ఆస్పవూతిని 350 బెడ్ల కెపాసిటీ ఉంటే దాన్ని వచ్చే ఐదేళ్లలో 500 బెడ్లకు పెంచేందుకు ప్రతిపాదించారు.
-నిజామాబాద్ మెడికల్ కాలేజీకి 2009లో జీవో ఇస్తే ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు.

నెల్లూరు మెడికల్ కాలేజీ
-గతేడాదే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ పొందిన నెల్లూరు మెడికల్ కాలేజీ 79 ఎకరాల సింగిల్ క్యాంపస్‌లో నిర్మాణాలను పూర్తి చేసుకుంటోంది.
-ప్రభుత్వం ఈ కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది.
-నెల్లూరు జిల్లా ఆస్పవూతిలో ప్రస్తుతం 350 బెడ్లు ఉన్నాయి. వీటిని 750బెడ్లకు పెంచాలని వైద్య విద్యశాఖ అధికారులునిర్ణయించారు. నెల్లూరు మెడికల్ కాలేజీ నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 362కోట్లు మంజూరు చేసింది. ఇందులో సివిల్ వర్క్స్‌కు రూ. 295కోట్లు, ఎక్విప్‌మెంట్‌కు రూ. 15కోట్లు కేటాయించింది.
-టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం కేటాయించింది రూ. 52కోట్లు
(ఇది తిరిగి వచ్చే మొత్తం)
-నెల్లూరు మెడికల్ కాలేజీకి ప్రభుత్వం కేటాయించిన మొత్తం క్యాడర్ 1052 మంది.
-ప్రస్తుతం సీవిల్ వర్క్స్ కొనసాగుతున్నాయి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.