సీఎల్పీ ముందు కానిస్టేబుల్ జైతెలంగాణ నినాదాలు

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ సీమాంధ్ర ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయం ముందు సంజీవులు అనే కానిస్టేబుల్ జైతెలంగాణ అంటూ నినాదాలు చేశాడు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు చేస్తోన్న కుట్రలను ఎండగట్టాలని సంజీవులు నినాదాలు చేశాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉధ్రిక్తత నెలకొంది. సీమాంధ్ర పోలీసులు అక్కడకు చేరుకుని సంజీవులును బయటకు తీసుకెళ్లారు.

పోలీసుల్లో కూడా తిరుగుబాటుతప్పదు: హరీష్
తెలంగాణ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ సంజీవులు ఇవాళ సీఎల్పీ కార్యాలయం ముందు జైతెలంగాణ నినాదాలు చేయడంపై టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు స్పందించారు. ‘ఇది ఆరంభం మాత్రమే, ఉద్యమం ఇంకా తీవ్రంగా ఉంటుంది. పోలీసుల్లో కూడా తిరుగుబాటు తప్పదు. తెలంగాణ పోలీసులు కూడా సీమాంధ్ర సర్కారుపై తిరుగబుటు చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్ సమైక్యాంధ్ర అంటే తప్పులేదుగానీ, సంజీవులు జైతెలంగాణ అంటే తప్పా అని ఆయన ప్రశ్నించారు. కానిస్టేబుల్ సంజీవులును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.