సీఎం నోటీస్‌ను తిరస్కరించండి – స్పీకర్‌కు లేఖ రాసిన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 27 : సీఎం ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని మాజీ స్పీకర్ కే సురేష్‌రెడ్డి శాసనసభాపతి మనోహర్‌కు లేఖ రాశారు. సీఎం నోటీసు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. తిరస్కార నోటీసు విషయంలో రాజ్యాంగ, అసెంబ్లీ నిబంధనలు లోతుగా పరిశీలించి వ్యవహరించాలని సూచించారు. గతంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో తాను వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ఉదహరించారు. రూల్ 81 ప్రకారం సీఎం నోటీస్‌పై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్‌కు ఉందని గుర్తుచేశారు. ఈ ప్రత్యేక సమావేశాల ఏర్పాటు ఉద్దేశమే బిల్లుపై చర్చించి అభిప్రాయాలు చెప్పేందుకని, ఈ మేరకు రాష్ట్రపతి నిర్ణయించారని వివరించారు. ఇప్పటికే బిల్లుకు మద్దతుగా, వ్యతిరేకంగా అనేకమంది సభ్యులు అభిప్రాయాలను సభలో వెల్లడించారని గుర్తుచేశారు. వారు వెలువరించిన విలువైన అభిప్రాయాలు పార్లమెంట్‌కు చేరాల్సిన సమయంలో.. సీఎం ఇచ్చిన నోటీస్ వాటిని అడ్డుకునేలా ఉందని సురేశ్‌రెడ్డి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

exspeakerఅది డ్రాఫ్ట్ కాదు..
ఒరిజినల్ బిల్లు సభకు రానందున, డ్రాఫ్ట్ బిల్లు చెల్లుబాటు కాదనే వాదన సరికాదని పేర్కొన్నారు. రికార్డుల ప్రకారమైతే అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని, ఇది బిల్లుగానే పరిగణించాలని చట్టం తెలుపుతోందన్నారు. దేశ ప్రథమ పౌరుడే ఏపీ రీ ఆర్గనైజేషన్ బిల్ అని స్పష్టంగా పేర్కొని పంపారని వెల్లడించారు. దీనిని సీఎం డ్రాప్ట్‌బిల్లుగా పేర్కొని రాష్ట్రపతిని అవమానిస్తున్నారని అభ్యంతరం తెలిపారు. రాష్ట్రపతి స్వయంగా బిల్లు అని పేర్కొన్న అనంతరం హోంశాఖ కార్యదర్శి డ్రాఫ్ట్ బిల్లు అని లేఖలో చెప్పారనేది అర్థం లేని వాద నన్నారు. విభజన నిర్ణయంపైనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం సరికాదని అని తెలిపారు.

ఇది మీకు క్లిష్ట సమయమే. రాజ్యాంగం ప్రకారం మీరు సభలో ఒక సభ్యుడుకూడా. అదీ ఒక ప్రాంతానికి చెంది ఉన్నారు. ఇది మీకు బాధాకరమే కావచ్చు. ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. అయినా మీరు సభాధిపతి స్థానంలో ఉన్నందున దాని గౌరవాన్ని, సభా మర్యాదను కాపాడాల్సిన గురుతర బాధ్యత మీమీద ఉంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన అత్యున్నత సంప్రదాయం, ఒక స్పూర్తి…దీన్ని కాపాడండి అంటూ సురేష్ రెడ్డి కోరారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.