సీఎం.. డౌన్ డౌన్ – నినదించిన టీ మంత్రులు

హైదరాబాద్ జనవరి 27 :బిల్లుపై చర్చకు సమయం ముగుస్తున్న కొద్దీ అసెంబ్లీ సీను సినిమా ైక్లెమాక్స్‌ను తలపిస్తోంది. టీ బిల్లును తిప్పిపంపాలని సీఎం కిరణ్ 77వ నిబంధన కింద నోటీసు ఇవ్వటానికి నిరసనగా సోమవారం ఏకంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులే కిరణ్‌కు వ్యతిరేకంగా నిలబడి, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కదనరంగంలోకి దూకారు. జై తెలంగాణ నినాదాలతో సభను హోరెత్తించారు. సీఎం వెనక కుర్చీలోనే కూర్చునే చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అందరికంటే ముందే పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ మంత్రులు తమ పౌరుషాన్ని చాటారు. సభ ప్రారంభం నుంచే ఉద్రిక్తత నెలకొంది.

ఒకవైపు జై తెలంగాణ నినాదాలు హోరెత్తగా, మరోవైపు సీఎం డౌన్‌డౌన్ అని ఆయన కేబినెట్‌లోని మంత్రులే పెద్దపెట్టున నినదించారు. సీఎం వైఖరిని ఖండిస్తూ టీ మంత్రులు అసాధారణంగా పోడియంను చుట్టుముట్టారు. అదే సమయంలో టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు కూడా పోడియంను చుట్టుముట్టాయి. బిల్లును వెనక్కి పంపాలని సీఎం స్పీకర్ నాదెండ్లకునోటీసు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సోమవారం సభలో చర్చ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. మొదట అరగంటపాటు వాయిదాపడ్డ సభ తిరిగి 11.10 నిమిషాలకు ప్రారంభమై కేవలం నాలుగైదు నిమిషాల్లోనే మరో గంటపాటు వాయిదా పడింది. అనంతరం సభ తిరిగి 1.25 నిమిషాలకు ప్రారంభం కాగానే అదే దశ్యం పునరావతమైంది. దీంతో సభ మంగళవారానికి వాయిదా పడింది.

తొలుత సభ ప్రారంభమైన తర్వాత బిల్లుకు వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోవడానికి వీల్లేకుండా తెలంగాణ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, జోగురామన్న, హన్మంత్‌షిండే, చెన్నమనేని రమేష్, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సుద్దాల దేవయ్య, ఎల్ రమణ, మహేందర్‌రెడ్డి తదితరులు పోడియం వద్దకు చేరుకున్నారు. వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా పోడియం వద్దకు వచ్చి సమైక్య నినాదాలు చేస్తూ, ఓటింగ్‌పై స్పీకర్‌తో మాట్లాడారు. ఈ సమయంలోనే సీఎం ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, బిక్షమయ్యగౌడ్, వెంకట్‌రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ అనిల్ తదితరులు పోడియంను చుట్టుముట్టారు. వెంటనే మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజీనామా చేసిన మంత్రి శ్రీధర్‌బాబు పోడియం వద్దకు వెళ్లారు.

ఈ సమయంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూర్చున్న మంత్రులను లేపి, మళ్లీ పోడియం వద్దకు పంపి, తాను తన స్థానంలోనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్దకు మంత్రులు కూడా రావడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి సభ 11.10నిమిషాలకు ప్రారంభమైన తర్వాత కూడా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్, టీడీపీ టీ, సీపీఐ, బీజేపీ సభ్యులు కూడా పోడియంను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యే జై తెలంగాణ, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.